వేమన శతకం పద్యాలు vemana pdyalu
నిక్కమైన మంచినీల మొక్కటిచాలుఁ దళుకు బెళుకు తాళ్లు తట్టెడేల చాటునద్య మిలను జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ॥
గంగగోవుపాలు గంటెడైనను జాలుఁ గడవెడైన నేల ఖరముపాలు భ క్తిగలుగు కూడు పట్టెడే చాలు విశ్వదాభిరామ వినుర వేమ॥
చిత్తశుద్ధిగలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియుఁ గొదవకాదు విత్తనంబు మఱివృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినుర వేమ॥
ఆత్మశుద్ధి లేని యాచార మది యేల భాండశుద్ధిలేని పాక మేల చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ॥
మిరపగింజచూడ మీఁద నల్లగనుండుఁ గొఱికిచూడ లోనఁ జుఱుకుమనును సజ్జనులగువారి సార మిట్లుండునా విశ్వదాభిరామ వినుర వేమ॥
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండుఁ బరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైనవారి గుణము లీలాగురా విశ్వదాభిరామ వినుర వేమ॥
అల్పుఁ డెపుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కుఁ జల్లగాను గంచు పలికినట్లు కనకంబు పల్కునా విశ్వదాభిరామ వినుర వేమ॥
నిండు నతులుపాఱు నిలిచి గంభీరమై వెట్టివాఁగు పాఱు వేగఁబొర్లి అల్పుఁడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినుర వేమ ॥
గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికివాఁగు పాఱు మ్రోఁతతోడఁ బెద్దపిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ వినుర వేమ॥
నేరనన్నవాఁడు నెఱజాణ మహిలోన నేర్తునన్నవాఁడు నిందచెందు ఊరకున్న వాఁడె యుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినుర వేమ॥
మేడిపండు చూడ మేలిమై యుండును బొట్ట విచ్చి చూడఁ బురుగు లుండుఁ బిఱికివానిమదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినుర వేమ॥
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు మాటకన్న నెంచ మనసు దృఢము కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినుర వేమ॥
కులములోన నొకఁడు గుణవంతుఁ దుండినఁ గులము చెడును వాని గుణమువలన ఎలమిఁ జెఱకునందు నెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినుర వేమ॥
ఉత్తముని కడుపున నోగ జన్మించిన వాఁడె చెఱుచు వానివంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెఱుపదా తీపెల్ల విశ్వదాభిరామ వినుర వేమ॥
రాముఁ దొకఁడు పుట్టి రవికుల మీడేర్చెఁ గురుపతి జనియించి కులముఁ జెఱిచె ఇలను బుణ్యపాప మీలాగు గాదకో విశ్వదాభిరామ వినుర వేమ॥
వేఱుపురుగు జేరి వృక్షంబుఁ జెఱుచును జీడపురుగు చేరి చెట్టుఁ జెఱుచుఁ గుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱుచురా విశ్వదాభిరామ వినుర వేమ॥
హీనగుణమువాని నిలుసేర నిచ్చిన ఎంతవానికైన నిడుమ గలుగు ఈఁగ కడుపు చొచ్చి యిట్టట్టుసేయదా విశ్వదాభిరామ వినుర వేమ॥
హీనుఁ డెన్ని విద్య లిలను నేర్చినఁగాని ఘనుఁడుగాడు హీనజనుఁడేగాని పరిమళములుగార్దభముమోయ గజమౌనె విశ్వదాభిరామ వినుర వేమ॥
ఎంతచదువు చదివి యేనీతి విన్న ను హీనుఁ డవగుణంబు మాసఁ డెంచు బొగ్గు పాలఁ గడుగఁబోవునా మలినంబు విశ్వదాభిరామ వినుర వేమ॥
చదువులన్ని చదివి చాల వివేకియై కలుష చిత్తుఁడైన ఖలుని గుణము దాలిగుంట వేఁపి తలఁచెడు చందమౌ విశ్వదాభిరామ వినుర వేమ॥
విద్య లేనివాఁడు విద్యాధికులు చెంత నుండినంతఁ బండితుడు కాండు కొలనిహంసలకడఁ గొక్కెర యున్నట్లు విశ్వదాభిరామ వినుర వేమ॥
అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్లఁ తొలగుగొట్టు జెప్పుదినెడి కుక్క చెఱకు తీపెఱుఁగునా విశ్వదాభిరామ వినుర వేమ॥
అల్పుఁడైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారిఁ దిట్టి తోలగొట్టు అల్పజాతి మొప్పై యధికుల నెఱుఁగునా విశ్వదాభిరామ వినుర వేమ॥
ఎద్దుకైనఁగాని యేఁడాది తెల్పిన మాటదెలిసి నడుచు మర్మమోరిఁగి మొప్పె తెలియలేఁదు ముప్పదేండ్లకు నై న విశ్వదాభిరామ వినుర వేమ॥
ఎలుకతోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపెగాని తెలుపుగాదు కొయ్యబొమ్మఁ దెచ్చి కొట్టినఁ బలుకదు విశ్వదాభిరామ వినుర వేమ॥
కుక్క తోఁక గెచ్చి క్రోవిలోఁ బెట్టినఁ గ్రోవిచాయ నుండుఁ గొందవఱకుఁ గ్రోవి తీసిచూడఁ గొడవలివలె నుండు విశ్వదాభిరామ వినుర వేమ॥
పాముకన్న లేదు పాపిష్టి జీవంబు అట్టిపాము చెప్పినట్టె వినను ఖలునిగుణముమాన్పు ఘనులెవ్వరును లేరు విశ్వదాభిరామ వినుర వేమ॥
వేము పాలువోసి ప్రేమతోఁ బెంచిన జేఁదు విఱిగి తీపు చెందఁబోదు ఓగు నోగెగాక యుచితజ్ఞుఁ డోటెలౌను విశ్వదాభిరామ వినుర వేమ॥
పాలు పంచదార పాపరపండ్లలోఁ జాలఁ బోసి వండఁ జవికి రాదు కుటిల మానవునకు గుణ మేల గల్గురా విశ్వదాభిరామ వినుర వేమ॥
ముష్టి వేఁపచెట్టు మొదలంటఁ బ్రజలకు బరఁగ మూలికలకుఁ బనికివచ్చు నిర్ణయాత్మకుండు నీచుఁ డెందుకౌను విశ్వదాభిరామ వినుర వేమ!
మైలకోకతోడ మాసిన తలతోడ ఒడలు ముఱికితోడ నుండెనేని అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ వినుర వేమ॥
చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డపా లదెంతహితవు పదుగురాడుమాట పాటింప నిజమయా విశ్వదాభిరామ వినుర వేమ॥
పదుగురాడుమాట పాటియై ధరఁజెల్లు ఒక్కఁడాడుమాట యెక్కదెందు ఊరకుండువాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినుర వేమ॥
ఉప్పు లేనికూర యూనంబు రుచులకుఁ ఒప్పు లేనితిండి ఫలము లేదు అప్పు లేనివాఁడె యధిక సంపన్నుఁదు. విశ్వదాభిరామ వినుర వేమ॥
పట్టుపట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగాయఁ బట్టవలయుఁ బట్టి విడుటకన్నఁ బరఁగ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినుర వేమ॥
పట్టి విడువరాదు పదిలక్షలకునైనఁ బెట్టి చెప్పరాదు. పేఁదకైన వెట్టి గొలువ రాదు విభుఁ డెంత ఘనుఁడైన విశ్వదాభిరామ వినుర వేమ॥
కానివానితోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిఁగానె గాంతు రెవనిఁ దాటిక్రిందఁ బాలుత్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినుర వేమ॥
కానివానితోడఁ గలసి వ ర్తించిన హానివచ్చు నెంత వానికైనఁ దాటిక్రిందఁ బాలుత్రాగిన విధమౌను విశ్వదాభిరామ వినుర వేమ॥
పాలు నీడిగింటఁ గ్రోలుచునుండెనా మనుజులెల్లఁగూడి మద్యమండ్రు నిలువఁదగనిచోట నిలువ నిందలువచ్చు విశ్వదాభిరామ వినుర వేమ॥
కోఁతి నొనరఁదెచ్చి కొ త్తపట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్టు నీతిహీనునొద్ద నిర్భాగ్యు లుండుట విశ్వదాభిరామ వినుర వేమ॥
కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు సత్యమాడువాని స్వామి యెఱుఁగుఁ బొక్కు తిండిపోతుఁ బెండ్లా మెఱుంగురా విశ్వదాభిరామ వినుర వేమ॥
కల్ల నిజములెల్లఁ గరకంఠుఁ డెఱుఁగును నీరు పల్లమెఱుఁగు నిజముగాను దల్లి తానె ఱుంగును జ్ఞానముని జన్మంబు విశ్వదాభిరామ వినుర వేమ॥
అనగననగ రాగ మతిశయిల్లుచునుండుఁ దినఁగదినగ వేముల దీపు గలుగు సాధనమునఁ బనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేము॥
తామసించి చేయఁదగ వెట్టికార్యంబు వేగిరింప నదియు విషమమగును బచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినుర వేమ
కోపమునను ఘనత కొంచమై పోవును గోపమునను మిగుల గోడు గలుగుఁ గోప మణంచెనేని గోర్కెలు నీడేఱు విశ్వదాభిరామ వినుర వేము॥
గురు బృహస్పతియును గుణ మించుకయు లేక చందమామకిచ్చె శాపమపుడు గురుడు కోపమూనఁ గూడ దెప్పటికైన విశ్వదాభిరామ వినుర వేమ॥
నక్కనోటికండ నదిలోన మీనుకై తిక్కవట్టి విడిచి మొక్కువెట్టె మక్కు వైనగ్రద్ద మాంసమెత్తుక పోయె విశ్వదాభిరామ వినుర వేమ॥
తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనులకెల్ల నుండుదెప్పు తప్పు లెన్ను వారు తమతప్పు లెఱుగరు విశ్వదాభిరామ వినుర వేమ॥
తనకుఁగల్గు పెక్కుతప్పులు నుండఁగా ఓగునేరమెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినుర వేము॥
ఆ. ఇనుము విఱిగెనేని యినుమాఱుముమ్మాఱు కాచి యతుకవచ్చు గ్రమముగాను మనసు విఱిగెనేని మణి చేర్చ రాదయా విశ్వదాభిరామ వినుర వేమ॥
ఒకనిఁ జెఱిచెదమని యుల్లమందెంతురు తమదు చేటోఱుఁగరు ధరను నరులు తమ్ముఁ జెఱచువాఁడు దైవంబుగాఁడకో విశ్వదాభిరామ వినుర వేమ॥
చంపఁదగినయట్టి శత్రువు తనచేతఁ జిక్కెనేనిఁ గీడు సేయరాదు పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినుర వేమ॥
మాటలాడ నేర్చి మనసు రాజిలఁజేసి పరఁగఁ బ్రియము చెప్పి బడలకున్న నొకరిచేతిసొమ్ము లూరక వచ్చునా విశ్వదాభిరామ వినుర వేమ॥
కానివానిచేతఁ గాసువీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడు వెఱ్ఱివాడు పిల్లి తిన్న కోడి పిలిచినఁ బలుకునా విశ్వదాభిరామ వినుర వేమ॥
స్వాతిమెఱుముచూచి సంతోషపడుదును స్వాతిమెఱు మదేమి సఫలమౌను మెఱుమునురుము రాక మేఘంబుగురియునా విశ్వదాభిరామ వినుర వేమ ॥
వాన గురియకున్న వచ్చును క్షామంబు వాన గురిసెనేని వఱదపారు వరద కఱవు రెండు వరుసతో నెఱుఁగుడీ విశ్వదాభిరామ వినుర వేమ॥
పుట్టినజనులెల్ల భూమిలోనుండినఁ బట్టునా జగంబు పట్టదెపుడు యముని లెక్కరీతి నరుగుచునుందురు విశ్వదాభిరామ వినుర వేమ॥
వానరాకడయును బ్రాణంబు పోకడ కానఁబడ దెంత ఘనునికైనఁ గానఁబడినమీఁదఁ గలి యెట్లు నడచురా విశ్వదాభిరామ వినుర వేమ॥
చిప్పఁబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె నీటఁబడ్డ చినుకు నీటఁగలసెఁ బ్రాప్తిగల్గుచోట ఫలమేల దప్పురా విశ్వదాభిరామ వినుర వేమ ॥
ఎన్ని చోట్లు తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ వినుర వేమ॥
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి