ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను గూడ చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాష్టారుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో వున్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలూ - మాండలిక భాషలూ, నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాన్నే. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులును కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని, ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ యింట్లో మాట్లాడే భాషనే బళ్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే ఐళ్లలో చదువుతున్నారు. అయితే, మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకోవటం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో వున్నది. ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఈ నడుమ ఏదో టి.వి. ఛానల్లో "తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి" అని చెప్పటం జరుగుతున్నది. ఇది విన్నప్పుడల్లా నేను రెండు ప్రశ్నలు వేసుకుంటాను. "ఏ తెలుగు? ఎక్కడి తెలుగు" అని.
ఉర్దూ సాహిత్యంలో పండితుల ఫారసీ సమాసాలకంటే, ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీమీర్. అతని కవిత గంభీర భావ భరితమైనా, భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైనది. ఎవరో అతన్నడిగినారట "ఉస్తాద్! ఫారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు గదా మీరు. ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు?" అని, "శుక్రవారం శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటూయిటూ వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. మాట్లాడుకుంటారు. అవి వింటాను,
అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా" అన్నాడట మహాకవి మీర్ తఖీమీర్. ఒక షేర్ గూడ రాసినాడు;
గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుప్తగూ అవామ్ సేహై
ఖాస్ - ఆమ్ అనే రెండు మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది. (స్పెషల్) దాని బహువచనం ఖవాస్, అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైనవాళ్లు, ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు (కామన్ పీపుల్). కవి ఏమంటున్నాడంటే, "నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు కాని నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే" అని
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి