I
గౌతమి, కృష్ణవేణులకు ఆవాసమై, పాడిపంటలకు నిలయమైన తెలుగుసీమలోని పల్లెపట్టులలో కళాసౌందర్యము అడుగడుగున గోచరిస్తున్నది. తెలుగువారి భాష యెంత మధురమైనదో, వారి సామాజిక జీవనమంత సుందరమైనదని చెప్పితే అతిశయోక్తి ఆవంతయునుగాదు. భారతదేశమంతటిలో నున్నట్లే తెలుగుసీమలో గూడ నూటికి తొంబదిపాళ్ల జనులు పల్లెటూళ్ళలోనున్నారు. తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు, క్రీడావినోదాలు ఎన్నియో ఇక్కడ కలవు. ఈ క్రీడావినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది.
స్త్రీలకు, పురుషులకు, బాలబాలికలకు ప్రత్యేకంగా కొన్ని వినోదాలు, ఆటపాటలు ఉన్నవి. వీనితోపాటు స్త్రీ పురుషులకు సమానముగా ఆదరణీయములైన వినోదాలు, క్రీడలు కూడ కొన్ని కలవు. ఈ క్రీడలలోను, వినోదాలలోను తెలుగు ప్రజల స్వభావ గుణమైన సౌందర్యరక్తి మనకు స్పష్టంగా కనుపిస్తుంది. ఇందులో కొన్ని విశ్రాంతి సమయాలలో ఆటవిడుపు కొరకు ఉద్దేశించిన క్రీడావినోదాలు, మరికొన్ని పండుగపబ్బాలలో సర్వజనులు సమానముగా ప్రోత్సహించి, ఆనందించే వినోదాలు, ఇంక కొన్ని పెండ్లిండ్లు మొదలైన శుభకార్యాల సందర్భాలలో నిర్వహించే వేడుకలు. కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో నుండునవి. మరికొన్ని క్రీడలు సార్వజనికమైనవి అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో నుండునవి. ఈవిధంగా జనుల ఆర్థికస్థితిని అనుసరించి, వయస్సును అనుసరించి, విజ్ఞానమును అనుసరించి, మనోరంజనము గావించు క్రీడలు తెలుగు సీమలో పుష్కలంగా వున్నవి.
ఈ వినోదాలలోను, వేడుకలలోను, పాటలను మొట్టమొదలు పేర్కొనవలసి వుంటుంది. పొలములో కలుపుదీసే పడుచులు, ఎద్దులను గాసే బాలకులు, సంపన్నుల యిండ్లలో కావలసినంత తీరికవున్న స్త్రీలు, బాలికలు, ఈ పాటలను పాడుతూ వుంటారు. పూర్వకాలంలో తుమ్మెదపదాలు, పర్వతపదాలు, శంకరపదాలు, నివాళిపదాలు మనదేశములో అధిక వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాని యీనాడు ఈ పాటలు ఇంచుమించుగా నశించినవనే చెప్పవలసి వున్నది. సేద్యముచేస్తూ కూలీలుపాడే జాజరపాటలు ఈనాటికిని కొన్ని ప్రాంతాలలో విశేష వ్యాప్తిలో వున్నవి. హైద్రాబాదు నగరానికి నూరుమైళ్ళలోనున్న వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో ఈ పాటలను రైతు యువకులు మక్కువతో ఈనాటికీ పాడుకుంటున్నారు. ప్రత్యేకంగా స్త్రీలు పాడుకొనే పాటలు గూడ యెన్నో పున్నవి. ఇందులో పెండ్లి పాటలు, కూతురుని అత్తమామలకు అప్పగించే సందర్భంలో పాడే అప్పగింతపాటలు, మంగళహారతులు, ముఖ్యంగా పేర్కొనదగియున్నవి. తెల్లవారకముందే లేచి మేలుకొలుపులు ఆలపించే అలవాటు ఈనాటికిని మన పల్లెటూళ్లలోని పూర్వపద్ధతి కుటుంబాలలో కనుపిస్తున్నది. పసిపిల్లలను ఉయ్యాలలో నిద్రబుచ్చుట కొరకు పాడే జోలపాటలను మనదేశంలో విననివారు ఉండరని చెప్పవచ్చును. ఈవిధంగా వివిధములైన పాటలు వివిధ సందర్భాలలో మన పల్లెటూళ్లలో వీనులకు విందు జేస్తుంటవి.
ఆటలకూ పాటలకూ వీడరాని చుట్టరికమున్నది. తెలుగు పల్లెలలో రకరకాలైన ఆటలను మనము చూడవచ్చును. ఈ ఆటలు మనస్సుకు ఉల్లాసము కలిగించే వేడుకలు. ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. ఈ తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాలనుండి ఉపాసించిన కళ. ఒక సన్ననిబట్టను తెరగాగట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెరవెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలు గట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడింతురు. ఈ ఆటను ఆడించే నిపుణులైనవారు కొందరు, మన పల్లెటూళ్ళలో తిరుగుతూ వుంటారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణమూ, భారతమూ, మన దేశీయులలో ప్రతి రక్తకణమునందును జీర్ణించిన కథలు.
ఈ తోలుబొమ్మలాట వలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీధినాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని గూడ పిలుస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రిందటివరకు మన పల్లెటూళ్లలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ వుండేవి. ఎన్నో నూర్ల సంవత్సరాలనించి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ల ప్రజలను రంజింపజేస్తున్న వినోదాలు, వేడుకలు. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. భజనమండలులను స్థాపించి, వారానికొకసారి (ఏ శనివారమునాటి సాయంత్రమో) ప్రజలొకచోట సమావేశమై భజనలు గావించుట మన పల్లెటూళ్లలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదము. ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలికథ, బాలనాగమ్మ కథ మొదలైనవి. ఈ కథలను చెప్పేవారు గంటలతరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా, పల్లెటూరి ప్రజలను ఆకర్షించి, వినోదింప జేస్తుంటారు. కాని ఈనాటి మారిన పరిస్థితులలో వీటికన్నింటికీ వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ కథలను జెప్పేవారి
నేర్పు చాలగొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా వీరగాథలను వీరు చెప్పుచుందురు.
ఆలోచించండి - చెప్పండి
స్త్రీలు ఏయే పాటలు పాడుకుంటారు? మీకేమైనా తెలిస్తే చెప్పండి.
గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది? అది ఎందుకు బాగా నచ్చి ఉంటుంది?
మీకు నచ్చిన గ్రామీణ వినోదం ఏది? అది ఎందుకు నచ్చింది?
II
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు, మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తున్నవి. రంగురాట్నము ఈ విధమైన వేడుకలలో ఒకటి. జనులు ఈ రంగురాట్నము ఎక్కి గిర్రున తిరుగుట అందరికి బాగా తెలిసిన వినోదమే. హైద్రాబాదు నగరంలో ప్రతి సంవత్సరము జరిగే అఖిల భారత ప్రదర్శనపు ఆవరణలోపల ఈ వినోదాన్ని చూడవచ్చును. మన పల్లెటూళ్ళకు ప్రత్యేకమైనది గిల్లిదండ అనే ఆట. ఈ ఆట చాలా పురాతనమైనది. తెలంగాణపు పల్లెటూళ్ళలో దీనిని చిర్రగోనె అని కూడ అంటారు. మన కవులు వ్రాసిన పుస్తకాలలో ఈ ఆట మనోహరంగా వర్ణింపబడింది. భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడినారంటే, ఇది యెంత పురాతనమైనదో తెలుస్తుంది. ఒక చిన్న కర్రముక్కను పెద్ద కర్రతో కొట్టుతూ, ఈ ఆటను ఆడుతుంటారు. ఈ ఆటను క్రికెట్టుతో పోల్చవచ్చును. కొందరు దీనిని స్వదేశీ క్రికెటు అని మెచ్చుకోవడం కలదు. కోడిపందెములు తెలుగుదేశీయులు ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల క్రిందటివరకు అభిమానించిన ఆట. ముఖ్యంగా సంక్రాంతి సందర్భములో, ఈ ఆటను అత్యంత ఆసక్తితో ఆడేవారు. ఈ ఆట గూడ పలనాటి వీరచరిత్రలో చక్కగా వర్ణింపబడింది. బొంగరాల ఆట మన గ్రామాలలో మిక్కిలి ప్రచారములోనున్న క్రీడ. పిల్లలకు ఈ ఆటలో మిక్కిలి ఆసక్తి. ఇవన్నీ గృహాల వెలుపల బహిరంగ ప్రదేశాలలో ఆడే ఆటలు. ఈ ఆటలు జరుగుతూ వుంటే జనులు ఎంతో ఉత్సాహంతో వీనిని తిలకించుతుంటారు.
ఈ ఆటలతోపాటు కాలక్షేపముకొరకు, ఇండ్లలో కూర్చుండి ఆడే ఆటలు ప్రత్యేకమైనవి కొన్ని వున్నవి. ఈ ఆటలలో చదరంగము మిక్కిలి ముఖ్యమైనదే కాక చాల ప్రసిద్ధిచెందినది. అసలు ఈ ఆట మొట్టమొదట మన దేశములోనే ప్రారంభమైనదని కొందరు చెప్పుతుంటారు. ఏమైనప్పటికీ, ఈ ఆటకు మన పల్లెటూళ్ళలోని కుటుంబాలలో మంచి ప్రచారము వున్నది. ఈ ఆట ఆడటంలో కొందరు సాటిలేని నైపుణ్యము కలిగి వుంటారు. చదరంగము వంటి ఆట యింకొకటి పులిజూదము. ఈ పులిజూదము మూడురకాలుగా వున్నది. ఒక పటము మీద, చిన్న రాళ్ళనో లేక చింతగింజలనో తీసికొని, కొన్నింటిని పులులుగాను, కొన్నింటిని మేకలుగాను భావించి, ఆడే ఆట యిది. పులులసంఖ్య మూడింటికన్న మించదు. మేకలసంఖ్య పదహారింటి వరకు వుంటుంది. ఒకరు పులులను తీసికొని, యింకొకరు మేకలను తీసికొని ఈ ఆటను ఆడుచుందురు. ఇప్పుడు ప్రచారము తగ్గిపోయినా, యిటీవల వరకు, మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట పాచికల ఆట; దీనికి అక్షక్రీడ అని మరోపేరు ఉన్నది. ఈ ఆట గూడ తరతరాల నుండి మనదేశములోని ప్రజలను ఆకర్షించినది. మన ప్రబంధాలలో ఈ ఆటను రమణీయంగా మనకవులు వర్ణించినారు. రుక్మిణీకృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశములో మనోహరముగా వర్ణింపబడినది. ఈ తరగతికి చెందిన యింకొక ఆట పచ్చీసు. ఈ ఆటలో స్త్రీలకు ఆసక్తి ఎక్కువ. రంగుగుడ్డలో అందముగా పచ్చీసును కుట్టించి, దానిమీద పూసలతో ఇండ్లను ఏర్పాటుచేసి, గవ్వలను వేస్తూ ఈ ఆటను ఆడే దృశ్యము పల్లెటూళ్ళలో ఏమాత్రము కొద్ది పరిచయము కలిగినవారికైనా బాగా పరిచితమైనదే. ఈ ఆటలు మన గ్రామీణ సంస్కృతి శోభకు మంచి ప్రతిబింబాలు. A
జనులను వినోదింపజేయడానికి ప్రత్యేకంగా ఉద్దేశించిన వేడుకలు 305° యెన్నో మన మన పల్లెటూళ్ళలో చూడవచ్చును. వినోదాలే వృత్తిగా కలిగినవారు గూడ కొందరున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రోత్సాహము లేనందువలన జీవనోపాధి కొరకు వీరు యితర వృత్తులను అవలంబించడంచేత వీరి సంఖ్య తగ్గిపోతున్నది.. గంగిరెద్దులను అలంకరించి, యిల్లిల్లు తిరిగేవారు ఈ శ్రేణికి చెందినవారే. పగటివేషాలను వేసుకొని, ప్రజలను వినోదింపజేసేవారు మనకు కనిపిస్తుంటారు. వీరిని పగటివేషాల వారనీ, బహురూపులు వారనీ పిలుస్తుంటారు. విప్రవినోదులనే వారు గారడీవిద్యలో ప్రవీణులు. వీరు అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తుంటారు. వీరందరూ, జనుల పోషణ మీద ఆధారపడి ఈ పనులను వృత్తిగా తీసికొని, అందులో గొప్ప నైపుణ్యం సంపాదించి నటువంటివారు.
పల్లెటూళ్ళలో ఉయ్యాలలూగుట బాలబాలికలే గాక పెద్దలు గూడ మిక్కిలి మక్కువ చూపించే క్రీడ. ఏదోవిధమైన ఉయ్యాలను మనము అనేక గృహాలలో చూడవచ్చును. ఈమధ్య యితర క్రీడల వలెనే, సన్నగిల్లిపోతున్నప్పటికినీ గుర్రపుస్వారీ మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ, మల్లయుద్ధాలు, కుస్తీలు మొదలైనవి తరతరాలనుండి మనవారు అభిమానించి, ప్రోత్సహించిన క్రీడలు. తెలుగుదేశంలోని జమీందార్లు ఇందులో ప్రవీణులైనవారిని తమ ఆస్థానాలలోనికి చేరదీసి వారిని పోషించిరి. దసరాపండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన యీ మల్లయుద్ధ ప్రదర్శనలు కుస్తీలు జరిపించి, వారికి బహూకరించే ఆచారము ఇటీవలివరకు మన పల్లెటూళ్ళలో వుండేది: కత్తిసాము, కట్టెసాములలో ప్రవీణులైనవారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును.
ఆలోచించండి - చెప్పండి
స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు ఎందుకు ప్రజలకు నచ్చుతాయో చెప్పండి.
ఈరోజుల్లో స్త్రీలు మధ్యాహ్నవేళ పచ్చీసు మొదలైన ఆటలు ఎందుకు ఆడటం లేదో చెప్పండి.
III
కొన్ని వేడుకలు, వినోదాలు, క్రీడలు ప్రత్యేకమైన సందర్భాలలో జరుగుతుంటవి. దసరాపండుగకు ముందు, తొమ్మిది దినాలు బాణసంచాలను కాల్చడం, జనుపకట్టలను కాల్చడం ఈ తరగతికి చెందిన వినోదము. పిల్లలు ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజూ ఈ వేడుకను జరుపుకుంటూ ఆనందిస్తారు. హెూళీపండుగ సందర్భంలో ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవడం కూడ యిటువంటి వేడుకలే. ఏరువాకపున్నమ అనగా జేష్ఠపున్నమ. రైతులకు మిక్కిలి సంతోషకరమైన పబ్బము. ఆనాడు వారు తమ యెడ్లను కడిగి, వాటిని రంగురంగులతో అలంకరించి, తమ నాగళ్ళమీద ఎర్రమన్నుతోను, సున్నముతోను పట్టెలనువేసి, ఆ నాగళ్ళను భుజాలమీద వేసికొని, యెడ్లతోపాటు ఊరేగి, పొలాలకు వెళ్ళి దుక్కిదున్ని ఆ సంవత్సరపు వ్యవసాయపు పనులను అత్యంత ఉత్సాహముతో ప్రారంభించుదురు. శ్రీరామనవమినాడు బండ్లను గట్టుకొని ఊరేగుట పల్లెటూళ్ళలో మనము గమనించు మరొక వేడుక. సంక్రాంతికి తీర్థాలకు వెళ్ళే ఆచారము తెలంగాణపు పల్లెటూళ్ళలో ప్రజలకు మిక్కిలి ప్రేమపాత్రమైన వేడుక. బండ్లను గట్టుకొని తమతమ కుటుంబాలతో సంక్రాంతినుండి శివరాత్రి మధ్య జరిగే ఈ జాతరలలో వీరు పాల్గొంటారు. ఇటువంటి జాతరలలో ప్రసిద్ధమైనవి కొరవిజాతర, ఐనవోలు జాతర, మేడారముజాతర మొదలైనవి. ఈ జాతరలలో అసంఖ్యాకముగా జనులు పాల్గొంటారు దేవాలయాలలో సీతాకల్యాణము మొదలైన ఉత్సవాలు జరిపించడం పల్లెటూరు ప్రజలకు అభిమానాస్పదమైన వేడుక. శక్తిపూజలు పల్లెటూరి ప్రజానీకములో చాల ప్రచారంలో వున్నవి. దుర్గ, కాళి, ఎల్లమ్మ మొదలైన దేవతలకు మేకపోతులను బలియిచ్చే వేడుక చాల ప్రసిద్ధమైనది.
ఈవిధంగా అన్ని తరగతుల వారికి అభిమానాస్పదమైన వేడుకలు, వినోదాలు, మన పల్లెటూళ్ళలో పుష్కలముగా వున్నవి. కొన్ని వినోదాలు, క్రీడలు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఇందులో కోలాటము ముఖ్యంగా పేర్కొనదగినది. కామునిపున్నమకు ముందు వెన్నెల రాత్రులలో యువతులు ఈ కోలాటము వేసే పద్ధతి తెలంగాణపు పల్లెటూళ్ళలో బాగా ప్రచారంలో వున్నది. పురుషులు గూడ కోలాటము వేయడం, ఆ సందర్భాలలో పాటలు పాడడం కొన్ని ప్రాంతాలలో కనుపిస్తుంది. అందుచేత దీనిని స్త్రీ పురుషులకు సమాన ఆదరణీయమైన క్రీడ యని కూడ చెప్పవచ్చును.
ప్రత్యేకంగా బాలికలు అభిమానించే ఆట చెమ్మచెక్క ఆట. తెలుగుసీమలో ఏ పల్లెటూరికి వెళ్ళినా చూడ వచ్చును. అచ్చనగండ్ల ఆట మన పల్లెటూళ్ళ బాలికలు అభిమానించే మరొక రమ్యమైన క్రీడ. క్రచ్చకాయలను ఎగురవేస్తూ, ఆడపిల్లలు ఈ ఆటను ఆడే దృశ్యము మిక్కిలి సుందర మైనది. ఓమన గుంటలఆట బాలికలకు, యువతులకు అభిమానాస్పదమైన క్రీడ. ఒక కట్టె దిమ్మలో పద్నాలుగు గుంటలు చెక్కించి, వాటిలో చింతగింజలు పోసి ఈ ఆటను ఆడుతుంటారు. ఈవిధమైన కట్టే దిమ్మెలు పల్లెటూళ్ళకు ఉవెళ్లి చూస్తే అనేక కుటుంబాలలో కనిపిస్తుంటవి. గుజ్జనగూళ్ళ ఆట గూడ బాలికలకు ప్రత్యేకమైనది. రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతనగారు తెలిపినారు. బొమ్మరిండ్లలో గూర్చుండి బాలికలు గురుగులలో రకరకాల వంటలు వండి వడ్డించునట్లుగా వినోదించే ఈ ఆట ఆడపిల్లలకు మిక్కిలి ప్రియమైనది. బిగిన గింజల ఆట బాలికలు అభిమానించే మరొక క్రీడా విశేషము. ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు, యువతులకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యము ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూళ్ళ యందు పుష్కలముగా కనిపిస్తుంటారు. ఈ ముగ్గులు తెలుగుపడతుల సౌందర్యరక్తికి, కళాభిరుచికీ, మేలి ఉదాహరణాలు. ఈనాడు ఎక్కువగా వ్యాప్తిలో లేకపోయినా చిలుకలను పెంచి, వానికి బుద్ధులు చెప్పి వినోదించుట తెలుగు సీమలోని పల్లెటూళ్ళ యందలి సంపన్న గృహాలలోని సుందరాంగుల వేడుకలలో బహు రమ్యమైనది.
ఈవిధంగా మన పల్లెటూళ్ళ జీవితాన్ని పరిశీలించితే, క్రీడలకు, వినోదాలకు మనవారు ఎంత ముఖ్యమైన స్థానాన్ని యిచ్చినారో వెల్లడి కాగలదు. క్రీడాభిరామమైన పల్లెటూరి జీవితములోని ఉత్తమ సంస్కృతిని ఈ క్రీడలు, వేడుకలు, వినోదాలు మనకు వెల్లడి చేస్తున్నవి.
ఆలోచించండి - చెప్పండి.
మీకు తెలిసిన జాతర గురించి చెప్పండి.
* 'ముగ్గులు స్త్రీల కళాభిరుచికి ఉదాహరణలు' అనే రచయిత అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
* గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి