ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణధురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు.... అతడొక చారిత్రక పురుషుడు...

 సోమనాద్రి

(చారిత్రక వీరగాథ)

అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం.

శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి 'పెద్ద సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ.1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయా పొందినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని. గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. ఈవిధంగా గద్వాలసంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల గంభీరవిగ్రహం, దృఢమైన నల్లనిశరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు గంభీరంగ, శత్రువులకు ప్రళయకాల రుద్రునివలె కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతిగుర్రంమీద స్వారిచేస్తూ, యుద్ధరంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.


సోమనాద్రి 'పూడూరు' ను రాజధానిగ చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల పట్టణంగ ప్రసిద్ధికెక్కిన ప్రదేశమంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్యప్రాంతంగ ఉండేది. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి, అది తన రాజధానికి అన్ని విధాలా అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న ‘ఉప్పేడు' కోటను సయ్యద్ దావూద్ మియా పాలిస్తున్నాడు. అతడు గోల్కొండ కోట పాలకుడు, నిజాం నవాబూ అయిన నాసిరుద్దాలాకు ఆప్తుడు. దావూద్ మియా, సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని అందువల్ల కోట కట్టడానికి వీలులేదని అడ్డు చెప్పాడు.

సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తికాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి, సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని, దావూద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకొన్న దావూద్మీయా మండిపడ్డాడు. ముందువెనకలు ఆలోచించకుండ సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. రాయచూరు నవాబయిన బసరు జంగు, ప్రాగటూరు కోటకు అధిపతి అయిన ఇదురుసాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు, రాయచూరుకు మధ్య ప్రాంతమైన 'అరగిద్ద' దగ్గర మోహరించాయి. సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంటపెట్టుకొని, సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి ధాటికి తట్టుకోలేని బసరుజంగు యుద్ధంనుంచి తప్పుకొని, తన సైన్యంతో ఇంటిముఖం పట్టాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రాగటూరు నవాబు కూడ బుద్దితెచ్చుకొని మెల్లగ జారుకున్నాడు. ఉప్పేడు నవాబు సయ్యద్ దావూద్ మియా మాత్రం మిగిలి ఏకాకి అయిపోయాడు. ఇక చేసేదిలేక, తాను కూడ ఉప్పేడు దారిపట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. సోమనాద్రి తన గుర్రాన్ని ఏనుగుమీదికి ఉసికొల్పాడు. దావూద్ మియా భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాద్రిని శరణు కోరుకున్నాడు. ఇక ముందెన్నడు సోమనాద్రి జోలికి రానని మాట ఇచ్చాడు. యుద్ధ పరిహారంగా తన యుద్ధచిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకొని, తలదించుకొని ఉప్పేడు చేరుకున్నాడు.

ఎట్లానో ఆరాత్రి గడిపాడు సయ్యద్ దావూద్ మియా. మర్నాడు ఉదయాన్నే తన కోటమీదకి ఎక్కి, గద్వాల కోటకేసి చూశాడు. గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చజెండా కనిపించేసరికి క

డుపులో మండింది. ఎట్లాగైన తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే పల్లకిలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించి తనకు మనశ్శాంతిని చేకూర్చుమని కోరాడు. నిజాం నవాబు నాసిరుదౌలా, సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ ఆలోచన మానుకోమని రకరకాలుగా నచ్చజెప్పాడు. కాని సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేది లేక, నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాద్రిమీద యుద్ధానికి బయలుదేరాడు.


పూర్వం సోమనాద్రి చేతిలో ఓడిపోయి, పరాభవంతో కుంగిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి చేరారు. ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించ డానికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్తగా నిజాం సైన్యంలో చేరారు.


తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న 'నిడుదూరు'కు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో ఉన్న 'కలుగోట్ల' గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆ నాటి యుద్ధపు ఆనవాళ్ళుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టంలేని సోమనాద్రే మొదట తన సైన్యంతో తుంగభద్రానదిని దాటి తెల్లవారకముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకు భయంకరంగా యుద్ధంచేస్తూ నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి, నదిని దాటి 'కలుగోట్ల' ను చేరి విశ్రమించాడు.


సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి సోమనాద్రిని లొంగదీసుకొనే ఉపాయం చెప్పుమన్నాడు. అప్పుడొక సర్దారు, "సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే ఉన్నది, దాన్ని వశం చేసుకొంటేగాని అతడు వశం కాడు' అని వివరించాడు. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి గుర్రాన్ని దొంగిలించి, అతణ్ణి వంచాలని ఆలోచించాడు. "తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగీరు ఇస్తను" అని ప్రకటించాడు. చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు? చివరకు ఒక సైసు సిద్ధమయ్యాడు. ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి, ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు. ఎట్లాగో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగానుంచి తప్పించాడు. గుర్రం మీదికి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు.

గుర్రాన్ని చూడగనే నిజాము ఆనందానికి అంతులేకుండ పోయింది. వెంటనే ఆ సైసుకు జాగీరుతో పాటు ఒక బంగారు కడియాన్ని కూడ బహుమానంగా ఇచ్చాడు.


తెల్లవారింది. గుర్రంలేకపోవడాన్ని గమనించిన సోమనాద్రి సైన్యంలో కలకలం బయలుదేరింది. తన కుడిచెయ్యి పడిపోయిందని భావించాడు సోమనాద్రి. అయినా ధైర్యాన్ని విడువలేదు. నిజాం సైన్యంతో తలపడ్డాడు. 


ఆరోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు. సాయంకాలం ఉభయ సైన్యాలూ యుద్ధాన్ని విరమించాయి. కలుగోట్ల చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తనవారితో సమాలోచన చేశాడు. "తెల్లారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెస్తారో, వారికి నా గుర్రం ఒక రోజంత ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగ ఇస్తాను" అని ప్రకటించాడు.


గద్వాలకు పదిమైళ్ళ దూరంలో 'బొచ్చెంగన్నపల్లి' అనే గ్రామం ఉన్నది. అక్కడినుంచి వచ్చిన బోయసర్దారు హనుమప్పనాయుడు ఈ విషయం తెలుసుకొన్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్నచొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు. ఆ మోపును అయిదు రూపాయలు ఇస్తేకానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రంకోసం ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్ప. ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనపడింది. గుర్రంకూడా హనుమప్పను చూసి సకిలించింది. గుర్రం కళ్ళల్లో కాంతి, నిక్కించిన చెవులు, తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు హనుమప్పనాయుడిని అనుమానంగా చూశారు. అయినా గుర్రం దంటుపుల్లలకోసం ఇట్లా చేసిందనుకొని సమాధానపడ్డారు.


గుర్రాన్ని చూసిన హనుమప్పనాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు. కొంత సేపటికి ఒకడు వచ్చి క్రయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే తగిన సమయమని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగా (అశ్వశాల)లో ఉన్న గడ్డికుప్ప కిందికి దూరాడు. వెల్లకిలా పడుకున్నాడు. గుర్రం కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తన్నుకుంటూ కాళ్ళకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది. వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు. హనుమప్పనాయుడి అరచేతిని చీల్చుకుని ఆ గూటం భూమిలోకి పాతుకు పోయింది.


నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, స్వామి కార్యం తలుచుకుంటూ, కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు. హనుమప్ప. అర్ధరాత్రి అయింది. సైనికులు అంతా నిద్రిస్తున్నారు. హనుమప్ప తనమీద ఉన్న గడ్డిని పక్కకు నెట్టి కూర్చున్నాడు. కుడి చేయి కదలడం లేదు. గూటం కూడా కదలడం లేదు. ఆలస్యం చేయకుండా ఎడమచేత్తో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు. కుడిచేతిని నరుక్కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగలో చుట్టి గుర్రాన్ని తీసుకొని డేరాలు దాటాడు.


అర్ధగంటలో, ఆనందంతో సోమనాద్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప. ఎడమచేత్తో సలాం చేశాడు. రాజు కోపంతో కన్నెర్ర చేశాడు. హనుమప్ప తన మొండిచేతిని చూపించి, జరిగిందంత వివరించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. నాయుణ్ణి కౌగిలించుకొని సన్మానించాడు. అన్న మాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దానశాసనాన్ని రాయించి ఇచ్చాడు. గుర్రాన్ని చూడగానే సోమనాద్రి ఉత్సాహం ఉరకలు వేసింది. ఉదయాన్నే తన సైన్యాన్ని వెంటపెట్టుకొని నిజాం సైన్యంమీద విరుచుకుపడ్డాడు. సోమనాద్రి జయభేరి ధ్వనులు నిజాం సైన్యం గుండెల్ని బద్దలుచేశాయి. సోమనాద్రిసైన్యం నిజాంసైన్యాన్ని దావానలంలా చుట్టుముట్టింది. భయంకరంగ యుద్ధం సాగింది. ఆనాటి యుద్ధంలో ప్రాగటూరు, బళ్ళారి నవాబులు హతులయ్యారు. సాయంకాలానికి నిజాం సైన్యాన్ని కర్నూలు కోట వరకు తరమడం జరిగింది. సోమనాద్రి కూడా కొద్దిమంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ కర్నూలు కోటలోకి ప్రవేశించాడు. అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతపడ్డాయి. కొద్దిమందితో సోమనాద్రి కోటలోపల ఉన్నాడు; మిగిలిన సైన్యం కోట బయట ఉండిపోయింది.


గద్వాల సర్దారులకు భయం ఎక్కువయింది. దిక్కు తోచడం లేదు. కోట తలుపులను చీల్చడానికి ముమ్మరంగా ప్రయత్నించారు. కాని ఫలితం లేకుండ పోయింది. కోట లోపల ఏం జరుగుతున్నదో, బయట ఉన్న గద్వాల సైన్యానికి తెలియలేదు. కొద్ది మందితోనే కోట లోపల ఉన్న తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు. గద్వాలలో ఉన్న లింగమ్మరాణికి పరిస్థితిని తెలియజేస్తు, తాము తిరిగి వస్తామని కబురు పంపారు. ఆ వీరనారి సమాధానంగా కొన్ని గాజులు, చీరలు, పసుపు, కుంకుమ పంపింది. గద్వాల సర్దారులకు సిగ్గు, క్రోధం కలిగాయి. వెంటనే రెట్టింపు పట్టుదలతో, ధైర్యంతో రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కోట తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.


కోటలోపల కొద్దిమంది సైన్యంతోనే ఉన్నా సోమనాద్రి సోమనాద్రి వీరోచితంగ పోరాడుతున్నాడు. తన సైన్యం చాలవరకు హతమైంది. ఈలోగా బయట ఉన్న తన సైన్యం లోపలికి ప్రవేశించి తనకు బాసటగ నిలిచింది. నిజాం సైన్యంలో అలజడి హెచ్చింది. పిడికెడుమందితోనే సోమనాద్రి కోటలోపల అల్లకల్లోలం సృష్టించాడు. ఇప్పుడు తెల్లవారితే ఇంకేం చేస్తాడో అని భయపడ్డారు. చావగా మిగిలిన గుత్తి, రాయచూరు నవాబులు యుద్ధవిముఖులయ్యారు. ఈ స్థితిలో సోమనాద్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాల మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్తకంఠంతో నచ్చజెప్పారు. ఈ యుద్ధానికి అసలు కారకుడయిన సయ్యద్ దావూద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు.


నిజాం నవాబు మరునాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాద్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు, సమయస్ఫూర్తి గల సోమనాద్రి కూడ సంధికి అంగీకరించాడు. యుద్దపరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజులో ఉన్న 'ఎల్లమ్మ' ఫిరంగిని, రాయచూరు నవాబు అధీనంలో ఉన్న 'రామ, లక్ష్మణ' అనే పేర్లుగల రెండు ఫిరంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలు ఏలుబడిలోని కొంతభాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. ఈ ప్రకారం సోమభూపాలుడు సంధి చేసుకొని, యుద్ధపరిహారం పొంది, విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నాడు.


యుద్ధం ముగిసిన తరువాత సోమనాద్రి తాను అన్నమాట ప్రకారం గుర్రం ఒక దినం తిరిగినంత భూమిని హనుమప్పనాయుడికి ఇనాముగ ఇచ్చాడు. ఈ నాటికీ బొచ్చెంగన్నపల్లిలో హనుమప్ప సంతతివారు ఆ భూములను అనుభవిస్తు, తమకు ఆ భూమి ఎక్కువ కావటంవల్ల అందులో కొంత భూమిని ఇతరులకు ఇనాముగ ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.


(సురవరం ప్రతాపరెడ్డిగారి 'హైందవ ధర్మవీరులు' అనే గ్రంథం ఈ కథకు ఆధారం)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా