కుంరం భీం
1. కుంరం భీం
'జల్, జంగల్, జమీన్ (నీరు అడవి భూమి) మనది'... అనే నినాదంతో గోండులను, కోయలను, చెంచులను సంఘటితపరచి పోరుబాటలో నడిపించిన విప్లవ వీరకిశోరం కుంరం భీం. 'మా గూడెంలో మా రాజ్యం' అనే నినాదంతో గిరిజనులందరిని ఏకంచేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాటయోధుడు కుంరంభీం.
ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నేటి కుంఠం భీం జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధవీరులు గోండులు, అట్లాంటి వీరుల్లో కుంరం భీం ఒకడు. భీం తండ్రి పేరు చిన్నూ, ఈయన గూడెం పెద్ద (పటేలు). ఈయనకు భీంతోపాటు సోము, బొజ్జు అనే కుమారులు మరియు కుర్టు, యేసు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గోండు తెగకు చెందినవారు, ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఈ గిరిజనుల్లో ఎన్నో తెగలున్నాయి. గోండు, కొలామ్, పరదాన్, కోయ, అందాల్, చెంచు, భిల్లులు మొదలగువారున్నారు. అడవిలో పుట్టి, పెరిగి, అక్కడే చనిపోయే వారికి, అడవే ప్రపంచం. కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. తెల్లదొరలను ఎదిరించిన రాంజీ గోండు వారసులమని గర్వంగా చెప్పుకుంటారు.
కుంరం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలున్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. ఆలోచించేవాడు. దేన్నీ ఊరికే వదిలిపెట్టేవాడుకాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినే కుకూబాయి. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టూ, చేమా, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒకరోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు. వారితో మేకపిల్లలు కూడా ఉన్నాయి. పైకు దగ్గర్లో ఉన్న నారేపచెట్టు ఎక్కాడు. ఒక కొమ్మ మీద కూర్చొని పాటలు పాడుకుంటూ సన్నసన్న మండలు నరికి మేకలకు వేస్తున్నాడు. భీం కథ చెపుతున్నాడు.
"తొందరగ దిగు. వాళ్ళు చూసినారంటె చాలా కష్టం" అన్నాడు జంగు. అన్నట్లే ముగ్గురు జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి ఉరికొచ్చారు. పైకును పట్టుకున్నారు. వారి వెనకే వచ్చిన అమీన్సాబ్ "చెట్లు కొడుతున్నారా, ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేసినారనుకున్నారా?” అని “అరే! అందరిని పట్టుకొని బంగ్లా దగ్గరికి తీసుక రండిరా!" అని తన మనుషులకు చెప్పాడు.
ఆ తరువాత గూడెం పెద్దయిన కుంరం చిన్నును చూస్తూ "అడవిలో ఆకు కూడా తెంపద్దన్న, చౌకీదార్ను, సారెదారు పంపి నీకు చెప్పుమన్న. ఈ రోజు నేను వచ్చి చూసిన. ఏముంది. నా కళ్ళ ముందే పిల్లలు అడవిని నరికారు. దానికి శిక్షేంటో తెలుసా. కొమ్మ నరికినోని వేళ్ళు నరకడమే తగిన శిక్ష" అన్నాడు. ఎందరు బతిమిలాడినా వినకుండా పైకు వేళ్ళు నరికించాడు అమీన్సాబ్. పైకు అరుపులతో అడవంతా ఏడ్చింది. స్పృహ తప్పి పైకు కిందపడిపోయాడు. తర్వాత చౌకీదార్ ఎవరెవరు ఏఏ పట్టీ కట్టినరో చదివాడు. పట్టీల పేరు మీద ఆ పూట గూడెం అంతా జంగ్లాత్ వాళ్ళ లూఠీకి గురైంది. ఈ సంఘటన భీంను పట్టి కుదిపింది. ఆవేశంతో వదినె వద్దకు పోయాడు. "వదినే! ఈ గాలి, నీరు, ఇక్కడి ఆకాశం మొత్తం మనవైనప్పుడు, ఈ భూమి, అడవి మనవెందుకు కావు. అడవి, భూమి మాత్రమే వాళ్ళవెట్లా అయినవి?" అని అడిగాడు.
"ఈ ప్రశ్నలు మనోళ్ళందరికి వస్తె బాగుండు. మీ నాయినను అడుగు" అంది. పట్టి అంటే పన్ను. 'మేక, ఆవు, ఎద్దు, భూమి, నాగలి, మంచె, గడ్డి, గుడిసె ఇలా ఉన్న ప్రతీదానిపేరు మీద పన్ను కడితే, చివరకు ఏం తిని బతకాలె. కష్టమంతా పన్నుల రూపంలో జంగ్లాత్ వాళ్ళు గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందే కదా' ఇలా పరిపరివిధాలా ఆలోచిస్తూ ఆ రోజు భీం ఆకలితో పడుకున్నాడు.
ఈ సంఘటన భీం మనసుపై చెరగని ముద్ర వేసింది. తమ కష్టాన్ని పరులు అన్యాయంగా తీసుకపోతున్నారని తెలుసుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా చిన్ననాడే ఆలోచించడం నేర్చుకున్నాడు. షావుకార్లు గిరిజనుల్ని మోసం చేసే తీరు కొంత అర్థమయ్యేది, కొంత అర్ధంకాకపొయ్యేది. జరగకూడని విధంగా జరుగుతున్న విధానాన్ని గురించి ఆలోచించాడు. కాని ఆపడమెట్లానో అతనికి అంతుపట్టలేదు.
దోపిడిలో అన్ని కోల్పోయిన కుంరం చిన్ను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఫలితంగా చనిపోయాడు. చిన్ను చనిపోయినాక కుంరం కుర్దు తన తమ్ముడు యేసు కుటుంబం, అన్న పిల్లలతో కలిసి సంకెనపెల్లి వదిలాడు. కొందరు కొలాములు కూడా వీరితో బయల్దేరారు. గూడెం వదిలేస్తుంటే భీం బాధపడ్డాడు. ఇది చూసిన వదినె ఇదంతా మామూలేనని, అడవుల్లో బతికే మనకు ఇవి అలవాటేనని చెప్పింది. వాళ్ళు జనగామ (ఆసిఫాబాద్) ధనోరా దాటి సుర్దాపూర్ చేరుకున్నారు.. మైదాన ప్రదేశం చూసి బండ్లు ఆపి, పక్కన ఉన్న పెద్దవాగు ఒడ్డుకు గుడిసెలు వేసుకున్నారు. చెట్లు, తుప్పలు నరికి, రాళ్ళు రప్పలు ఏరిపారేశారు. ముండ్ల కంపలు కాల్చారు. సమష్టిగా పనిచేసి, తర్వాత భూమి సమానంగా పంచుకున్నారు. వారి కష్టఫలితంగా జొన్న చేండ్లు ఏపుగా ఎదిగాయి. చేసు చూసి మురిసిపోయారు. కడుపు నిండా ఆరునెలలపాటు తిండి దొరుకుతుందని అనుకున్నారు. ఆవిధంగా అనుకుంటున్న సందర్భంలో వాళ్ళవద్దకు పన్నెండు మంది కొత్తవాళ్ళు వచ్చారు.
వచ్చిన వాళ్ళలో సిద్దిక్ అనేవాడు “ఈ ప్రాంతం అంతా నాది. నన్ను అడగకుండా ఎందుకు దున్నినారు" అని అడిగాడు. వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇట్లా జరిగిన మాటల యుద్ధం, కొద్దిసేపట్లోనే కట్టెలతో కొట్లాట వరకు వచ్చింది. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమయింది. భీం కొట్టిన దెబ్బకు సిద్ధిక్ చనిపోయాడు. చనిపోగానే అతనితో వచ్చిన వాళ్ళు పారిపోయారు. వెంటనే వదినె వచ్చి "భీం ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పింది. అట్లా భీం తన వారి నుండి వేరైపోయాడు.
అట్లా వెళ్ళిన భీం తిరిగి సంకెనపెల్లి చేరుకున్నాడు. తన మిత్రుడైన కొండల్ను కలిసి సుర్దాపూర్ లో జరిగిన గొడవ గురించి, సిద్దిక్ చావు గురించి చెప్పాడు. ఆ సమయంలోనే సిద్దిక్కు ఈ భూములు ఎవరిచ్చారు? అవి అతని సొంతమెట్లా అయినాయి? పట్టా అంటే ఏమిటి? గోండోళ్ళకు పట్టాలు ఎందుకివ్వరు? నైజాం అంటే ఏంది? సర్కార్ అంటే ఎవరు? మేం దున్నినప్పుడు రాని సిద్దిక్ తరువాత ఎందుకు వచ్చాడు? సిద్దిక్గా తప్పుకానప్పుడు, నాది మాత్రమే తప్పు ఎందుకవుతుంది? తన గోడంతా ప్రశ్నల రూపంలో కొండల్ ముందు పరిచాడు. అట్లా రాత్రి గడిచింది. ఎట్లా తెలిసిందో కాని గొడవంతా
తెల్లారేసరికి గూడెం అంతా పాకింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతానన్న భీంతో తనూ వస్తానని కొండల్ బయల్దేరాడు.
జరిగిన విషయాన్ని తెలిపి, తనకున్న ప్రశ్నలకు జవాబులు పొందాలనే ఆలోచనతో ముఖాసీ వద్దకు బయల్దేరాడు. మనందరికీ పెద్ద ముఖాసీ "భారీలొద్ది" అనేచోట ఉంటాడని తన తండ్రి చెప్పగా విన్నాడు. కనుక అతన్ని కలవడానికి పోయాడు. వీళ్ళు వెళ్ళేసరికి ముఖాసీ ఇంట్లోనే ఉన్నాడు. భీం, కొండల్ వెళ్ళి "రాం... రాం...” చెప్పారు.
"రాం... రాం... రండి, కూర్చొండి" అంటూ పరిచయాలు చేసుకున్నాడు ముఖాసీ. జంతువులకన్నా హీనంగా ఉన్నా తమ బతుకుల గురించి, తమను జంగ్లాత్ వాళ్ళు, షావుకార్లు ఎట్లా హింసిస్తున్నారో తెలిపాడు. "మేం అడవిలో పరాయివాళ్ళ తీరుగ బతుకుతున్నం. మేం భూమి సాగుచేస్తే ఫలితాన్ని ఎవడో వచ్చి పట్టుకపోతాడు. మాతోపాటు పెరిగిన చెట్ల ఆకులు, కొమ్మలు తెంపినా, విరిచినా మా చేతులు నరుకుతున్నారు. మేం ఎట్లా బతుకాల్నో తెలుస్తలేదు. జంగ్లాతోళ్ళకు, షావుకార్లకు బుద్ధి చెప్పడానికి అన్ని గూడాల జనాలను ఒక్కటి చేస్తాం. మీ మద్దతు కావాలి. బ్రిటిష్ వాళ్ళకు రాంజీగోండు బుద్ధి చెప్పినట్టు మనం కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలి" అని ఉద్రేకంగా భీం అన్నాడు.
"భీం ఇప్పటికే నువ్వు సర్కారు దృష్టిల ఉన్నావు. ఇట్లాంటి హింసా పద్ధతులు వద్దు. తొందరపడకు. సర్కార్కు జంగల్ మీద లాభాలు కావాలి. కనుక జంగ్లాతోళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారు. రాంజీగోండు తీరుగా కొట్లాడుట మనతో కాదు. నా వల్ల మాత్రం కాదు" మెల్లగా అన్నాడు ముఖాసీ,
ఇక మాట్లాడి లాభం లేదనుకొని ముఖాన్ ఉండే ఊరు వదిలేశారు. భీం కొండల్లకు ఎటుపోవాలో తెలియదు. కనిపించిన బాటలో ముందుకుపోతున్నారు. అట్లా వెళ్తున్న వారికి ఓ పెద్ద ఊరు ఎదురైంది. పెద్ద మేడలు, పెద్ద పెద్ద దుకాణాలు, అలంకరించుకున్న స్త్రీ, పురుషులు కనిపించారు. ఈ లోకం వారికి వింతగా ఉన్నది. వారు చేరింది బల్లార్షా రైల్వేస్టేషన్. అందరూ రైలు ఎక్కుతుంటే, "నడవడమెందుకు మనమూ ఎక్కుదాం" అనుకొని వాళ్ళూ ఎక్కారు. అందరు దిగుతుండగా, వాళ్ళూ దిగారు. వీరిని టి.సి. టికెట్ అడిగాడు. అదేంటో మాకు తెలియదు, మా దగ్గర డబ్బులు లేవన్నారు. అపుడు పోలీసులు వీళ్ళు గోండులని తెలుసుకొని నాలుగు తగిలించి పంపారు. అట్లా వాళ్ళు చేరుకున్నది "చాందా” అనే పట్నం.
రైల్వేస్టేషన్ బయట కూర్చున్న భీం, కొండల్లకు తనతో తెచ్చుకున్న వస్తువులను మోయలేక అవస్థపడుతున్న ప్రయాణికుడు కనిపించాడు. "నేను ఆ బరువుల్ని మోయాల్నా" అంటూ భీం అడిగాడు. "సరే" అని అంగీకరించిన ఆ ప్రయాణికుడితో వాళ్ళు అతని ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో చాలా మంది అచ్చు యంత్రాలు తిప్పుతున్నారు. తనకేమన్నా పని దొరకవచ్చు అని భీం ఆశపడ్డాడు. పని కోసం ప్రయాణికున్ని అడిగాడు. "సరే” అన్నాడు ప్రయాణికుడు. అతను ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని, పేరు “విటోబా”.
నిజాం సర్కారుకు, తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరుచేస్తున్న వాళ్ళతో విటోబాకు సన్నిహిత సంబంధాలున్నాయి. విటోబా రహస్యంగా పత్రిక నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీం, విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. కొండల్కు మాత్రం ఇదంతా రుచించలేదు. అతను తిరిగి ఇంటికి పోయాడు. విటోబా దగ్గర సంవత్సరం ఉన్నాడు భీం. అక్కడే తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భీంకు రాజకీయాల్ని, సమాజ పరిణామాల్ని, విటోబా అర్ధం చేయించాడు. మార్పు రావాలంటే త్యాగం చేయాలని తెలిపాడు. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి విటోబాను అరెస్టుచేసి పట్టుకపోయారు. కుంరం భీంను కొట్టి వదిలేశారు. అట్లా భీం తిరిగి ఒంటరివాడయ్యాడు. తిరిగి రైల్వేస్టేషన్కు పోయి కూర్చున్నాడు. అక్కడ మంచిర్యాలకు చెందిన తెలుగువాడు అతనికి కలిశాడు. బతుకుదెరువు కోసం చాయపత్తా దేశం పోతున్నట్టు చెప్పాడు. ఇంకో ఆలోచన చేయకుండా భీం అతనితో కలిసి చాయ్పత్తా దేశం అనబడే అస్సాం పోయాడు. తేయాకు తోటల్ల అడుగుపెట్టాడు. తనవంటి అనేకమంది కార్మికులను చూశాడు. గోండు గూడెం నుండి తేయాకు తోటలవరకు అతని ప్రయాణం సాగింది. అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవని, కష్టపడేవానికి కడుపునిండటంలేదని తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన, వంచిన నడుం ఎత్తకుండా పనిచేశాడు. నుదుటి చెమట తుడుచుకోను లేచే కార్మికులను మేస్త్రీలు కొరడాతో కొట్టేవాళ్ళు. చేసిన కష్టం మందులకుపోతే తినడానికి కష్టపడేవారు. యజమానులకు దయాగుణం ఉండేది కాదు. ఇవన్ని చూస్తున్న భీంకు అసంతృప్తి రాజుకుంది. అక్కడ నాలుగు సంవత్సరాలున్నాడు. ఆ సమయంలోనే భీంకు మన్యం ప్రాంతం నుండి వచ్చిన తెలుగువానితో పరిచయం అయింది. అతని ద్వారా మన్యం ప్రాంతం గురించీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించీ తెలుసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు అక్కడి ప్రజల్ని పెట్టిన యాతనల గురించి విన్నాడు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు ఏవిధంగా సమీకరించాడో అవగాహన చేసుకున్నాడు. రామరాజు పోరాట రీతుల్ని ఆకళింపు చేసుకున్నాడు. యువకులకు యుద్ధరీతుల్ని ఎట్లా నేర్పాడో తెలుసుకున్నాడు. అడవిపై మాకు తప్ప ఎవరికీ అధికారంలేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే విధానాన్ని ఒంటపట్టించు కున్నాడు. యుద్ధ మెళుకువల్ని గ్రహించాడు. ఇప్పుడు భీం ఒక ఎక్కుపెట్టిన బాణం. పోరుబాటలో నడవడానికి సమాయత్తమైన పోరాట వీరుడు.
ఈ సమయంలోనే తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీలకు అడ్డుతగిలాడు. మేస్త్రీలు భీం మీదికి కొరడా లేపారు. సహించని భీం వారిని చితక బాదాడు. ఇది తెలుసుకున్న యజమాని పోలీసులతో చెప్పి భీంతో సహా మరికొందరిని జైల్లో వేయించాడు. నాల్గు రోజుల తర్వాత జైల్లోని ఇనుప చువ్వలు వంచి తప్పించుకున్నాడు. నేరుగా వచ్చి కదులుతున్న రైలు ఎక్కాడు. అది అతన్ని బల్లార్షా చేర్చింది. అక్కడే కొన్ని రోజులు మూటలు మోసి బతికాడు. అక్కడ ఉండలేక బల్లార్షా వదిలి రాజోరా మీదుగా అడవిబాట పట్టాడు. దారిలో తన అన్నలు కాకనాఘాట్లో ఉంటున్నారని తెలుసుకున్నాడు. సాయంత్రం వరకు తన అన్నల గూడెం చేరుకున్నాడు. తమ గుడిసె ముందుకు పోయేసరికి వదినె కుకూబాయి కూర్చొనుంది. భీంను చూసి కండ్లనీళ్ళు పెట్టుకుంది. కొడుకు వచ్చిండని తెలుసుకున్న తల్లి భీంను పట్టుకొని ఏడ్చింది. ఆమె అనారోగ్యంతో చావుకు దగ్గరగా ఉంది. వదినె తన ఇద్దరు కొడుకులు, పాపకు చిన్నాన్నను పరిచయం చేసింది. వాళ్ళు భీం ఒడిలో దూరారు. రాత్రి అంబలి తాగినంక తమ్ముని వివరాలు అడిగి తెలుసుకొని అన్నలిద్దరూ ఆశ్చర్యపోయారు. కుర్దు, యేసు, కొండల్ల గురించి భీం అడిగాడు. మిత్రులందరి గురించి అడిగి తెలుసుకున్నాడు.
దేవడం పెద్ద లచ్చుపటేల్. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు. అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప లాంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను ముందునుంచి చూసే అంబటిరావుకు సోంబాయి అనే కూతురుంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటదని లచ్చుపటేల్ నిశ్చయించాడు. ఆ విధంగా కుంఠం భీం సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆరోజుల్లో కుంరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతనిపట్ల ఆకర్షణ పెంచుకున్న పైకూబాయి అనే యువతి కోరి అతన్ని పెళ్ళాడింది. భీం కాకనాఘాట్లో కాపురం పెట్టాడు.
కుర్దు తన తమ్ముడు యేసు దగ్గరికి ధనోరాకు వచ్చాడు. అతనికి అడవిని నరికి భూమి సాగుచేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అన్ని ప్రదేశాలు తిరిగి చూశాడు. బాబేఝరి లొద్ది అంచున సాగు భూమి ఉంది. తానొక్కడే కాకుండా చాలా మందిని ఏకం చేశాడు. బాబేఝరి గుట్టలు గొడ్డళ్ళ చప్పుళ్ళతో ప్రతిధ్వనించాయి. అడవుల్ని నరికి పంటభూములుగా మార్చారు. బాబేఝరి, చల్బండి, గోగిన్ మోవాడం, టొయికన్ మోవాడం, భీమన్ గొంది, కల్లేగామ్, మురికిలొంక, అంకుసాపూర్, నర్సాపూర్, దేమీగూడ, జోడెన్ ఘాట్, పట్నాపూర్ మొదలగు పన్నెండు గూడాలను పొందించారు. పందిళ్ళు, గుళ్ళు, మంచెలు, జెండాలు అన్నీ సమకూర్చుకున్నారు. కొత్త ఊర్లు వెలశాయి. కొత్త బతుకులు మొదలయినాయి.
వారం రోజుల్లోనే బాబేఝరీలో గోండులు, కొలామ్లు పన్నెండు గ్రామాలను పొందించారు అనే వార్త దావానలం తీరున పాకింది. జంగ్లాత్ వాళ్ళు దాడి చేశారు. గూడాలన్నిటిని బూడిదచేశారు. అందరిమీదా కేసులు పెట్టారు. గ్రామస్తులంతా బాధ పడుతుంటే కుర్దు ధైర్యం చెపుతూ మా తమ్ముడు భీముని ఇక్కడకు తెచ్చుకుందం వాడు అన్ని చూసుకుంటడు అని ధైర్యం చెప్పాడు.
విషయాలన్నీ తెలుసుకున్న భీం, బాబేఝరీ వైపు వచ్చి టొయికన్ అనే గూడెంల దిగాడు. పదిరోజుల్లో ప్రతి గూడెం తిరిగాడు. విషయం అర్థమైంది. ఏం చేయాలన్నదే ప్రశ్నగా మిగిలింది. భర్త అవస్థ గమనించిన పైకూబాయి భూమికేసుల గురించి వకీలును పెట్టుకోమని సలహా ఇచ్చింది.
పైకూబాయి చెప్పింది నిజమనిపించింది. కేసుకు సంబంధించి రాతపూతలు చూసుకొనే వ్యక్తి పేరు మహదు. అతనితో కలిసి భీం జనగామలో ఉన్న పైకాజీ రామచంద్రరావు వకీలును కలిశాడు. తన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు మేం భూమిని నమ్మి బతుకుతున్నామని, ఇటీవలి కాలంలో బాధ లెక్కువైనయనీ, ఎక్కడికి పోయినా వెళ్ళగొడుతున్నారని, అసలు మా హక్కును ఎందుకు లాక్కుంటున్నారనీ భీం ఆవేదనతో వకీలును అడిగాడు. భీం ప్రశ్నకు పైకాజీ ఈ విధంగా జవాబిచ్చాడు.
"భీం ఈ భూములన్నీ మీవే. ఈ రాజ్యానికి రాజులు మీరే. అదంతా 1918 సంవత్సరానికి ముందుమాట. అప్పుడు సర్కారు అడవివైపు చూడలేదు. అడవిపై హక్కును కోరలేదు. 1918 లో తాసీలు ఆఫీసు ఉట్నూరు వచ్చింది. అది తెలిసి మైదాన ప్రాంతాల నాగరికులు కొండ, కోనల్లోకి వచ్చారు. సర్కారుతో ఏదో విధంగా సంబంధం పెట్టుకున్నారు. దానివల్ల పట్టాలు వాళ్ళకు దక్కాయి. భూమి మీద మీకున్న హక్కు పోయింది. ఇప్పుడు చట్టం వాళ్ళను కాపాడుతుంది" అని చెప్పాడు. "ఈ చట్టాలు తయారు చేసిందెవరు? ఎవరికి చెప్పి మా భూముల్ని వాళ్ళ పేరు మీద రాశారు? అసలు ఆ దొంగలకు పట్టాలు ఎందుకు ఇచ్చారు?" అని కోపంగా అడిగాడు భీం. "ఇన్నేండ్ల నుండి ఇసొంటి ప్రశ్నలు అడిగిన వాడిని నిన్ను ఒక్కడినే చూశాను. ఈ రాజ్యం నిజాం రాజుది, రాజుకు ఏది తోస్తే అదే చేస్తడు. అంతా ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది".
"న్యాయం చూడని రాజెందుకు? మా చావు కోరే సర్కారుతో మాకు పనేముంటుంది?" సూటిగా అన్నాడు భీం. "చూడు భీం. మీ బాధల్ని నైజాంకు చెప్పి చూడండి. మేలు జరిగితే మంచిదే. లేకుంటే సర్కార్ను సవాల్ చేయండి. మీ చట్టాలను, కోర్టులను, పోలీసు, అధికారులను ఒప్పుకోం అనండి. నీ వ్యవహారం చూస్తే అట్లనే అంటావనిపిస్తున్నది. నైజాంతో కొట్లాడి భూముల్ని సాధించగలరా? నాకు మాత్రం నమ్మకం లేదు" అని ముగించాడు వకీలు.
"అవసరముంటే వచ్చి కలుస్తాం. మీరు సహాయం చెయ్యాలి" అంటూ మహదుతో కలిసి గూడెం దిక్కు నడిచిండు
ఏవైపు నుండి చూసినా లడాయి తప్పదనుకున్నాడు భీం. పన్నెండు గూడాల ప్రజలందరు పట్నాపూర్ రావాల్సిందిగా వార్త పంపాడు. భీం పిలుపు అందుకొని ప్రజలందరు వచ్చారు. పెద్ద చెట్టు కింద కూర్చున్న ప్రజలందర్ని ఉద్దేశించి భీం ఇట్లా అన్నాడు.
“మనందరి కష్టాలు ఒక్కటే. చిన్నప్పటి నుండి నేను ఈ కష్టాలను ఎదుర్కుంటా ఎదిగిన. భూమి కోసం మనం జంగల్
నరికితే, జంగ్లాత్ వాళ్ళు, పట్టేదార్లు కేసులు పెడుతున్నారు. వాళ్ళు మనల్ని కొట్టినా, గుడిసెలు తగులబెట్టినా, చేతులు
నరికినా భరిస్తూ ఇన్నేండ్లు గడిపినం. సర్కారు మన మీద కేసులు పెడితే, వకీలు కోర్టుకు రమ్మంటుండు. మనం గంజి తాగి
బతకడం వల్లకాదు, కోర్టు కేసులతో చావుకు దగ్గరవుతున్నాం. ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవి. ఇక ముందు కూడా
ఉంటాయి. కనుక వాటికి భయపడేది లేదు. మీరు భూములు దున్నుండి. వర్షాకాలం వస్తున్నది. పంటలు పండిద్దాం. వాళ్ళు మనమీదికి వస్తారు. అడవి జంతువులను తరిమినట్లు, వాళ్ళను కూడా తరుముదాం. వాళ్ళతో యుద్ధం చేసి హక్కులు సాధించుకోవాలి. భూములు దక్కించుకోవాలి. మీకు ఇట్లా చేయడం ఇష్టమేనా" అడిగాడు భీం.
"ఆకలితో చచ్చే కన్నా పోరాటం చేసి చద్దాం" అన్నారు కొందరు. "సరే" అన్నారు మరికొందరు. "భీం తలుచుకుంటే ఏదైనా సాధించగలడు" అన్నారు ఇంకొందరు.
అనుకున్నట్లుగానే గోండులు ఆ సంవత్సరం అడవిని నరికి పంటలు పండించారు. విషయం తెలుసుకున్న జంగ్లాత్
వాళ్ళు బాబేఝరీపై విరుచుకపడ్డారు. "జంగల్ నరికిన చోటుకు పదండి. మేం పంచనామ చెయ్యాలె" అన్నాడు అమీన్సాబ్. వద్దంటే అడవిని నరుకుతున్నరని కోపంతో బూతులు తిట్టడం మొదలుపెట్టాడు అమీన్సాబ్. "మా అడవి, మా ఇష్టం. మేం ఏమైన చేసుకుంటాం. మీకు లంచాల కింద కోళ్ళు, గొర్లు ఇకముందు ఇయ్యం.
చాటుగా ఎత్తుకొనిపోయి దొంగలు కాకండి" అన్నాడు భీం.
"మమ్మల్ని దొంగలంటవా" అని అమీన్ భీంను కొట్టాడు. అమీన్తో వచ్చిన వాళ్ళు గోండుల్ని కట్టెలతో కొట్టడం మొదలుపెట్టారు. రఘు తుడుం మోగించాడు. అది విన్న గోండులు, కోలామ్లు ఉరికివచ్చి జంగ్లాత్ వాళ్ళను ఎదుర్కొన్నారు. ఆ స్థలం యుద్ధరంగమైంది. దీన్ని గమనించిన ఒక జాగీర్దార్ తుపాకీ పేల్చాడు. అది భీం భుజం నుండి దూసుకపోయింది. గోండులు వచ్చిన వాళ్ళందర్ని విపరీతంగా కొట్టారు. దెబ్బలకు నిలువలేక అమీన్ తోబాటు అందరూ జనగామ దిక్కు పరుగందుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కుర్టు, అతని కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. లచ్చుపటేల్కు చెప్పి వాళ్ళను జామీనుమీద విడుదల చేయించాడు కుంరం భీం..
పరిస్థితి చేయిదాటుతుందనుకున్న జంగ్లాత్ అమీన్సాబ్, గిర్దావర్ ఇద్దరూ కలిసి వెంటనే తాసీల్దార్ అబ్దుల్సత్తార్ను కలిశారు. బాబేఝరీ సంగతి పూసగుచ్చినట్లు తెలిపారు. ఏకు తీరు ఉన్న గోండులు మేకు తీరుగ అయ్యారనీ, అమాయకులను కున్న వాళ్ళు పోరాటవీరులైనారనీ, ఇంకా చూసుకుంటూపోతే చాల ప్రమాదమనీ తెలిపారు, తహసీల్దార్ వెంటనే డి.ఎస్.పి.తో మాట్లాడి గోండులను అరెస్ట్ చేయమన్నాడు. కొండల్లో జరుగుతున్న విషయాల్ని విపులీకరిస్తూ హైద్రాబాద్ హోం సెక్రటరీకి తెలిపాడు. బాబేఝరీలో జంగ్లాత్వాళ్ళమీద దాడి చేశారనీ, అడవి నరికారనీ డి.ఎస్.పి. కేసులు పెట్టాడు. కుంరం భీంను మొదటి ముద్దాయిగా పెట్టి మహదు, రఘు, జంగు, కుర్దు, యేసు మొదలగు వారల పేర్లను తర్వాత పెట్టాడు. వీళ్ళను అరెస్ట్ చేయడం ఎట్లా అని డి.ఎస్.పి. ఆలోచించాడు.
డి.ఎస్.పి. ఆలోచనలు ఇట్లా ఉంటే, కుర్దూ ఆలోచనలు మరో రకంగా సాగుతున్నవి. జీవితమంతా కొట్లాటలు, కేసులతో నిండిపోయింది. కేసులైతే రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇట్లా కేసులు పెట్టి హింసించే జంగ్లాత్ వాళ్ళ విషయం సర్కారుకు తెలుసోలేదో, హైదరాబాద్ పోయి తమ కష్టాలను, దుఃఖాన్ని నైజాం నవాబుతో చెప్పుకుంటే దయ తలుస్తాడేమో. అని అనుకున్నాడు. ఈ మాటే భీంతో చెప్పాడు. పెద్దమనిషి మాట తీసేయలేక, ఇది కూడా సమస్య పరిష్కారానికి ఒక మార్గమవుతుందేమోనని భీం హైదరాబాద్కు బయల్దేరాడు. తమ సమస్యలను ఏకరువు పెడుతూ ఒక లేఖను నిజాంకు ఇయ్యాలని రాసుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళిన కుంరం భీంకు నిజాం ప్రభువు దర్శనం లభించలేదు. భీంతోపాటు. మహదు నిజాం దర్శనం కోసం అధికారులను పదే పదే బతిమిలాడాడు. కాని వాళ్ళు వినిపించుకోలేదు. ఇక కలపడం సాధ్యంకాదనిపించి భీం వెనక్కి తిరిగాడు. హైదరాబాద్ పోయి వచ్చేలోపు గూడాల మీద పోలీసులు దాడి చేశారు. పోలీసులకు జోడెన్ ఘాట్ గ్రామపెద్ద కుర్టూపటేల్ (కుంరంభీం చిన్నాయన కాదు) సహకరించాడు. ఊర్లన్నీ కుక్కలు చింపిన విస్తర్లు అయినాయి. కుంరం కుర్దు, యేసు, సూరులకీ విపరీతంగా దెబ్బలు తాకాయి. వారిని అరెస్ట్ చేశారు. విషయ్ డాల
తెలిసిన భీం వెంటనే జోడెన్ ఘాట్ పోయాడు. అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు.
"మేం హైదరాబాద్ వెళ్ళాం. నిజాం రాజును కలువలేకపోయాం. ఇక్కడేమో పోలీసులు పదే పదే మన మీద
దాడులకు తెగబడుతున్నారు. వాళ్ళు మనల్ని బతకనియ్యరు. కానీ మనం బతకాలి. ఈ భూమి, అడవి మనవి. సర్కారు ఈ
భూమి మనది కాదంటుంది. అది భూమిని వదిలిపెట్టదు. పోలీసులతో గూడాలను కాలబెడుతుంది. ఆ మంటల్లోపడి
చనిపోదామా? ఏం చేద్దాం?" అని అడిగాడు.
"భూమి లేక చచ్చేకంటే కొట్లాడి సద్దాం భీం" అన్నాయి అక్కడున్న కంఠాలన్నీ,
అక్కడ పన్నెండు గూడాల పెద్దలున్నారు. ప్రజలున్నారు. వారందరితో కలిసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించాడు. 'ముందు అరెస్టయిన కుర్దు తదితరులందరిని విడిపించాలి. జోడెన్ ఘాట్ కేంద్రంగా ఉండాలి. తిండి, ఆయుధాల ఖర్చు అన్ని గూడాలు భరించాలి. తుడుం యుద్ధ సంకేతంగా ఉపయోగించాలి. గొడ్డళ్ళు, ఈటెలు, బాణాలు, వొడిసెలలు, తుపాకులు తయారుచేయాలి. జోడెన్ ఘాట్లో సైన్యం ఉంటుంది. గ్రామాల్లో రక్షకదళాలు ఉంటాయి. కేసులకు హాజరు కామని సర్కారు వార్త పంపాలి. సర్కారు భూములను మనకు ఇచ్చే వరకు పోరాటం జరుగుతదని ప్రకటించాలి. గోండు రాజ్య స్థాపనే మన ముఖ్యలక్షణం. అందుకు అందరు రహస్యంగా పనిచేయాలి' అని ప్రతినిధులందరు నిర్ణయించుకొన్నారు. మహదు, పైకాజీని కలిశాడు. అతడు తహసీల్దార్తో మాట్లాడాడు. తహసీల్దార్ హైదరాబాద్లో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ గారికి, కుర్దూ మొదలైన గోండు ముద్దాయిలపై దయ చూపితే సర్కారు గౌరవం పెరుగుతుందని లేఖ రాశాడు. కుంరం భీం మాటలు విని వాళ్ళు మోసపోయారు. మీరు కనికరించాలి అని అందులో పేర్కొన్నాడు. మొత్తానికి వాళ్ళు విడుదలయి జోడెన్ ఘాట్ చేరుకున్నారు.
బాబేఝరీ ప్రాంతంలో సర్కారు ఆజ్ఞలు పాటించబడటం లేదు. ఎవరూ కోర్టులకు హాజరు కావడం లేదు. అమీన్సాబ్ పోలీసుల్ని వెంటబెట్టుకొని అక్కడికి పోయాడు. అక్కడ కుంరం భీం వాళ్ళకు అడ్డుపడ్డాడు. "ఇంక కోర్టులు, కేసులు ఏమి లేవు. ఈ పన్నెండు గ్రామాలు మా సొంతం. ఇది గోండు రాజ్యం. ఇక్కడికి జంగ్లాతోళ్ళు వస్తే ప్రాణాలతో వెళ్ళలేరు. ఈ రాజ్యం మాది. మీకు ఎలాంటి అధికారం ఇక్కడ లేదు. మేం ఎవరి సొమ్ము తినడం లేదు. ఎవరికీ అన్యాయం చేయడం లేదు. ఇది మా అందరి నిర్ణయం. మీరు పోయి మీ దిక్కున్న చోట చెప్పుకోండి" అని ఖరాఖండిగా అన్నాడు.
అమీన్కు వెళ్ళబుద్దికాలేదు. హెచ్చరికలు చేశాడు. గోండులు నవ్వుకున్నారు. తుపాకి తీసి గాలిలోకి కాల్పులు జరిపాడు. గోండులు అతన్ని. అతనితో వచ్చిన వారిని దేహశుద్ధి చేశారు. తుపాకి తీసుకొని వెళ్ళగొట్టారు. అమీన్కు సహాయపడ్డ కుర్దుపటేల్ అనే వ్యక్తిని హెచ్చరించి వదిలేశారు. అట్ల సర్కార్తో గోండుల యుద్ధం మొదలైంది.
కుంరం భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామస్థులు, పల్లపు ప్రదేశ ప్రజలు కొందరు వీరితో కలిశారు. గోండు రాజ్య స్థాపనకు మద్దతు తెలిపారు. అందులో కల్లెగాంపాజ్, ధనోరా ముఖ్యమైనవి. జోడెన్ ఘాట్లో కొలిమంటుకున్నది. ఈటెలు, బాణాలు, బరిశెలు, గొడ్డండ్లు, తుపాకులు, బార్మాకులు తయారైనాయి. వాటిని వాడటంలోని మెళుకువల్ని యువకులకు, పిల్లలకు నేర్పారు. స్త్రీలు సహాయం చేస్తున్నారు. పైకూబాయి ముందుండి పనులు చూస్తున్నది. ఒకనాడు ఉదయం జోడెన్ ఘాట్ మీద తుడుం మోగింది. యుద్ధం మొదలయింది. ప్రతీ ఊరు, ప్రతీ మనిషి కుంరం భీంకు, రగల్ జెండాకు జై జై అని నినదించారు. అదే సమయంల కుంఠం సూరు ఉరికొచ్చి నైజాం సైనికులు వస్తున్నరని చెప్పాడు. వెంటనే భీం బందూకు ఎత్తాడు. తుడుం మోగింది. కొమ్ములు ఊదారు. "నైజాం సైన్యంలో ఒక్కన్నీ కొండ ఎక్కనీయవద్దు. బాణాలు ఎక్కుపెట్టండి. ఈటెలు గురిచూసి విసరండి. సైనికుల్ని మూడు దిక్కులా చుట్టి కత్తులతో నరకండి. ఈ భూమి, అడవి మనవి. శత్రువుల అంతు చూడండి" అని భీం సైన్యాన్ని పురిగొల్పాడు.
స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధ రంగం సందడితో నిండింది. పైకూబాయి వీరవనిత తీరుగ వీరవిహారం చేసింది. రెండు వైపుల నుండి తుపాకుల శబ్దం. చావు కేకలు, నిజాం సైనికుడొక్కడు కూడ కొండ ఎక్కే ప్రయత్నం చేయలేకపోయాడు. ఎక్కినవాడు కూలిపోయాడు. అన్ని దిక్కులా నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్న భీం బలగం వారిని ఊపిరాడనీయలేదు. తప్పని పరిస్థితిలో వాళ్ళ కెప్టెన్ భాగో, భాగో అని అరిచాడు. నిజాం సైనికులు పారిపోవడంతో భీం వైపు తుడుం మోగింది. తుడుం మోత భీం విజయసూచికగా ప్రపంచానికి చేరింది.
గోండు వీరుల విజయం తెలిసిన తహసీల్దార్ కోపంతో ఊగిపోయాడు. స్వయంగా వరంగల్ పోయి సుబేదార్ అనే ఉన్నత అధికారితో మాట్లాడాడు. అట్లానే జనగామ (ఆసిఫాబాద్)లో ఉన్న డి.ఎన్.పి.తో మాట్లాడి, ఇది భూమి సమస్య గోండులను కలిసి చర్చించి పరిష్కరించాలి" అని చెప్పాడు. కాని నిజాం సైన్యం గోండులతో పోరాడి, కొండ వాళ్ళందర్ని చంపెయ్యాలనే నిర్ణయానికి వచ్చింది. సైన్యం తన ఎత్తుగడలో భాగంగా కొండ కింద ఉన్న ప్రజల మీద దాడి చేసింది. ప్రజల్ని కొట్టడం, చంపడం, తగులబెట్టడం చేశారు. దానితో ప్రజలు పోయి భీం సైన్యంలో చేరారు. ఇట్లా కొన్ని నెలలు గడిచేసరికి కొండమీద గోండువీరులకు తిండికి కరువొచ్చింది. భీంకు చెందిన రహస్యదళాలు గ్రామాల్లోకిపోయి ధాన్యం తెచ్చుకున్నాయి. యుద్ధం ఇట్లా సాగుతున్న దశలో భీం, సర్కారుకు మహదుతో లేఖ రాయించాడు. "పన్నెండు గ్రామాలకు గోండు రాజ్య అధికారమిస్తే నైజాంకు విధేయులమై ఉంటాం” అనేది లేఖలోని విషయం. లేఖ తాసీల్దార్ అబ్దుల్ సత్తార్కు అందింది. కానీ నైజాం నుండి జవాబు రాలేదు.
ఒక రోజు ఉదయం రఘు ఒక మనిషిని తీసుకువచ్చి భీం ముందుంచాడు. అతను "నేను నైజాం సర్కార్ సబ్కలెక్టర్
దగ్గర నుంచి వచ్చిన. వారు మీతో మాట్లాడుతారట. మీరు ఆజ్ఞ ఇస్తే వచ్చి మాట్లాడుతాడు" అన్నాడు. .భీం సమ్మతి మేరకు సబ్కలెక్టర్ వచ్చి కలిశాడు.
"భీం మీకు, మీ చిన్నాయనకు ఎంత భూమి కావాలో అడగండి. ఇచ్చి పట్టాలు చేస్తాం. ఈ పోరు ఆపండి" అన్నాడు సబ్కలెక్టర్.
"ఈ యుద్ధం మా కోసం కాదు. గోండులు, కొలామ్లు మొదలగు ఎన్నో తెగల ప్రజల "
"మీ పన్నెండు గ్రామాలకు పట్టాలు ఇస్తాం. భూములు మీ సొంతం అవుతాయి. యుద్ధం మానుండి."
"పన్నెండు గ్రామాల పట్టాలు కాదు, పన్నెండు గ్రామాల రాజ్యాధికారం కావాలి. గోండు రాజ్యం స్థాపించుకుంటాం."
"అదెట్ల సాధ్యం."
"అడవి మీ సర్కారుది ఎట్లా అయింది. నిజం చెప్పాలంటే ఉట్నూరు నుండి రాజోరా దాకా మా గోండు పరగణను మాకు పాలించే హక్కు కావాలి. మీ సర్కారుతో ఈ విషయం చెప్పండి. మీరు ఎక్కువ సైన్యం తెచ్చి మమ్మల్ని చంపవచ్చు. మాలో ఏ ఒక్క పిల్లగాడు బతికున్నా గోండు రాజ్యం కొరకు పోరాడుతాడు. మా రాజ్యం గెలుచుకొనే వరకు యుద్ధం సాగుతుంది" అని భీం సూటిగ చెప్పాడు.
యుద్ధం మొదలై ఏడు నెలలు గడిచాయి. కొండ మీద ఆహారం కొరతవల్ల అందరి ముఖాల్లో ఆకలి తాండవించింది. నైజాం సర్కారు సైన్యం మాత్రం పెద్ద ఎత్తున దాడికి సిద్ధమయి వస్తుందని తెలిసింది. ఆ రాత్రి యుద్ధ పద్ధతుల మీద చర్చ జరిగింది. పన్నెండు గ్రామాల ప్రజలు శత్రువును చికాకు చేసే పద్ధతులు గ్రహించారు. శత్రుసైన్యం పదిరోజులు తల మునకలైనా కొండమీదికి చేరలేకపోయింది. అన్ని దారుల్లో భీం సైన్యం పెట్టని గోడలై నిలుచున్నది. భీం సైన్యాన్ని జయించడం కష్టమని తేలింది. కానీ అదే గ్రామం పెద్ద కుర్దూ పటేల్ (కుంఠం కుర్దుకాదు) మోసం చేసి సర్కార్తో చేతులు కలిపాడు. కొండమీదికి రహస్యంగా దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా, యుద్ధనీతికి విరుద్ధంగా వచ్చింది. రాగానే గోండు వీరుల్ని కాల్చారు. మరెందరినో చీకట్లో చంపారు. గుడిసెల్ని తగులబెట్టారు. "అదిగో కుంరం భీం అక్కడున్నడు దొరా!" అని కుర్దూపటేల్ భీం వెనక నుండి చూపెట్టాడు. ఇంటి గుట్టు బయటపడింది. భీం మీద తూటాలు కురిశాయి. భీం నేల కొరిగాడు.
ఇరవై రెండు అక్టోబర్ పందొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో (22-10-1901) పుట్టిన కుంరం భీం, సెప్టెంబర్ ఒకటి, పందొమ్మిది వందల నలభై సంవత్సరం (01-09-1940) వీరమరణం చెందాడు. ఆదివాసి ప్రజల కొరకు భూమికోసం, భుక్తి కోసం, నాటి నైజాం పాలన నుంచి ఆదివాసుల విముక్తికోసం పోరాడి వీరమరణం పొందిన గోండు వీరుడు గోండు రాజ్య అస్తిత్వం కోసం పరితపించిన అమరజీవి. కుంరం భీం తెలంగాణ చరిత్రలో నిలిచిన ఆణిముతారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి