సురవరం ప్రతాపరెడ్డి

 తెలంగాణ వైతాళికుడు 2. సురవరం ప్రతాపరెడ్డి


తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలకు "గోలకొండ కవుల సంచిక' ద్వారా సమాధానమిచ్చినవాడు. తన కృషి సమాజపరంగా సాగించిన ఉద్యమశీలి. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన జీవితం ఎట్లా స్ఫూర్తి దాయకమో తెలుసుకుందాం. NG


హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం. ఆ రోజు సాహిత్య సమావేశం జరుగుతున్నది. నాచన సోమన రాసిన 'ఉత్తర హరివంశం' పై ప్రసంగం. మాట్లాడబోయేది కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఆధునికాంధ్రకవులలో పేరెన్నికగన్నవాడు. సభ మొదలైంది. సభాధ్యక్షుడు ధీరగంభీరంగా తొలిపలుకులను ప్రారంభించాడు. రాను రాను మాటల చినుకులు మహావర్షంగా పరిణమించాయి. దాదాపు గంటకుపైగా సాగిన ఆ ఉపన్యాసం ఆహూతులను కట్టిపడేసింది. సోమన కవితలోని ఎన్నో కొత్తకోణాలు వారికి పరిచయమవుతున్నాయి. ఇక వక్త వంతు వచ్చింది. విశ్వనాథ లేచి అధ్యక్షుడు మాట్లాడిన తరువాత చెప్పడానికి నా కింకేమీ మిగలలేదు. హరివంశంలోని కొన్ని పద్యాలను మాత్రం చదివి వ్యాఖ్యానిస్తానన్నాడు. విశ్వనాథ వంటి మహాకవి పండిత, విమర్శకుడిని నిశ్చేష్టుడిగా నిలబెట్టిన ఆ సభాధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి.


"ప్రతాపరెడ్డి పేరు వినగానే ఒక మహోన్నతమూర్తి మన కనులముందు సాక్షాత్కరిస్తుంది. బహుముఖ ప్రతిభకు ఆయన నిలువెత్తు ఉదాహరణ! శ్రీ సురవరం ప్రతాపరెడ్డి మేధా సంపన్నుడు. వాఙ్మయ రంగములో ఆయన ప్రతిభ, ప్రజ్ఞ కనరాని పొలమేలేదు. విమర్శకులలో ఆయన గొప్ప విమర్శకుడు. కవులలో కవి. పండితులలో పండితుడు. రాజకీయవేత్తలలో రాజకీయవేత్త. పత్రికారచయితలలో పత్రికారచయిత. నాటక కర్తలలో నాటకకర్త. వీటన్నిటినీ మించి పరిశోధకులలో మహాపరిశోధకుడు, దేశాభిమానులలో మహాదేశాభిమాని. సహృదయులలో సహృదయుడు. అటువంటి మిత్రుని, విద్వద్వరుణ్ణి, రసజ్ఞుణ్ణి అరుదుగా చూస్తాం. ఇంతటి ప్రజ్ఞా పాండిత్యములు కల సాహిత్యసేవా ధురంధరుడు." ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ రాసిన ఈ వాక్యాలు చదివిన తరువాత ప్రతాపరెడ్డి గురించి వేరే పరిచయవాక్యాలు అవసరంలేదు.


తెలుగుజాతిపై ఇంతటి ప్రభావం వేయగలిగిన సురవరం వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడిపై ఉన్నది. వారిలోని ఉత్తమగుణాలను సాధనతో సొంతంచేసుకోవాలి. మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం.

బాల్యం - విద్యాభ్యాసం:


ప్రతాపరెడ్డి పూర్వపు మహబూబ్నగర్ జిల్లా నేటి జోగులాంబ జిల్లాలోని గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉండిన బోరవెల్లి గ్రామంలో 28-05-1896 నాడు జన్మించాడు. వీరి మొదటిపేరు పాపిరెడ్డి. చిన్నప్పటి నుండి గొప్ప ధారణాశక్తి కలవాడు. చండశాసనుడైన గురువు రఘురామయ్య ప్రవర్తనతో విద్యపై విముఖత పెరిగింది. బడి ఎగ్గొట్టి గోటీలాడుకోవడం మొదలుపెట్టాడు. ఇది క్రమంగా వ్యసనంగా మారింది.


ఒకరోజు గోటీలకు పైసలు లేకుండె. తన షేర్వాణిని రెండు అణాలకు (12 పైసలకు) అమ్మేసిండట. విషయం చిన్నాన్న రామకృష్ణారెడ్డికి తెలిసింది. ఇంకేం, శిక్ష భరించక తప్పలేదు పాపిరెడ్డికి. ఇట్లా వదిలేస్తే పిల్లగాడు చేతికందకుండపోతాడనుకున్నాడు రామకృష్ణారెడ్డి. కచ్చితమైన దినచర్యను పెట్టాడు. తు.చ. తప్పకుండా పాటించాడు. ప్రతాపరెడ్డి. ఇక్కడే అతని జీవితం ఒక మలుపు తిరిగింది. సరైన తోవలో పోకుంటే లక్ష్యాన్ని చేరుకోలేముగదా!


ప్రతాపరెడ్డి ఐదవ ఫారమ్ (9వ తరగతి) చదివేటప్పుడే 'తెలుగులో కవిని కావలెను. శాశ్వత కీర్తి సంపాదింపవలెను. లేకున్న నా జీవితము వ్యర్థము' అనుకున్నాడట. కేవలం సంకల్పిస్తే సరిపోదు. స్వయంకృషి, సాధన సంకల్పాన్ని సాకారం చేస్తాయి. ఆలోచన కలిగిందే తడవుగా చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు రచనలు సంపాదించుకున్నాడు. చేమకూర వేంకటకవి విజయవిలాసాన్ని, ఇతర ప్రబంధాలను తెచ్చుకున్నాడు. నిఘంటువుల సాయంతో చదువుకున్నాడు. కర్నూలులోని వెల్లాల శంకరశాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యాన్ని చదివాడు. బి.ఎ. కొరకు మద్రాసు ప్రెసెడెన్సీ కాలేజికి వెళ్ళాడు. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవాలనుకున్నాడు. కాని సాంకేతిక కారణాలవల్ల కుదరదన్నారక్కడ. వేదం వేంకటరాయశాస్త్రితో సిఫారసు చేయించాడు. సంస్కృతంలో పరిచయాన్ని పరీక్షించదలచి భారతంలోని శ్లోకాన్ని చెప్పమన్నారు. పదవిభాగంతో సహా చెప్పాడు ప్రతాపరెడ్డి, చాలా సంతోషించి సంస్కృతాంధ్రాధ్యయనానికి అనుమతిని ఇచ్చారు కాలేజీవారు. చదివిన చదువు ఎప్పటికీ వ్యర్ధంకాదు. ఎక్కడో, ఎట్లాగో తప్పక ఉపయోగపడుతుంది.


చదువడం ఒక అలవాటుగా... కాదు వ్యసనంగా మారింది ప్రతాపరెడ్డికి, ఆయన కొనే పుస్తకాలకు, చదివే పుస్తకాలకు లెక్కనేలేదు. కొత్త పుస్తకమొచ్చిందంటేచాలు, కొనాల్సిందే... చదువాల్సిందే.. ఆ చదువడం కూడా ఏదో ఆషామాషీగా కాదు. పరిశీలనాత్మకంగా, విమర్శనాత్మకంగా చదివేవాడు. చదివిన పుస్తకంపై విమర్శ రాసి పెట్టుకొనేవాడు. ఈ లక్షణం భవిష్యత్తులో అతనిని మహాపరిశోధకుడిగా నిలిపింది. ఈ చదివే అలవాటే అతనికి తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పార్శీ, కన్నడ భాషల్లో పట్టు సాధించేటట్లు చేసింది. సంస్కృతం నేర్చుకోవడానికి వేదం వేంకటరాయశాస్త్రి విధించిన షరతు


మేరకు మాంసాహారాన్ని మానివేశాడు. చూడండి, చదువు జీవితానికి మలుపును, గెలుపును ఎట్లా ఇస్తుందో! చిన్ననాడు పాఠశాలలో పట్టుమని ఐదు నిమిషాలు కూడా ప్రసంగించలేని ప్రతాపరెడ్డి, తరువాతి కాలంలో గంటకు పైబడి గలగలమాట్లాడగలిగే స్థాయికి ఎదిగాడు. పట్టుదల ముందు ఎటువంటి ప్రతిబంధకాలు నిలువవు.


ప్రసంగంలో విషయానికి సంబంధించి ఎవరూ చెప్పని ఏవో కొత్త విషయాలను చెప్పడం సురవరం వారి ప్రత్యేకత. వారి అధ్యయనం, పరిశోధనాతత్పరత ఇందుకు దోహదపడింది. తెలంగాణ మాండలికాన్ని విరివిగా వాడడం వారి ప్రసంగాలకు వన్నెచేకూర్చేది. గ్రాంథికభాషలోను, గ్రామ్యభాషలోను అనర్గళంగా మాట్లాడేనైపుణ్యం వారి వాక్కుకుండేది.


'చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష' అనుకునేవాడు స్వార్థజీవి. పదిమంది మేలుకై పాటుబడేవాడు సార్థకజీవి. తన సంపదను, అక్షరసంపదను తెలంగాణ శ్రేయస్సు కొరకు ధారవోసిన త్యాగి ప్రతాపరెడ్డి నిజాం ఉక్కుపాదాలకింద ఉలుకుపలుకు లేక పడున్న తెలంగాణలో నవచైతన్యాన్ని నింపడానికి నడుంబిగించాడు ప్రతాపరెడ్డి, 'మూగవడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని'గా (డా॥ దాశరథిచే) కీర్తింపబడ్డాడు. ఈ ప్రజాచైతన్య మహోద్యమంలో దొరికిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. ఏకకాలంలో విభిన్నరంగాలలో కృషిచేశాడు. రంగాలు ఏవైనా ఆయన అంతరంగం మాత్రం తెలంగాణ మహాభ్యుదయం,


హైద్రాబాద్ లోని రెడ్డిహాస్టలు నిర్వహణ ద్వారా సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టాడు. కోత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి కోరిక మేరకు ఈ బాధ్యతను చేపట్టాడు. విద్యార్థుల దినచర్యలో విప్లవాత్మక మార్పులను తెచ్చాడు. క్రమశిక్షణకు పెద్దపీట వేశాడు. విద్యార్థి బాగుపడితే సమాజం బాగుపడుతుంది. 'మొక్కైవంగనిది మానై వంగునా?' కనుక విద్యార్థుల వేషంలో, ఆలోచనలో, అధ్యయనంలో మార్పుకు కృషి చేసి విజయుడయ్యాడు.


గోల్కొండ పత్రిక :


మద్రాసులో చదివేరోజుల్లోనే పత్రికొకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి. జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకు 'దేశబంధు' అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలెప్పుడూ మట్టిగలిసిపోవు. హైద్రాబాద్లో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. 'దేశబంధు' పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు. అందుకే 'గోల్కొండ' పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. 10 మే 1926న గోల్కొండపత్రిక పురుడు పోసుకుంది. నాటి తెలుగుపత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట.


పత్రిక ప్రారంభమైంది కాని నడపడం చాలా కష్టమైంది. ఆర్ధిక వనరులు, మానవ వనరులు తక్కువ. అయినా అధైర్యపడలేదు. ఆయన ప్రతాపరెడ్డికదా! తాను రచయితగానే కాక, సంపాదకుడిగా, ప్రూఫ్డర్, గుమాస్తాగా అనేక అవతారాలెత్తేవాడు. ఆటంకాలను ధైర్యంతో అధిగమించినవాడే లక్ష్యాన్ని చేరుతాడు. ఈ పత్రిక ప్రధానంగా రెండు లక్ష్యాలతో నడిచింది. ఒకటి ఆంధ్రభాషాసేవ, రెండవది 'జాతి, మత, కులవివక్షతలేక ఆంధ్రులలో సర్వశాఖలవారి సత్వరాభివృద్ధికి పాటుపడుట'. నాటి నిజాం దుష్కృత్యాల గురించి సంపాదకీయాలు సాగేవి. ప్రజల ఆలోచనలను పదునెక్కించే రచనలుండేవి. రచయితలను కవ్వించి వారి ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసేవాడు ప్రతాపరెడ్డి. ఇది ఎంతో గొప్ప సహృదయత.


ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్నిచ్చాడు. నిష్పక్షపాతంగా పత్రికను నడిపాడు. నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లాఖానన్ను నడివీధిలో నరికి చంపిన క్రూరమైన కాలమది. అటువంటి పరిస్థితుల్లో కూడా నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ సంపాదకీయాలు, వ్యాసాలు రాసిన సాహసమూర్తి ప్రతాపరెడ్డి, 23 సంవత్సరాలు గోల్కొండ పత్రిక సంపాదకునిగా ఆయన తెలంగాణకు చేసిన సేవ ప్రాతఃస్మరణీయం. ఈ పత్రిక తరువాత 'ప్రజావాణి' పత్రికను కొంతకాలం నడిపాడు.


గోల్కొండ కవుల సంచిక :


స్వస్థానాభిమానం లేని జీవితం కాగితం పువ్వువంటిది. 'తెలంగాణలో కవులు లేరు' అన్న వార్తను చూశాడు ప్రతాపరెడ్డి. దీటుగా జవాబు చెప్పాలనుకున్నాడు. ఎంతో శ్రమకోర్చి 'గోల్కొండ కవుల సంచిక (1935)ను ప్రకటించాడు. ఇందులో 183 మంది పూర్వకవులు, 354 మంది ఆధునిక కవుల రచనలు, పరిచయాలున్నవి. రవాణ వ్యవస్థ, తపాల, సాంకేతిక వ్యవస్థలు బలంగాలేని కాలం అది. అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని సంకల్పశక్తితో ఈ సంచికను ప్రకటించడం ప్రతాపరెడ్డి కార్యదక్షతకు ఒక ఉదాహరణ. గోల్కొండ కవుల సంచిక తెలంగాణ కవితా జయకేతనం. ఇంతటి ఘనకార్యం సాధించిన ప్రతాపరెడ్డి తన కవితలను సంకలనంగా వేయలేదు. తన గురించి కాదు, తన సమాజం గురించే ఆలోచిస్తారు. ఉత్తములు.

వివిధ సంస్థలతో అనుబంధం :


పరాయిభాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవడానికి ఆవిర్భవించింది ఆంధ్రమహాసభ. 3-3-1930 నాడు మెదకు జిల్లా జోగిపేటలో నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ తొలిసమావేశం జరిగింది. ఇదొక చారిత్రక సన్నివేశం. దీనికి ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించాడు.


విజ్ఞానవర్ధినీ పరిషత్తూ (1941) ఆంధ్రసారస్వత పరిషత్తు (1943) వ్యవస్థాపక సభ్యులైన ప్రతాపరెడ్డి తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తించాడు. కులమతాల పట్టింపులేని ఈయన యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘాలకు కూడా అధ్యక్షులుగా ఉన్నాడు. హైద్రాబాద్ ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, లక్ష్మణరాయ పరిశోధక మండలి, బాలసరస్వతీ గ్రంథాలయం, వేమన గ్రంథాలయం మొదలైన సంస్థలతో సన్నిహిత సంబంధముండేది తనకు. ఆనాడు తెలంగాణలో ఉన్న సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈయనకు అనుబంధమున్నది. అందుకే 'అతడులేని తెలంగాణ, అలంకరణ లేని జాణ' అన్నాడు దాశరథి. NGP


సాహిత్యం:


ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాడు కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత ప్రతాపరెడ్డి. చరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలుచేశాడు. గ్రంథ పరిష్కరణలు, జానపద సాహిత్య సేకరణ చేశాడు. పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించాడు.


పరిశోధకులుగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు. రాజుల చరిత్రనే చరిత్రగా చెలామణి అయ్యేకాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపజేశాడు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ఈయన గ్రంథం ఒజ్జబంతి అయింది. అందుకే కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించిందీగ్రంథం.


హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం "హిందువుల పండుగలు'. పండుగల విశేషాలనెన్నింటినో పురాణ, శాస్త్ర ప్రమాణంగా తెలిపాడు. 'శ్రీయుత ప్రతాపరెడ్డిగారిచే విరచితమైన 'హిందువుల పండుగలు' అను గ్రంథమునకు విపులముగా పీఠిక వ్రాయుటకు నాకు వ్యవధి చాలదు. శక్తియు చాలనిదే' అని నాటి భారత ఉపరాష్ట్రపతి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్గారు అభిప్రాయపడినారంటే ఈ గ్రంథ విశిష్టతను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.


సాహిత్యం ఆనందాన్నే కాదు ఉపదేశాన్నీ ఇవ్వాలి. ప్రతాపరెడ్డి భక్తతుకారాం నాటకంలో పలికించిన ఈ పద్యం ఎంతో స్ఫూర్తిమంతమైనది.


'అనిశము మాతృదేశహిత మాత్మను గోరెడివాడే భక్తుడౌ, దన తనువున్ ధనంబును ముదంబున నర్పణ సేయునట్టి యా మనుజుడె త్యాగి, బ్రాహ్మణుల మాలల నొక్కవిధంబు సూచు నా, జనుడె మనీషి, దుర్మదము శత్రుగజూచు నతండె శూరుడౌ.


భాష

వివిధ భాషలపై పట్టుసాధించిన సురవరం ప్రతాపరెడ్డికి తెలుగంటే ఎంతో ప్రీతి. తెలుగును చిన్నచూపుచూసే వారిని చూస్తే అతనికి అరికాలిమంట నెత్తికెక్కుతుంది.


నిఘంటువులకెక్కని పదాలెన్నింటికో అర్థాలను కూడా రాసిపెట్టాడు. 'పులిజూదము' వంటి పదాలను చిత్రసహాయంతో వివరించి నిఘంటువులెట్లా ఉండాలో చూపించాడు. తెలుగు లిపి సంస్కరణ జరగాలని కోరుకున్నాడు. 28 అక్షరాలతోనే వర్ణమాలను రూపొందించి తమ పరిశోధనా పటిమను ప్రదర్శించాడు. వారి కలానికి రెండువైపులా పదునే. గ్రాంథికం రాయగలడు. వ్యావహారికం వాడగలడు. గద్యరచనలో వ్యావహారిక భాషకే పెద్దపీట వేశాడు. A


వ్యక్తిత్వం:


నిరాడంబరత, నిర్భీతి, నిజాయతి, నిస్స్వార్ధత ప్రతాపరెడ్డి జీవలక్షణాలు. వేషభాషల్లో పరమతః। ప్రభావం ప్రచండంగా ఉన్న కాలంలో కూడా అచ్చమైన తెలుగు వాడిగా జీవించగలిగాడు. నిండైన తెలుగు వేషం. అక్షరాల్లోనే కాదు అంకెల్లోకూడా తెలుగును వాడేవాడు. 'స్వవేషభాషాదురభిమానిగా' పరిగణింపబడ్డాడు. తను ఎవరినీ స్తుతించడు. తనను ఎవరైనా స్తుతిస్తే భరించడు. వీరిలో ఆవేశంపాలు ఎక్కువ. అది ధర్మావేశం మాత్రమే. ఆత్మీయతకు తప్ప అహంకారానికి చోటులేని హృదయం. మంచి ఎక్కడున్నా గ్రహించే మనస్తత్వం అతనిది. జానపద సాహిత్యంలో విశేష షై కృషిచేసిన ఆచార్య బిరుదురాజు రామరాజుగారిని మొదట పరిశోధనవైపు మరలించింది సురవరంవారే. ఇట్లా ఎందరికో ప్రేరకుడు, ఎన్నో రచనలు రావడానికి కారకుడు.


కులమతాల పట్టింపులు లేని సంస్కరణశీలి. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్రమహాసభలో భాగ్యరెడ్డివర్మకు సభలో పాల్గొనే అవకాశం మొదటగా కల్పించింది ప్రతాపరెడ్డిగారే. అంబేద్కర్కన్న ముందే సమాజంలో దళితోద్యమస్ఫూర్తిని రగిల్చింది భాగ్యరెడ్డివర్మ.


ప్రతాపరెడ్డిగారి ఆలోచనా సరళి విభిన్నంగా ఉంటుంది. చారిత్రక పురుషుడు, మహాభారతాన్ని నడిపించిన ధీరుడైన శ్రీకృష్ణునికి మీసాలెందుకుండవు? అని ప్రశ్నించుకున్నాడు. ప్రత్యేకంగా 'మీసాల కృష్ణుని' చిత్రాన్ని మార్చాల రామాచార్యుల వారిచే గీయించి తమ గోల్కొండ పత్రిక కార్యాలయంలో పెట్టుకున్నాడు. ఇదొక ప్రత్యేక ఆకర్షణ.


వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూరు సంస్థానాధీశులతో తమకున్న పరిచయాన్ని ఎప్పుడూ స్వార్ధానికి వాడుకోలేదు. సాహిత్య సమారాధనకే ఉపయోగించాడు.


వనపర్తి శాసనసభ్యుడిగా 1952లో ఎన్నికైన ప్రతాపరెడ్డి మొదటి నుండీ ప్రజల మనిషే తన మరణానికి (25-8-1953) ఒకరోజు ముందు కూడా ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి వెళ్ళిన సామాజిక హితచింతనుడు. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో ప్రభావితం చేసిన ప్రతాపరెడ్డి జీవనం పావనం, ఆదర్శవంతం, వారి సమున్నత మూర్తిమత్వాన్ని దర్శించాలంటే ఈ పద్యం చదువాల్సిందే.


'రైతయి, రాజబంధువయి, రచ్చకు పెద్దయి, కావ్యవేద ని ష్ణాతుడునై, స్వతంత్రుడయి, శాసనకర్తయి, శాస్త్రకర్తయై తాతలనాటి సంస్కృతికి తావలమై, పురుషార్థ జీవియై మా తెలగాణ గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే


- గంగాపురం హనుమచ్ఛర్మ (దుందుభి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana