చిత్రగ్రీవం

 చిత్రగ్రీవం


మూలం : ధనగోపాల్ ముఖర్జీ


పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు మనోహరమైనవి. గుడ్డు బద్దలు కొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకొనిరావడం మొదటిది. అట్లా వచ్చిన పిల్లపక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లిపక్షి పెంపకం కొనసాగించడం రెండవది. ఇంతకు చిత్రగ్రీవం ఎవరు? దాని పెంపకం ఎట్లా సాగింది? అది ఎట్లా ఎగరడం నేర్చుకున్నది? అనే విషయాలను పాఠం చదివి తెలుసుకుందాం.


పది లక్షల జనాభా ఉందని మనం చెప్పుకునే కోల్కతా మహానగరంలో కనీసం ఇరవై లక్షల పావురాలు ఉంటాయి. ప్రతీ మూడో కుర్రాడి దగ్గర కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరికీల పావురాలూ, పిగిలి పిట్టలూ, బంతి పావురాలూ ఉండటం కద్దు. పావురాలను మచ్చిక చెయ్యడం అన్న కళ వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతోంది. ఆ కళ పుణ్యమా అని పక్షులను ప్రేమించేవారిని అలరించే పిగిలిపిట్ట, బంతి పావురం అన్న రెండు విశిష్టమైన పావురాల జాతులను భారతదేశం ప్రపంచానికి అందించింది. ఎన్నో శతాబ్దాలనుంచీ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువరాణులూ తమతమ చలువరాతి మందిరాలలోనూ సామాన్యులూ, నిరుపేదలూ తమ తమ ఇళ్ళూ, పూరిళ్ళలోనూ-పావురాల మీద ప్రేమ, ఆప్యాయతలను కురిపిస్తూనే ఉన్నారు. శ్రద్ధాసక్తులను చూపిస్తూనే ఉన్నారు. గొప్పవాళ్ళ పూదోటలూ, ఫౌంటెన్లూ గానివ్వండి, సామాన్యుల పూలమడులూ, పళ్ళ చెట్లూ గానివ్వండి అవన్నీ రకరకాల రంగు రంగుల పావురాలతోనూ, నీలికళ్ళతో కువకువలాడే గువ్వలతోనూ నిండి ఉండడం కద్దు.


ఈ నాటికీ విదేశీయులెవరైనా మన మహానగరాలకు వచ్చినట్టయితే వాళ్ళకు ఉల్లాసకరమైన చల్లనిగాలిలో గిరికీలు కొట్టే పావురాల బృందాలు కనిపిస్తాయి. ఆ పెంపుడు పావురాలకు తమ తమ డాబా ఇళ్ళమీద నిలబడి తెల్లజెండాలు ఊపుతూ సంకేతాలు అందించే అసంఖ్యాకమైన కుర్రాళ్ళు కనబడతారు. ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెను మేఘాలలాగా సాగిపోవడం కనిపిస్తుంది. మొదట అవి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి తమ తమ యజమానుల ఇళ్ళ మీద ఓ ఇరవై నిమిషాలపాటు చెక్కర్లు కొడతాయి. ఆ తర్వాత అవి క్రమక్రమంగా పైపైకి సాగిపోతాయి. వివిధ ప్రాంతాల నుంచి వెలువడిన వేరు వేరు బృందాలన్నీ మెల్లగా కలగలిసిపోతాయి. ఒక బృహత్తర సమూహంగా రూపొందుతాయి. కనుచూపుకు అందనంత ఎత్తుకు ఎగిసిపోతాయి. అలా కలగలిసి, ఎగసి గంటల తరబడి ఎగిరాక తిరిగి అన్నీ విడివిడిగా తమ తమ యజమానుల ఇళ్ళకు చేరుకొంటాయి. నగరంలోని ఇళ్ళు గులాబీ, పసుపూ, ఊదా, తెలుపులాంటి రకరకాల రంగులలో ఉన్నా! స్థూలంగా వాటి పైకప్పులు ఒకే పరిమాణంలో, ఒకే ఆకృతిలో ఉంటాయి. అయినా మరి ఆ వేలాది పావురాలు ఎన్నెన్నో దూరాలు కలిసిమెలిసి ఎగిరినాక, తిరిగి కచ్చితంగా తమ తమ ఇళ్ళకూ, గూళ్ళకు ఎలా చేరుకోగలుగుతున్నాయి అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి పావురాలకు అద్భుతమైన దిశాపరిజ్ఞానం ఉంటుంది. ఏనుగులు, పావురాలకన్నా తమ తమ యజమానులపట్ల ఎక్కువ విశ్వాసం ప్రదర్శించే ప్రాణులను నేనింతవరకూ చూడలేదు. ఈ రెండిటితోనూ నాకు సన్నిహిత పరిచయం ఉంది. వనసీమలోని గజరాజులుగానివ్వండి, నగర సీమలలోని పావురాలు గానివ్వండి, అవి తమ యజమానులంటే ప్రాణంపెడతాయి. రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ గగన సీమల్లో ఎగిరినా చివరకి అవి తమకున్న అద్భుతమైన అంతః ప్రేరణాబలంతో తమ మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకు చేరుకుంటాయి.


నా పెంపుడు ఏనుగు పేరు 'కరి', నాకో పెంపుడు పావురం కూడా ఉంది. దాని పేరు 'చిత్రగ్రీవం' 'చిత్ర' అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన - అని అర్థం. 'గ్రీవం' అంటే కంఠం. నా పావురం మెడ చిత్ర విచిత్ర వర్ణభరితం అన్న మాట. అప్పుడప్పుడు అందుకే మా పావురాన్ని 'హరివిల్లు మెడగాడు' అని ముద్దుగా పిలుస్తుంటాను.


చిత్రగ్రీవం కథను నేను మొట్టమొదట్నించీ మొదలెడతాను, ముందు దాని తల్లిదండ్రుల గురించి చెప్పుకొందాం. దాని తండ్రిపక్షి ఓ గిరికీల మొనగాడు. తల్లిపక్షి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం. ఆ రెండు విశిష్టమైన పావురాలూ జతగట్టినాయి. గుడ్లు పెట్టినాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం అందువల్లనే తర్వాతిరోజుల్లో యుద్దరంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పనిచెయ్యగల వార్తాహరియైన పావురంగా రూపొందింది. తల్లిపక్షి నుండి తెలివితేటలు సంపాదించుకున్నది. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకున్నది. అలా సమకూర్చుకున్న శక్తియుక్తుల పుణ్యమా అని అది ఎన్నోసార్లు శత్రువుల దాడి నుంచి ఆఖరిక్షణంలో ఆ దాడి చేస్తున్న డేగల తలలమీద నుంచే గిరికీలు కొట్టి తప్పించుకోగలిగింది. ఆ ముచ్చట్లు సమయమూ సందర్భమూ సరికూడినప్పుడు మరోసారి చెప్పుకొందాం.


ఇంకా గుడ్డులో ఉన్నప్పుడే చిత్రగ్రీవం ఓ ప్రమాదం లోంచి త్రుటిలో ఎలా తప్పించుకుందో ముందు చెపుతాను. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. తల్లి పావురం పెట్టిన రెండుగుడ్లలో ఒకదాన్ని పొరపాటున జారవిడిచి పగలగొట్టిన రోజది. ఆ తెలివిమాలిన పనికి నేను ఈనాటికీ సిగ్గుపడుతూ ఉంటా, బాధపడుతూ ఉంటా, నేను పగలగొట్టిన ఆ రెండో గుడ్డులో ప్రపంచంలోకెల్లా అతి విశిష్టమైన పావురం ఉండేదేమో ఎవరికి తెలుసు! ఆ దుర్ఘటన ఇలా జరిగింది.


మాది నాలుగంతస్తుల మేడ. ఆ మేడ మీద పావురాల గూళ్ళు ఉండేవి. తల్లిపావురం గుడ్లను పొదుగుతున్న గూటిని. నేను ఓ రోజు శుభ్రం చేద్దామని వెళ్ళాను. తల్లిపిట్టను మృదువుగా లేపి తీసి ఓ పక్కన ఉంచాను. తర్వాత ఒక్కో గుడ్డునే యథాస్థానంలో ఉంచాను. రెండో గుడ్డు మీద మెల్లగా దృఢంగా నే చేతిని ఉంచిన క్షణంలో జరిగిందా ప్రమాదం. నేనా గుడ్ల మార్పిడిలో ఉన్నప్పుడు - ఇంటి పైకప్పును తుఫాను ఎగురగొట్టినట్టుగా నా మొహాన్ని ఏదో బలంగా తాకింది. తీరా చూస్తే అది తండ్రిపావురం. రెక్కలతో బలంగా నా మొహాన్ని మోదుతోంది. ఇంకా దారుణం ఏమంటే నా ముక్కు మీద తన గోళ్ళను కూడా దిగవేసిందది. ఆ నొప్పి ఆ గగుర్పాటూ వాటి పుణ్యమా అని రెండో గుడ్డును నాకు తెలియకుండానే ఎప్పుడు వదిలేసానో వదిలేశాను. అతికష్టం మీద ఆ తండ్రిపక్షిని దూరంగా తరిమేయగలిగాను. ఈ లోపల జరగవలసిన ప్రమాదం జరగనే జరిగింది. రెండో గుడ్డు పగిలి ఛిన్నాభిన్నమై నా కాళ్ళ దగ్గర పడి ఉన్నది. నా మీదా, ఆ దిక్కుమాలిన తండ్రిపక్షి మీదా నాకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. నా మీద నాకెందుకు కోపం వచ్చిందీ అంటారా తండ్రి పావురం నుంచి అలాంటి దాడి జరగవచ్చని నేను ఊహించి ఉండాలిగదా... జాగ్రత్తపడి ఉండాలిగదా. నేనేదో గుడ్లని సంగ్రహించడానికి వచ్చాననుకొండా తండ్రిపక్షి. ఆ అజ్ఞానంతో అది ప్రాణాలకు తెగించి మరీ నా మీద దాడి చేసింది. గుడ్లను ఎత్తుకు పోకుండా ఆపుదామనుకొన్నది. పొదుగుల కాలంలో గూళ్ళను శుభ్రపరచేటప్పుడు అన్ని రకాల సంఘటనలకూ, దాడులకూ మనం సిద్ధపడి ఉండాలి.


సరే - మళ్ళా మన కథ దగ్గరకు వద్దాం. గుడ్డు పై పెంకును ముక్కుతో పొడిచి పిల్లపక్షిని ఈ ప్రపంచంలోకి ఎప్పుడు తీసుకురావాలో తల్లిపక్షికి కచ్చితంగా తెలుసు. తండ్రిపక్షి కూడా అడపాదడపా గుడ్లమీద కూర్చొని పొదిగేమాట నిజమేగాని పొదగటం అన్న పనిని మూడింట రెండువంతులు నిర్వహించేది తల్లిపక్షే. ఆ మిగిలిన మూడోవంతు పొదిగేది తండ్రిపక్షే అయినా పిల్లపక్షుల్ని ప్రపంచంలోకి ఎప్పుడు తీసుకురావాలి అన్న విషయం దానికి తెలియదు. ఆ పరిజ్ఞానం తల్లిపక్షి సొత్తు. గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన కలగలసి ప్రాణం పోసుకొని పిల్లపక్షిగా రూపొంది ప్రపంచంలోకి అడుగుపెట్టటానికి సంసిద్ధమయ్యే శుభముహూర్తం వచ్చిందని తల్లిపక్షికి అంత కచ్చితంగా ఎలా తెలుస్తుందీ అన్నది మన ఊహకందని విషయం. అలాగే పై పెంకు మీద ఏ చోటున ఎంత బలంతో ముక్కుతో తాకాలో కూడా తల్లిపక్షికి క్షుణ్ణంగా తెలుసు.. పిల్లపక్షికి ఏ గాయమూ తగలకుండా సరైన ప్రదేశంలో సరైన సమయంలో ముక్కుతో గుడ్డును బద్దలుగొట్టడం, పిల్లపక్షిని ప్రపంచంలోకి ఆహ్వానించడం ఇవన్నీ నాకు అద్భుత మనిపిస్తాయి.


చిత్రగ్రీవం పుట్టటం కూడా సరిగ్గా నేను పైన వివరించినట్టుగానే జరిగింది. గుడ్లను పొదగటం మొదలెట్టిన ఇరవయ్యో రోజున తల్లిపక్షి గుడ్డు మీద కూర్చోవడం మానేసి పక్క పక్కన తారాడటం గమనించాను. తండ్రిపక్షి మేడమీది పిట్టగోడమీంచి దిగివచ్చి గుడ్డును పొదగడానికి ప్రయత్నించిన ప్రతిసారీ తల్లిపక్షి ఆ తండ్రిపక్షిని ముక్కుతో పొడిచి దూరంగా తరిమేసేది. “నన్నెందుకిలా తరిమేస్తున్నావ్?" అన్నట్టుగా ఆ తండ్రిపక్షి కువకువలాడేది. "వెళ్ళవయ్యా వెళ్ళు. ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నాను, ఇబ్బంది పెట్టకుండా పక్కకు వెళ్ళు" అన్నట్టుగా తల్లిపక్షి తండ్రిపక్షిని మరికాస్త దూరంగా నెట్టేసేది. చివరికి తండ్రిపక్షికి అక్కడ్నుంచి వెళ్ళక తప్పలేదు.


అదంతా చూసి నాకు కంగారు మొదలయింది. గుడ్లు పొదగడం పూర్తవ్వాలనీ, పిల్లపక్షి ప్రాణం పోసుకొని గుడ్డులోంచి బయటపడితే చూడాలనీ నాకు మహా ఆత్రంగా ఉన్నది. మరి తల్లిపక్షి ప్రవర్తన చూస్తే విచిత్రంగా ఉందాయే! ఆందోళనతో, ఆసక్తితో, ఆత్రంగా గూటికేసి చూడసాగాను. ఓ గంట గడిచింది. పరిస్థితిలో మార్పు లేదు. మరో ముప్పావుగంట గడిచాక తల్లిపక్షి మెడ అటూ ఇటూ తిప్పుతూ శ్రద్ధగా ఏదో వినసాగింది. బహుశా గుడ్డులోపల కదలికల శబ్దాలయి ఉండాలవి. మెల్లగా తల్లిపక్షి శరీరంలో స్పందన మొదలయింది. దాని శరీరమంతా ఏదో తీవ్ర ప్రకంపన పాకుతోందా అనిపించింది. తల్లిపక్షిలో ఏదో దివ్య సంకల్పం చోటుచేసుకున్నట్టు అనిపించింది. తల నిక్కించి గురిచూసింది. రెండే రెండు ముక్కుపోట్లతో గుడ్డును పగలగొట్టింది. పిల్లపక్షి బయటపడింది. ఒళ్లంతా ముక్కు.. చిన్న పాటి శరీరం. స్వల్పంగా కంపిస్తున్న శరీరం. 'ఇన్నాళ్ళూ తాను శ్రమపడిందీ, ఎదురుచూస్తున్నదీ ఇలాంటి బలహీనమైన నిస్సహాయమైన అర్భకమైన పిల్లపక్షి కోసమా?' అని తల్లిపక్షి ఆశ్చర్యపడినట్లు అనిపించింది. అయినా పిల్లపక్షి నిస్సహాయతను గమనించిన మరుక్షణం తల్లిపక్షి దానిని తన రొమ్ములోని నీలి ఈకలమాటున పొదవుకొంది. పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహరమైనవి. గుడ్డు బద్దలుగొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకురావడం అందులో మొదటిది. అలా వచ్చిన పిల్లపక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లిపక్షి పెంపకం కొనసాగించడం రెండోది. చిత్రగ్రీవం పెంపకం ఎంతో అనురాగంతో సాగింది. మనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని లాలిస్తే ఆ పిల్లలకు ఎలాంటి హాయీ సౌఖ్యమూ లభిస్తాయో చిత్రగ్రీవానికి తన తండ్రిపక్షి, తల్లిపక్షులనుంచి అలాంటి వెచ్చదనం లభించింది.


చంటిపక్షులు ఎదిగి వచ్చే సమయంలో వాటి గూళ్ళలో మరీ ఎక్కువగా మెత్తటి దూదీ, పీచు లాంటి పదార్థాలను ఉంచగూడదు. వాటిని తగు మోతాదులోనే ఉంచాలి. లేకపోతే గూడు మరీ వెచ్చనైపోతుంది. అరకొర జ్ఞానపు పావురాల పెంపకందారులు పిల్లపక్షులు ఎదిగే సమయంలో తమ శరీరంనుంచే చాలా మోతాదులో వెచ్చదనాన్ని విడుదల చేస్తాయన్న విషయం గ్రహించరు. ఈ సమయంలో పావురాల గూళ్ళను మరీ తరచుగా శుభ్రం చెయ్యటం కూడా మంచిదిగాదు. తల్లిపక్షి, తండ్రిపక్షి ఆచితూచి గూటిలో ఉంచే ప్రతి వస్తువూ పిల్లపక్షి సుఖసౌకర్యాలకు దోహదం చేస్తాయి.


పుట్టిన రెండోనాటి నుంచే చిత్రగ్రీవం తన తల్లి తండ్రో గూటికి వచ్చిన ప్రతిసారీ తన ముక్కు తెరచి తన గులాబీరంగు ఒంటిని బంతిలా ఉబ్బించడం నాకు స్పష్టంగా గుర్తున్నది. బార్లా తెరచిన పిల్లపక్షుల నోళ్ళల్లో పెద్ద పక్షులు తాము సంపాదించిన ధాన్యపుగింజల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పోస్తాయి. అలా పోసిన ఆ పదార్థం ఎంతో మెత్తగా ఉంటుంది. పెద్దపక్షులు ముందస్తుగా తాము సంపాదించిన గింజల్నీ విత్తనాల్నీ తమ కంఠంలో కాసేపు నాననిచ్చి మెత్తబరుస్తాయి. ఆ తర్వాతే ఆ ఆహారాన్ని పిల్లలకు అందిస్తాయి. పిల్లపక్షులకు నెలరోజుల వయసు వచ్చినపుడు కూడా పెద్దపక్షులు తిన్నగా గింజల్ని అందించవు. ముందు తమ కంఠంలో మెత్తబరిచినంక అందిస్తాయి.


మా చిత్రగ్రీవానికి ఆకలి ఎక్కువ. ఒక పెద్దపక్షి తన దగ్గరే ఉండి లాలిస్తూ తన బాగోగులు చూస్తూ ఉండగా, రెండో పక్షి తన కోసం ఆహార సేకరణలో నిమగ్నమై ఉండేలా చేసేది చిత్రగ్రీవం. తల్లితో సరిసమానంగా తండ్రి కూడా చిత్రగ్రీవం బాగోగులు సరిచూడడంలోనూ, ఆహారం అందించడంలోనూ పాలుపంచుకొందని నా అంచనా. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ పుణ్యమా అని చిత్రగ్రీవం మహా ఏపుగా ఎదిగింది. గులాబీరంగు మారి పసుపు కలిసిన తెలుపురంగు వచ్చింది. ఈకలు రానున్నాయనడానికి ఈ రంగు మార్పు మొదటి సూచన. తర్వాత చిన్న చిన్న బొడిపెల్లా ముళ్లపంది ముళ్లలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్ళ దగ్గర, నోటి దగ్గర అప్పటిదాకా వేలాడుతూ ఉన్న పసుపుపచ్చని చర్మాలు రాలిపోయినాయి. పొడవాటి, గట్టి, సూదిలాంటి ముక్కు రూపు దిద్దుకున్నది. ఎంతబలమైన ముక్కో.. ఓ సంఘటన చెపుతాను.


చిత్రగ్రీవానికి మూడువారాల వయసప్పుడు దాని గూటిలోకి ఒక చీమ పాకింది. గూటి అంచున కూర్చొని ఉన్న చిత్రగ్రీవం ఎవరి ఉపదేశమూ లేకుండానే ఆ చీమను టక్కున తన ముక్కుతో పొడిచింది. అప్పటిదాకా ఏకఖండంగా సాగిన ఆ చీమ ఒక్క దెబ్బతో రెండు ముక్కలైపోయింది. తన ముక్కుతో ఆ చీమ తునకలను కదిపి చూసి తాను చేసిన ఘనకార్యం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేసింది చిత్రగ్రీవం. అది ఏదో తినే వస్తువు అనుకొని తమ పావురాల జాతికి మిత్రుడైన ఆ అమాయికపు నల్లచీమను చిత్రగ్రీవం పొడిచి చంపిందనడంలో సందేహం లేదు. తాను చేసిన పని చూసి చిత్రగ్రీవం పశ్చాత్తాపపడిందనీ మనం అనుకోవచ్చు. ఏదేమైనా చిత్రగ్రీవం మళ్ళా ఎప్పుడూ తన జీవితంలో మరోసారి చీమను చంపలేదు.


పుట్టిన ఐదో వారానికల్లా చిత్రగ్రీవం తను పుట్టిన గూటినుంచి బైటకు గెంతి పావురాళ్ళ గూళ్ళ దగ్గర ఉంచిన మట్టి మూకుళ్ళలోంచి మంచినీళ్ళు తాగే స్థాయికి చేరుకున్నది. రోజూ సొంతంగా ఆహారం సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చిత్రగ్రీవం స్థూలంగా తన ఆహారంకోసం తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉన్నది. నా ముంజేతి మీద కూర్చొని అరచేతిలో గింజల్ని ఒక్కొక్కటిగా పొడుచుకు తినేది. గారడీవాడు చమత్కారంగా బంతులను గాలిలోకి ఎగరేసి పట్టుకొనే విధంగా చిత్రగ్రీవం గింజలను తన గొంతులో పైకీ కిందకీ ఆడించి ఆ తర్వాత టక్కున మింగేది. అలా మింగిన ప్రతిసారీ నాకేసి చూసి 'భలే బాగా చేస్తున్నాను గదూ! మా అమ్మ నాన్న పైకప్పుమీద చలికాగుతున్నారు గదా... వాళ్ళు దిగివచ్చాక నేనెంత చురుకైన దాన్నో వాళ్ళకు చెపుతావుగదూ!" అన్నట్టుగా నాకేసి చూసేది. కానీ ఏమాటకామాట చెప్పుకొందాం. శక్తియుక్తులు పెంపొందించుకోవడంలో నా దగ్గర ఉన్న పావురాలు అన్నిట్లోకి చిత్రగ్రీవమే మందకొడి,


ఆ రోజుల్లోనే నేనో విషయం కనిపెట్టాను. గాలి దుమారాల్లో, కళ్ళు మూసుకుపోయే దుమ్మూ ఇసకల్లో పావురాలు నిరాటంకంగా ఎలా ఎగరగలుగుతాయో నాకు అప్పటిదాకా తెలియదు. రోజురోజుకీ పెరిగి పెద్దదవుతున్న చిత్రగ్రీవాన్ని దగ్గర నుండి గమనించే క్రమంలో ఓ రోజు దాని కళ్ళ మీదకు సన్నపాటి చర్మపు పొర సాగి రావడం గమనించాను. దాని కంటి చూపుగానీ పోవడంలేదుగదా అని భయపడి మరికాస్త పరీక్షగా చూడటంకోసం చిత్రగ్రీవాన్ని నా మొహం దగ్గరకు లాక్కున్నాను. అలా లాగగానే చిత్రగ్రీవం తన బంగారు రంగు కళ్ళు విప్పార్చి గూట్లో లో వెనక్కు వెనక్కు వెళ్ళిపోయింది. అయినా చెయ్యిజాచి పట్టుకొని మేడమీదకు తీసుకెళ్ళాను. ఆ మే నెల మండుటెండలో దాని కనురెప్పల్ని పరిశీలించాను. అప్పుడు కనిపించిందది: దాని కనురెప్పలకు అనుబంధంగా మరో పల్చని చర్మపుపొర ఉన్నది. నేను దాని మొహాన్ని సూర్యునికేసి తిప్పిన ప్రతిసారీ చిత్రగ్రీవం తన బంగారు కళ్ళమీదకు ఆ చర్మపు పొరను సాగలాగేది. అది కళ్ళకు రక్షణ కలిగించే చర్మపుపొర అనీ, దాని సాయంతో పావురాలు గాలిదుమారాల్లోగానీ, తిన్నగా సూర్యుని దిశగా గానీ ఏ ఇబ్బందీ లేకుండా ఎగరగలవనీ బోధపడింది.


మరో రెండువారాలు గడిచేసరికల్లా చిత్రగ్రీవం ఎగరడం నేర్చుకుంది. పుట్టింది పక్షి పుట్టుకే అయినా ఆ ఎగరడం నేర్వడం అన్నది అంత సులభంగా జరగలేదు. మన పిల్లగాళ్ళకు నీళ్ళంటే ఇష్టమేగావచ్చు. కానీ ఈత నేర్చుకోవాలంటే మునిగి తేలడమూ నీళ్ళు మింగడమూ తప్పవు గదా.... అలాగే పిల్లపావురాలు కూడా ఎంతో కష్టపడితేగానీ ఎగరడం నేర్చుకోలేవు. చిత్రగ్రీవానికి తన రెక్కలు విప్పడం విషయంలో ఏదో సంకోచం ఉన్నట్టుంది. గంటల తరబడి మేడ మీద బాగా గాలి వచ్చేచోట కూర్చున్నా రెక్కలు విప్పి ఎగరడం విషయంలో మాత్రం దాని ధోరణి నిమ్మకు నీరెత్తినట్టు ఉండేది. ఈ సంగతి స్పష్టం అవడంకోసం మీకు మా మేడ ఎలా ఉంటుందో చెపుతాను. మాది నాలుగంతస్థుల ఇల్లు. మేడమీద చుట్టూ పద్నాలుగేళ్ళ పిల్లాడంత ఎత్తైన బలిష్టమైన కాంక్రీటు పిట్టగోడ. వేసవికాలంలో రాత్రిపూట మేమంతా మేడమీదే పడుకునేవాళ్ళం. అలాంటి సమయాల్లో ఎవరైనా పొరపాటున నిద్రలో నడుచుకుంటూ వెళ్ళినా మేడమీంచి వాళ్ళు అమాంతంగా పడిపోకుండా అడ్డుకొనేంత ఎత్తు ఉన్న పిట్టగోడ అది.


చిత్రగ్రీవాన్ని రోజు తీసుకెళ్ళి ఆ పిట్టగోడ మీద పదిలేవాడిని. అక్కడ ఆ గాలుల్లో అది అలా గంటల తరబడి కూర్చొని ఉండేది. అంతే తప్ప ఎగరడం గిగరడం అన్న పనులేవీ పెట్టుకొనేది గాదు. ఇలా కాదని ఒకరోజు పిట్టగోడ కింద కాసిని శెనగగింజలు పోసాను. కిందకి దిగివచ్చి ఆ గింజల్ని తిని పొమ్మని చిత్రగ్రీవాన్ని పిలిచాను. 'ఏవిటీ సంగతి?' అన్నట్టుగా కాసేపు చూసింది. నేను తీసుకువెళ్ళి తనకు ఆ గింజల్ని తినిపించబోవడం లేదని స్పష్టమయ్యాక అది పిట్టగోడమీదే అటూ ఇటూ పచార్లు చెయ్యడం మొదలు పెట్టింది. అడపాదడపా మెడనిక్కించి నాలుగడుగులు కిందనున్న గింజల్ని చూడటం మాత్రం మానలేదు. అలా ఆ నిరాశాభరితమైన నాటకం ఓ పావుగంట దాకా కొనసాగింది. చిట్టచివరకు అది సంకోచాన్ని అధిగమించి పిట్టగోడమీంచి కిందకు దూకనే దూకింది. దాని కాళ్ళు నేలను తాకే సమయంలో అప్పటిదాకా ఏనాడూ తెరచుకొని ఉండని దాని రెక్కలు అది గింజలమీద వాలి బాలెన్సు చేసుకునే ప్రక్రియలో అప్రయత్నంగా హఠాత్తుగా చక్కగా విప్పుకున్నాయి. ఎంతటి ఘన విజయం!

ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారడం గమనించాను. అంతగా ఆకట్టుకోలేని బూడిదరంగు కలసిన నీలివర్ణపు ఈకలకు బదులుగా దాని ఒళ్లంతా సముద్రపు నీలిరంగు ఈకలతో ధగధగా మెరవసాగింది. దాని మెడప్రాంతం సూర్యకాంతిలో ఇంధ్రధనుస్సు వర్ణాల పూసలగొలుసులా శోభిల్లసాగింది.


ఎగరడం అన్న మహత్తరమైన ఘట్టానికి చేరుకున్నది చిత్రగ్రీవం. దాని తల్లీ, తండ్రీ, చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పిస్తాయని ఎదురుచూశాను. ఈ లోపల నాకు చేతనయిన రీతిలో నా వంతు ప్రయత్నం చేశాను. రోజూ చిత్రగ్రీవాన్ని మణికట్టు మీద ఉంచుకొని కొద్ది నిమిషాలపాటు చేతిని పైకీ కిందకీ పదే పదే కదిపేవాడిని. అలా కదిపినప్పుడు చిత్రగ్రీవం బాలెన్సు నిలదొక్కుకోవడం కోసం రెక్కలు విప్పడం ముడవడం చేసేది. అలా దానికి రెక్కలు ముడవడం విప్పడం అలవాటయింది. కానీ ఎగరడం అంటే ఇంకా చాలా తతంగం ఉంది కదా... ఆ మిగిలిన పాఠాలు నేర్పడం నా పరిధిలో లేదు గదా... అసలు ఎందుకీ ఆత్రం అని మీరు అనుకోవచ్చు. తోటి పావురాలతో పోలిస్తే చిత్రగ్రీవం ఎగరడం విషయంలో వెనకబడి ఉండటం దానికి ఒక కారణం. అదీ కాకుండా జూన్నెల వచ్చేసిందంటే వర్షాలు అందుకొంటాయి. వర్షాలు మొదలయ్యాయి అంటే పక్షులకు దూరాలు ఎగరడం అసాధ్యమవుతుంది. అంచేత వర్షాకాలం ముంచుకొచ్చేముందుగానే చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పేయాలి అనుకొన్నాను.


మే నెల ఇంకా కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది అనగా తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పే పని చేపట్టింది. ఆ రోజు అప్పటిదాకా బలంగా వీచి ఊరును చల్లబరచిన ఉత్తరపు గాలి సన్నగిల్లి మంద్రంగా సాగుతోంది. ఆకాశం కడిగిన నీలిముత్యంలా నిర్మలంగా ఉన్నది. దుమ్ము ధూళీ లేకుండా వాతావరణం స్వచ్ఛంగా ఉన్నది. ఊళ్ళోని ఇళ్ళ పైకప్పులూ, దూరాన ఉన్న పంటపొలాలూ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం మూడుగంటలవేళ, చిత్రగ్రీవం మేడ పిట్టగోడమీద కూర్చొని ఉన్నది. అప్పటిదాకా చుట్టుపక్కల గిరికీలు కొడుతున్న తండ్రి పక్షి వచ్చి ఎండకాగుతున్న చిత్రగ్రీవం పక్కన వాలింది. వాలి చిత్రగ్రీవం కేసి ఓ చూపు చూసింది. "ఏం వాయ్ బడుద్దాయ్. మూడునెలలు నిండాయి. ఇంకా ఎగిరే ప్రయత్నాలేం లేవా? భయమా? అసలు నువ్వు పావురానివా, వానపామువా?" అన్నట్టుగా చిత్రగ్రీవం కేసి చూసింది. చిత్రగ్రీవం ఉలుకూ పలుకూ లేకుండా గంభీరంగా ఉండిపోయింది. తండ్రి పక్షికి చిర్రెత్తుకొచ్చింది గాబోలు పావురాల ఫక్కీలో కువకువా కూస్తూ చిత్రగ్రీవాన్ని గద్దించసాగింది. ఆ గద్దింపుల జడివాననుంచి తప్పించుకుందామని చిత్రగ్రీవం పక్కపక్కకు జరగసాగింది. తండ్రిపక్షి పట్టు విడవకుండా కూతలు పెడుతూ రెక్కలు టపటపలాడిస్తూ తనూ జరగసాగింది. చిత్రగ్రీవం ఇంకా ఇంకా జరిగింది. తండ్రిపక్షి జరగటం కొనసాగించింది. చిట్టచివరికి చిత్రగ్రీవం పిట్టగోడ అంచుకు చేరింది. ఇంకాస్త జరిగితే కిందపడే స్థితికి చేరుకుంది. ఉన్నట్టుండి తండ్రి పక్షి తన భారాన్నంతా చిత్రగ్రీవం మీద మోసేసింది. చిత్రగ్రీవం గోడమీద నుంచి జారనే జారింది. అలా ఒక అడుగు జారిందో లేదో స్వీయరక్షణకోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలో తేలింది. మా సంతోషానికి అవధులు లేవు. అప్పటిదాకా కింద అంతస్తులోని నీళ్ళ కుండీలలో జలకాలాడుతున్న తల్లి పక్షి మెట్లమీదుగా మేడమీదికి చేరుకుని తనూ చిత్రగ్రీవానికి సాయంగా ఎగరసాగింది. అలా అవి రెండూ ఎంతలేదన్నా పది నిమిషాలపాటు ఎగిరాయి. ఆకాశంలో గిరికీలు కొట్టి వచ్చి కిందకు వాలాయి. అలా వాలేటప్పుడు తల్లిపక్షి రెక్కలు ముడిచి యథాలాపంగా తాను వాలదలచిన ప్రదేశంలో శుభ్రంగా వాలింది. చిత్రగ్రీవం మాత్రం నానా పాట్లు పడింది. ఒకటే కంగారు, ఒళ్ళంతా వణుకు. వాలే క్షణంలో దాని కాళ్ళు నేలను రాసుకుంటూ పోయాయి. అలా నేలను రాసుకుంటూ వెళుతూ, రెక్కల్ని కంగారు కంగారుగా టపటపలాడిస్తూ, తనను తాను బాలెన్సు చేసుకుంటూ బాగా ముందుకు సాగి ఆగింది. అలా ఆగినప్పుడు దాని రొమ్ము గోడను తాకింది. గబుక్కున రెక్కలు ముడిచేసింది. ఎలాగైతేనేం క్షేమంగా వాలి ఆగింది కదా! చిత్రగ్రీవం ఉత్తేజంతో రొప్పసాగింది. తల్లిపక్షి దానిపక్కకు చేరి ముక్కుతో నిమిరింది. దాని రొమ్ముకు తన రొమ్ము తాకించింది. చిన్న పిల్లాడిని లాలించినట్టుగా లాలించింది. తాను చేపట్టిన కార్యం విజయవంతంగా ముగియటం గమనించిన తండ్రిపక్షి జలకాలాడటం కోసం కింది అంతస్తులోని నీళ్ళకుండీల దగ్గరకు చక్కా ఎగిరిపోయింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana