షోయబుల్లాఖాన్

 షోయబుల్లాఖాన్


మూలం : చెర్విరాల బాగయ్య


పత్రికలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నకాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా ప్రచురణ చేయడానికి సాహసించని పరిస్థితులు. అయినప్పటికీ తన 'ఇమ్రోజు’ పత్రికద్వారా నిజాం ప్రభుత్వ విధానాలను, రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టిన కలం యోధుడు. సత్యప్రకటన తన జీవితానికి చరమగీతం పాడుతుందని తెలిసినా వెనుకంజవేయని ధీశాలి. నిజాన్ని నిర్భయంగా రాసి రజాకార్ల చేతిలో బలైన అమరుడు షోయబుల్లాఖాన్ జీవితాధ్యాయాన్నిచదువుదాం.


వీరజనని శ్రీ భారతమాతను మహామహుండగు మహాత్మగాంధిని జనవందితుడగు జవహర్లును పూజనీయుడగు బోసుబాబును వందనీయుడగు వల్లభ్ భాయిని పరిపరి విధముల భారత వీరుల ప్రస్తుతింతు నా భావము లోపలనూ తందాన తాన ఆస్తికత్వమున ఆనందముతోనూ తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన 


హాస్యం : అరే భాయి యేదైనా కథ మొదలు పెట్టేటప్పుడు మూలపురుషులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనో లేక విఘ్నేశ్వరున్నో గ్రామదేవతనో తలంచుటొప్పుగాని భారతమాత నట, మహాత్మాగాంధీయట, జహ్వారులాలట C ఈ క్రొత్తక్రొత్త దేవతలెవరో కాని నేనవి విని యెరుంగలేదు.


కథ : ఓహో! నీవింకా నిద్రలో నుండి కలలుగంటున్నావన్నమాట. పైన పేర్కొన్న వారలు మన భారతదేశపు దాస్యశృంఖలముల విడదీయుటకై అనేక కష్టనష్టముల కోర్చి కారాగారాల కేగి ప్రాణముల బలినొసంగి స్వాతంత్ర్యము గలుగ జేసిన సత్పురుషులు. వీరిని గాక ఇంకెవరిని స్తుతించగలము.


హాస్యం : అటులైన సరే కాని నీవిపుడు చెప్పదలచుకున్న కథేమిటో చెప్పరాదా.


కథ


ది


చెప్పెద వినుము. రామరావణుల యుద్ధము గాదోయి తందాన తాన కౌరవ పాండవ కథయిది గాదోయి తందాన తాన పూర్వ రాజుల చరిత్ర యిది గాదూ తందాన తాన తందాన తందాన తందాన తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన


హాస్యం : సరే! నీవు జెప్పునది బాగానే యున్నది. ఆ కథ గాదు ఈ కథ గాదు. ఏ కథ గాకపోతే నీవు జెప్పదలచుకున్న కథేమిటో చెప్పెదవా? ఊరక కాలయాపన జేసెదవా?


కథ : వినుము. నేనిపుడు చెప్పబోయే కథ మహాత్మాగాంధికి అత్యంత ప్రియభక్తుడును, దేశ సేవా దురంధరుడును, నిష్పక్షపాత హృదయుండును అగు షోయబుల్లాఖాన్న దుర్మార్గులు ఏ విధంగా హత్యగావించి యుండిరో ఈ ప్రజానీకమునకు కథారూపకముగా దెలియజేయువాడను.


హాస్యం

అబ్బా యెంతమాట నుడివితివిరా. ఆ మాట వినిన తోడనే నావంటిలో నుండు రక్తమెల్లను నీరయ్యెను. నోట దడియారెను. గుండెలవిసిపోయెను. సరే కానిమ్ము.


కథ : వినుము భారతావనిలో భాగ్యనగరమందూ తందాన తాన మానుకోట తాలూక యందున తందాన తాన శుభ్రవాడు యనె చిన్న గ్రామమందూ తందాన తాన

మహమ్మదీయుడు హబీబుల్లా ఖాను తందాన తాన పతివ్రతయగు తన భార్యతోన గూడి తందాన తాన ఏడుగురి బిడ్డల గన్నవాడయ్య తందాన తాన అయినను ఒక్క బిడ్డ బ్రతుక లేదు తందాన తాన పూర్వఫలంబుని బొగులు చుండిరయ్యా తందాన తాన అంతలోనే భగవంతుని దయ వల్లా తందాన తాన హబీబుల్లాఖానుని యిల్లాలు తందాన తాన మరల చూలు దాల్చెనూ తందాన తాన తందాన తందాన తందాన తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన


ఇట్లుండగా సుమారు 29 సం॥ల క్రితము ఒకనాడు విశ్వవంద్య బాపూజీ విజయవాడకు వెళ్లుచున్నాడు. దారిలో అనగా మానుకోట స్టేషన్లో హబీబుల్లాఖాన్ గారు పోలీస్ ఇనస్పెక్టరుగా ఉన్నారు. బాపూజీని తదేక దృష్టితో చూశారు. వెంటనే హబీబుల్లాఖాన్ అత్యంత భక్తితో వారికి నమస్కరించాడు. అంత బాపూజీ దివ్యమంగళ విగ్రహము తన కన్నులలో నిండిపోయినది. అటు పిమ్మట ఇంటికి చేరిన హబీబుల్లా ఖానుకు పుత్రోదయము కల్గిందనే వార్త విని పరుగున వెళ్లి తన పుత్రుడిని చూసి సంతోషించాడు. పుట్టినవాడు అంతా గాంధీలాగానే ఉన్నాడనుకొన్నాడు. ఇట్లు బాలషోయబుల్లాఖానుడు శుక్లపక్షచంద్రునివోలె దినదినాభివృద్ధి జెందుచు తన వచ్చిరాని మాటలతో వృద్ధ జననీజనకులతో ముద్దుగొల్పుచు 


తందాన తందాన తందాన తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన షోయబుల్లాభాను డమ్మయ్యా తందాన తాన వివేకమతనిలో మొలుక లెత్తెనయ్యా తందాన తాన దేశసేవయే దేవుని సేవంచూ తందాన తాన తన మదిలోపల దలచు చుండెనయ్యా తందాన తాన విశ్వమానవ భ్రాతృత్వంబయ్యా తందాన తాన ఎంత దాచిన దాగకుండెనయ్యా తందాన తాన మబ్బుల్లోని చంద్రుని రీతిగనూ తందాన తాన ప్రకాశ మానంబగుచుండేనయ్యా తందాన తాన తందాన తందాన తందాన తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన అంత కొన్నాళ్లకు ఔజా అనే ఆమెతో వివాహము జరిగెను. భళానోయి భాయి తమ్ముడా సై దేశబలానోయి దాదానా బాపూజీకి పరమభక్తుడు. భారతవీరుల పరమానుచరుడు

సత్య అహింసల ప్రచారకుడు. లోభత్వమునకు లొంగని వాడు ప్రజాక్షేమమే గోరెడు వాడు షోయబుల్లా ఖానుడమ్మయ్యా భళానోయి భాయి తమ్ముడా సై దేశ బలానోయి దాదానా.


ఇట్లుండ హైద్రాబాదు ప్రభుత్వము మత ప్రేరణ జేయుచు రజాకార్లనెడు దుష్టశక్తుల బోషించుచు, మొత్తము రాష్ట్రమంతటా. లూటీలు, గృహదహనాలు, హత్యలు, మానభంగములు మున్నగు బీభత్సములు బాహాటముగా యా రజాకార్లు జేయుచుండిరి. అప్పట్లో మన షోయబుల్లాఖానుడు తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా ఆ రజాకార్లు వారి నాయకుడగు ఖాసింరజ్వీ క్రూర కృత్యములను ఖండించుచు వచ్చెను. షోయబుల్లాఖానుడు తమ జాతి వాడయ్యి కూడా తమకు విరుద్ధంగా నడచుకొనుట ఖాసింరజ్వీక్లేగాక హైద్రాబాదులోనుండు సమస్త మహమ్మదీయుల కిష్టము లేకుండెను. అందువల్ల ఆ పత్రిక తే.21 అజూర్సన్ 1357 ఫసలీ రోజున ఆపివేయబడెను. అటు పిమ్మట షోయబుల్లాఖానుకు జాతీయ ఉరుడు పత్రిక లేకపోయెనని మనోవేదన గలిగి ఆ కొరత దీర్చుటకై దైనెల సన్ 1357 ఫసలీనాడు "ఇమ్రోజ్" అను దినపత్రికను ప్రారంభించెను. మన షోయబుల్లాఖాను జాతీయవాది, గాంధీగారి సిద్దాంతములనే ఆచరించువాడు, మహాధైర్యశాలి. ధైర్యముతో పత్రిక ద్వార జాతీయ భావముల వెల్లడించుచు, చక్కని విమర్శలు జేయుచు నిజమైన వార్తలను ప్రకటించుచుండెను.


భళానోయి భాయి తమ్ముడా సై దేశ బలానోయి దాదానా

మింగడానికి

షోయబుల్లాఖానునిపై నీ ప్రభుత్వమీర్ష్య భావంబు చేత కాగితమిచ్చుట బందు జేసిరీ వెంటనే యప్పుడు సెన్సార్ పెట్టిరి అనేక చిక్కులు గలుగ జేసిరి అయినను యించుక భయపడలేదు. తన యత్నంబు తప్పనె లేదు. న్యాయమె నన్నిటి జయమొసంగునని అనుకొని యుండెను షోయబుల్లాఖాన్ భళానోయి భాయి తమ్ముడాసై దేశ బలానోయి దాదానా


ఇట్లుండగా మహాత్ముడి అకాలమరణవార్త అకస్మాత్తుగా షోయబు విన్నాడు. నిర్ఘాంతపడ్డాడు. ఇంట తనగదిలో వెక్కివెక్కి యేడుస్తున్నాడు. బలమైన అతని శరీరం దుఃఖావేశంతో వణికి పోవుచున్నది. నోరు పెకలటం లేదతనికి. ఇంతలో తన తల్లి వచ్చి నాయన ఏడవకుము. ఆయన మహాత్ముడు అతనికి అంతా సమానమే. చావుబ్రతుకుల్లో ఆయనకు భేదం లేదు. హిందూ, ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందించుటకై ఆయన మహోత్కృష్టమైన సేవ జేశాడు. నీవు దుఃఖించుట మానుము. నాయనా? ఏది ఒకసారి నవ్వుము, అని దీనంగా బ్రతిమాలుతున్న తన తల్లినిజూసి షోయబుల్లాఖానుడు అమ్మా! రేపు నీకొడుకు స్వాతంత్ర్యము కొరకు బలైతే నీవు దుఃఖించవా యని యడిగినాడు.


ఆ మాటలకు ఆ షోయబుల్లాఖానుని తల్లి, నాకొడుకే అంతటి భాగ్యవంతుడై ప్రజాసేవలో ప్రాణాలు విడిస్తే సత్యం ప్రచారంలో అమరుడైతే నిజంగా నేను నవ్వుతాను. తండ్రి యిది ముమ్మాటికి నిజము అని తల్లిజెప్పిన ధైర్యవచనాలకు సంతోషించినాడు. దుఃఖమును పోగొట్టుకున్నాడు. ఇట్లుండ నీతనిపై కొందరు వ్యతిరేకులకు మరింత విషము తలకెక్కుచునే యున్నది. పది నెలల నుండి తన సంపాదకీయ వ్యాసములు వారినే గాక ప్రభుత్వమును గూడ గడగడ వణికించినవి. నిజమే ఈలాంటి దేశభక్తులను జూచి ఖాసీంరజ్వీ ఊరుకోగలడా! 19-08-1948 రోజున జమ్రుతు మహలులో సభజేసి యేమన్నాడంటే


భళానోయి భాయి తమ్ముడా సై దేశబలానోయి దాదానా


హిందూగాని ముస్లింగాని


ప్రభుత్వానికి వ్యతిరేకంగా


ప్రచారమును గావించినచో


పట్టివాన్ని ప్రాణాల్ దీయుడీ


బర్చిలతో బొడచి వేయండీ


వారి చేతులు నరికి వేయండీ


నేనుండగ మీకేమి భయము


అని యిటు యటు వలెను ఖసీం రజ్వీ


రజాకారులనే రాక్షస మూకను


సమానం


పంపివేసెను మచ్చరంబుతో


భళానోయి భాయి తమ్ముడా సై దేశ బలానోయి దాదానా


షోయబుల్లాఖానుకు అదివరకే యీ నిశాచరులు తన ప్రవర్తనను మార్చుకొమ్మని జాబులు రాశారు. అట్లు మార్చుకొనకుండినచో ప్రాణములు దక్కవని యెన్నో తీర్ల బెదరించినారు. అయినప్పటికిని సత్యమునకు పాటుపడ్డ మన షోయబు యా బెదిరింపులకు జంకలేదు. తనను ఇంచుకైనను మార్చుకోలేదు. ఇట్లుండ 20-08-1948 నాడు ఒక పేరు వూరులేని ఉత్తరం ఒకటి వచ్చింది. అందులో "నీవు గాంధీ కొడుకువా" జాగ్రత్త డొక్క చీల్చి వేస్తాం. ఇదివరకీలాటివెన్నో ఉత్తరాలు రాలేదా! అనుకొన్నాడు. తన పత్రికాలయములో కాంగ్రెసు నాయకులు రామకృష్ణారావు, రంగారెడ్డి మొదలగు షోయబు మిత్రులు యా బెదరింపు ఉత్తరములను గూర్చి చర్చించారు. శ్రీయుత రామకృష్ణారావుగారు షోయబు నామాట నీవు తప్పుగా భావించవద్దు. ఎందుకంటే రాక్షస రజాకార్లు నీమీద కక్షపెంచుకున్నారు. ఎప్పుడైనా ఏమైనా జరుగవచ్చు. నీవు జాగ్రత్తగా ఉండుము అని చెప్పినప్పటికిన్ని షోయబ్ తన విశ్వాసమును వదలలేదు. మఱునాడు 21-08-1948 రోజున తన కార్యాలయములో రాత్రి 12.30 వరకు 22-08-1948 తారీకు పత్రికకై "నేటి భావాలు" అను శీర్షికతో నొక వ్యాసమును రాసి అక్కడినుండి బయలుదేరి గాఢాంధకారములో విజయాన్ని పొందిన సైనికునివలె సమీపములోనున్న తన యింటికి వస్తున్నాడు మన షోయబు. యింతలో


భళానోయి భాయి తమ్ముడా సై దేశ బలానోయి దాదానా


తందాన తందాన తందాన తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన తలుపు చప్పుడు జేయుచుండెను. అంతలోనే తన వెనక వైపున వెంబడిబడ్డ వేటకుక్కలు రజ్వీ బంట్లు రాక్షస మూకలు గుణహీనులును కొరవి దయ్యములు మర్మము దెలియని దుర్మార్గులును ప్రజల పాలిటి ఐలు పిశాచములు దోపిడి దొంగలు దుష్టశక్తులు


భళానోయి భాయి తమ్ముడా సై దేశ బలానోయి దాదానా


మన షోయబుల్లాఖాన్ న్ను తుపాకులతో ఢాం ఢాం ఢాం అని కాల్చినారు. అతడు నేల కూలినాడు. ఆ కిరాతకుల కసి అంతతో దీరలేదు. ఏ చల్లని చేయి తన జనుల నోదార్చి సత్య అహింస, ధీర, సోదరత్వ ప్రచారాన్ని చేసిందో, ఏ వీరహస్తం శత్రువులను, నిజాం అరాచకత్వాన్ని, దౌర్జన్యాలని నిర్భయంగా విమర్శించిందో. యే కరకమలము 'ఇమ్రోజ్' పత్రికా కన్యను తీర్చిదిద్ది అలంకరించి సాహిత్య మాతృవొడిని సంతృప్తి పరచిందో అట్టి షోయబు కుడి చేయిని దుండగులు నరికివేసినారు. షోయబు బావమర్ది వెనుకాల నుండి వస్తూ అరిచాడు. ఆయనకు కూడా గుండు దెబ్బ తగిలింది. పడిపోయాడు. రెండు చేతులు మణికట్టు వరకు తీశారు. మిక్కుటముగా అరచుటచే ప్రక్కవారు పరుగెత్తుకొని వచ్చారు. గుండాలు పరుగెత్తినారు. తలుపు తెరుచుకొని షోయబు భార్య, తల్లిదండ్రి ఒక్కుమ్మడి పైనబడ్డారు. కౌగిలించుకొన్నారు.


తందాన తందాన తందాన తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన చుట్టు ప్రక్కల వారు వచ్చినారు తందాన తాన మిత్రులందరు చేరుకున్నారయ్య తందాన తాన షోయబు ఖానుడీ శరీరమందుండే రక్తధారలు గారుచున్నవయ్యా స్పృహ దప్ప లేదింకను షోయబు తనవారిని కన్నుల జూశాడు తందాన తందాన తందాన తందాన తాన తందాన భాయి రాజవందనా తందాన తాన


వద్దు


వీరపత్ని భర్తపై బడి నీవెందుకు అరచలేదు. ఆ దుష్టశక్తులను వెన్నంటి తుపాకితో కాల్చి అయ్యో ఎంతటి ప్రమాదం సంభవించినది. అవుజా నేను బిగ్గరగా అరచిన యెడల పిరికితనమవుతుంది. వీరుడై చచ్చిన వాడికే స్వర్గం. ఇదే నిజమైన అహింసా సిద్ధాంతం. తల్లిని జూచి అమ్మా! నేనెలాగైన యీ లోకాన్ని విడిచిపోతాను. నీవు వీరమాత వనిపించుకొమ్ము. అవుజా నీవు నిండు చూలాలివి. నీవు నా ధర్మపత్నివని కీర్తినిలుపవా? నీవు వీరమాత వౌతావు. మీరు యిట్లా ఏడిస్తే నా ధైర్యం సన్నగిల్లుతోంది. ఆనాడు మన బాపు మనను విడచిపోయిన నాడు నన్ను ఏమని ఓదార్చినావమ్మా! అబ్బా!!


భళానోయి భాయి తమ్ముడా సై దేశబలానోయి దాదానా


ఇవియే షోయీబు ఆఖరిమాటలు హాయిగ నంతలో నిద్రించినాడు అతని యాత్మ మహాత్మలో గలిసే అమరజీవియై యలరారె నయ్య భళానోయి భాయి తమ్ముడా సై దేశబలానోయి దాదానా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana