స్వామి వివేకానంద
5. స్వామి వివేకానంద
భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందనీ, అన్ని మతాలు సత్యాలేననీ, అవన్నీభగవంతుని చేరుకోడానికి మార్గాలనీ స్వామీజీ చెప్పాడు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరంలేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పవంటివారనీ స్వామీజీ తెలిపాడు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫునా మాట్లాడి నిజమైన మతసామరస్యాన్ని చూపించాడు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది.
బాల నరేన్
ఒక బాలుడు కలకత్తానగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినబడింది. ఏమయ్యుటుందబ్బా! ... ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతున్నది. ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెట్టివేగంతో లాక్కెళుతూంది. దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది. దాని నుండి దూరంగా వెళ్ళడానికేమో అన్నట్లు పరుగెడుతున్నది. బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా కూర్చుని ఉండడానికి ప్రయత్నిస్తున్నది. బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. ఎవరూ ఆవిడకి సహాయం చేయడానికి
ముందుకు రావడంలేదు. ఇదంతా ఈ బాలుడు చూశాడు. సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి, పరుగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. జోరుగా పరుగెడుతున్న ఆ గుర్రపు కళ్ళెం చేజిక్కించుకొని, నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరచి ఆగిపోయేటట్లు చేశాడు. ఆ మహిళ ప్రాణం నిలిచింది. అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు.
ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది.
ఎవరీ పిల్లవాడు? అతడి పేరు నరేంద్రనాథ్ అందరూ నరేన్ అని పిలిచేవారు. అతడే తరువాత కాలంలో విశ్వవిఖ్యాతినొంది సింహసదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానందస్వామి. ఈయన జన్మదినమైన జనవరి 12వ తేదీనే మన దేశ ప్రజలంతా 'జాతీయ యువజన దినోత్సవం'గా జరుపుకుంటారు. సరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్తా. మంచి పేరున్న వకీలు. ఎంతో చదువుకున్నవాడు. అందరి గౌరవాన్నీ పొందేవాడు. తల్లి భువనేశ్వరీదేవి. రూపంలోను, ప్రవర్తనలోను ఒక రాణివలె ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు. గౌరవించేవారు.
మన నరేన్ అల్లరి పిల్లవాడు ఈ గడుసరిని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది. అతడిని చూసుకోవడానికి ఇద్దరు నౌకర్లను పెట్టవలసి వచ్చింది. కానీ ఎట్లాగో ఒక ఉపాయం కనుకున్నది. నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినపుడు శివశివా' అంటూ నెత్తిమీద చల్లని నీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. లేదా "ఏయ్, ఇట్లా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు" అనగానే చల్లబడిపోయేవాడు. తన పథకాలేవీ పారనప్పుడు ఆ తల్లికి పాపం ఈ రెండే చివరి అస్త్రాలు.
బాలనరేంద్రుడు తన తల్లివద్ద ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. తల్లి భాగవత, రామాయణ మహాభారతాల్లోని కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్లు చెప్పేది. ముఖ్యంగా శ్రీరాముడి కథంటే నరేంద్రుడికి పంచప్రాణాలు, మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామాయణమంటే ఎంత ప్రేమో! హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపంచేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని, ఆ మహావీరుడిని చూడడానికై తరచూ చాలాకాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా! ఎంత విశ్వాసం! VN
పాఠశాలలో... ఆటల మైదానంలో
ఆరేళ్ల వయస్సులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్నిరోజులు పాఠశాలకు వెళ్లకుండా, తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడివద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు. చదువడం, వ్రాయడం చాలా త్వరగా నేర్చుకున్నాడు. అతడి జ్ఞాపకశక్తి అమోఘం! ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పటంతోనే నేర్చుకునేవాడు. మళ్ళా అప్పజెప్పగలిగేవాడు.
ఏడేళ్ళ వయస్సు వచ్చేటప్పటికి అతడిని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు. నరేంద్రుడి తెలివితేటలూ, చురుకుదనం, ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖం, అన్నిటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావంవల్ల అనతికాలంలోనే తోటిబాలురందరికీ నాయకుడయిపోయాడు. ఆటలంటే ప్రాణం. అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్సుని ఖాళీచేసేసి ఆటల మైదానంలోకి పరుగెత్తేవాడు. పరుగులు తీయడం, కుస్తీపట్టడం, బాక్సింగు, గోళీఆటలు, కప్పగంతులూ ఒకటేమిటి, ఉన్న ఆటలన్నీ ఆడేవాడు. కొత్తకొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. రోజుకో లాగు చినిగిపోయేది. రెండురోజులకొక కొత్త దెబ్బ తగిలేది. బాధ తల్లికేగానీ, బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చరపిడుగే.
ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడుండగానే ఇతర బాలురతో ముచ్చట్లు చెప్పడం, వారిని నవ్వించడం వంటివి. చేసేవాడు. ఒకరోజు నరేంద్రుడూ ఇతర స్నేహితులూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి వాళ్ళని ఉపాధ్యాయుడు అప్పటిపాఠం అప్పజెప్పమన్నాడు. ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవరూ ఆ పాఠం అప్పజెప్పలేకపోయారు. పాఠాన్ని ముందే చదివిన నరేన్ అన్ని ప్రశ్నలకీ సరైన సమాధానాలు చెప్పాడు. ఉపాధ్యాయుడు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగాడు. అందరూ నరేన్ వైపు వేలుచూపారు. అది నమ్మలేక, అంతా అబద్ధం చెప్పారని తలచి నరేన్ తప్ప అందరినీ బల్లలెక్కి నుంచోమన్నడు. వారితోపాటు నరేంద్రుడు కూడా నిలబడ్డాడు. ఆశ్చర్యంగా ఉపాధ్యాయుడు 'నువ్వెందుకు నిలబడ్డావని' అడిగితే "ఊఁ నేనే నిలబడాలి. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్నవాడిని నేను" అని సమాధానమిచ్చాడు.
యువ నరేన్
మన కథానాయకుడు పెద్దవాడవుతున్నకొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడడంపై మొగ్గుచూపించడం తగ్గించాడు. బడిలో బాగా చదువుతూ ఉండేవాడు, కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూర్కి బదిలీ అవడంవల్ల రెండేళ్ళు చదువు ఆగిపోయింది. మళ్ళీ తిరిగి బడిలో చేరేసరికి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలో పూర్తిచేయవలసి వచ్చింది. పరీక్షలు దగ్గరపడుతూ ఉంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు కష్టపడి, ఇష్టపడి చదివేవాడు. చివరికి పరీక్షలో మొదటిశ్రేణిలో ఉత్తీర్ణుడైండు. ఆ సంవత్సరంలో తన పాఠశాల నుండి ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి అతడే (ఆ రోజుల్లో అదే గొప్ప) తర్వాత ఒక సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీలో, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ కాలేజి అని పిలువబడే కళాశాలలో చేరాడు. ఈ కళాశాలలోని ఆచార్యులంతా యువనరేంద్రుడి ప్రతిభాపాటవాల్ని, ఆసక్తినీ, ధారణాశక్తినీ చూసి ఆశ్చర్యచకితు లయ్యారు. దాదాపు పాతికేళ్ళ తన అనుభవంలో ఈ దేశంలోకానీ, పరాయిదేశాల్లో కాని ఇంతటి ప్రతిభని తానెక్కడా చూడలేదని ప్రిన్సిపల్ డబ్ల్యు డబ్ల్యూ హేస్టీ అనేవాడు.
నరేంద్రుడు అన్నిరకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు. అతడు విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి. జ్ఞానసముపార్జనే అతడి లక్ష్యంకానీ, ఇతరులకన్నా ఎక్కువ చదివేయాలి అనే తపన అతనిలో ఉండేది. అందుకే అంత చదివినా అతనికి కష్టమనిపించేది కాదు. పైగా ఆ చదువు ఎంతో తృప్తినీ, ఆనందాన్ని ఇచ్చేది. 1884లో బి.ఏ. పట్టా కూడా పొందాడు. నలుగురితోను ఉన్నప్పుడు శాస్త్రచర్చలు జరపడంలో మక్కువ చూపేవాడు. ఒక్కోసారి పెద్దవారితోను తాత్త్విక చర్చలు చేసేవాడు. అతడి మేధాసంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవరూ నిలువగలిగేవారు కాదు.
శ్రీరామకృష్ణులను కలవడం
ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం. మతం బోధించే చాలా విషయాలలో అతడికి నమ్మకం పోయింది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియటం లేదు. ఎంతోమంది మతపెద్దలనేవాళ్ళ వద్దకి పోయినా ఏమీ ప్రయోజనం కలుగలేదు. చివరికి ఇద్దరు ముగ్గురు శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస అని అందరూ కీర్తించే శ్రీరామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నడు.
శ్రీరామకృష్ణులను కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోననే ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు. తన సంశయాన్ని ప్రశ్నరూపంలో "అయ్యా! తమరు భగవంతుడిని చూశారా?" అని సూటిగా అడిగాడు. వెంటనే అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా “ఓ చూసిన. నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కానీ నాయనా! భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు? భార్యా పిల్లలకోసం, ధన సంపాదనకోసం కడవలకొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడికోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనాసరే భగవంతుడికోసం తీవ్రవ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పకదర్శనమిస్తాడు. ఇది నిజం. నా అనుభవం" అని గుండెపై చేయివేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చాడు. నరేంద్రుడికి కొంతసేపు నోటమాటరాలేదు. “నేను భగవంతుడిని చూశాను" అని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుడిని మొదటిసారి చూశాడు.
గురుశిష్యులు
నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వద్దకి తరచూ వెళ్ళడం ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు ఆయన జీవితం పవిత్రతకి ప్రతిరూపమని గ్రహించాడు. ఆయన ఏమి ఆలోచించేవాడో అదే చెప్పేవాడనీ, ఏం చెప్పేవాడో అదే చేసేవాడని పరీక్షించి తెలుసుకున్నాడు. వీటన్నిటికీ మించి తనను తన తల్లిదండ్రులకంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శ్రీరామకృష్ణులని తెలుసుకొని ఆయన ప్రేమానురాగ శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు. అలా సమయం గడుస్తుంది. 1884వ సంవత్సరం మొదట్లో నరేంద్రుని తండ్రి మరణించాడు.
కాశీపూర్
తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది. మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణులవారి పాదపద్మాల చెంత మాత్రమే.
ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడొకడు. అప్పుడప్పుడూ కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులుచేయడానికి బయటకు వెళ్ళినా, ఎక్కువకాలం కాశీపూర్లోనే గురువుకి సపర్యలు చేస్తూ గడిపేవాడు. ఎప్పటిలాగే శిష్యుల్లో నరేంద్రుడే నాయకుడు.
శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాలకోసం సమాయత్తపరుస్తున్నాడు. ఆయన ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యతని నరేంద్రుడికి అప్పగించాడు.
దేశ పర్యటన
స్వామీజీ (నరేన్ / నరేంద్రుడు) బారానగర్ మఠంలో రెండేళ్ళు నివసించాడు. హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోని తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయల్దేరారు. స్వామీజీ ఇక ఉండలేక, 1888లో కాశీకి ప్రయాణమయ్యాడు.
కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూంటే దారిలో ఒక కోతులగుంపు కనిపించింది. అవి ఆయనవైపు తిరిగి పరుగెత్తిరాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్తనారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏంచేయాలి అని ఆలోచిస్తూ పరుగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి "ఆగు! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో" అని గట్టిగా అరిచాడు. స్వామీజీ ఆగి వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామీజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతికాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనీ, ఆ కోతుల్లాగ కష్టాలు మనల్ని వెన్నాడుతాయని, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటినెదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు.
1890లో మళ్ళీ యాత్రలకు బయల్దేరి ఎన్నో ఏళ్ళదాకా వెనక్కి రాలేదు. ఒక సోదర సన్యాసితో కాశీలోనూ హిమాలయ ప్రాంతాలలోను తిరిగాడు. ఈ పర్యటనలలో స్వామీజీకి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. చాలాసార్లు ఆయనకి ఎన్నో రోజులు తినడానికి ఏమీ ఉండేది కాదు. చాలా రాత్రులు ఆయనకి ఆకలీ బడలికలే స్నేహితులుగా ఉండేవి.
అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక మిఠాయికొట్టు యజమాని వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి, వెంట తెచ్చిన భోజనం పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ "ఎవరు నాయనా నీవు? నేను నిన్నెఱుగనే! పొరబడుతున్నట్లున్నవు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాను" అని అంటూ ఉంటే, ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్నపీటవేసి భోజనం ఒక ఆకు మీదికి మారుస్తూ "లేదు స్వామీ, నేను కలలో చూసింది మిమ్మల్నే శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రిస్తున్నవా? లే, లేచి అతడికి భోజనం పెట్టు' వెళ్ళమని ఆజ్ఞాపించాడండీ. ఆహా! ఏమి నా భాగ్యం! మీవల్లనే నాకు రామదర్శనం కలిగింది. తండ్రీ బిడ్డలిరువురిదీ. ఏమి గాంభీర్యం! ఏమి సౌందర్యం! ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మరిచిపోలేరు. నేను పొరబడటంలేదు. స్వామీ. దయచేసి వేడి చల్లారకముందే ఆరగించండి. చల్లని నీళ్ళు కూడా తెచ్చాను" అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజలా నీరుకారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయన్ను కాపాడుతూ వస్తుందో, అదే అభయహస్తమిది. ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితమంటే భగవంతుడి ఒడిలో వసించడమని అర్థమైంది. అశ్రునయనాలతో లేచివచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. ఇలాంటి ఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి.
స్వామీజీ ఎన్నోసార్లు తనకోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవాడు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలనీ, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదనీ ఇలాంటి కఠిన నియమాలెన్నో పాటించేవాడు. స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత; 'ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్' అనే గ్రంథాలు తప్ప ఇంకేవీ ఉండేవి కావు.
ఇట్లా పర్యటిస్తూనే తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకొన్నాడు. మూడు సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయం సందర్శించాక సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తూన్న ఒక పెద్ద శిలని చూశాడు స్వామీజీ. ఆ శిలదాకా పడవలో వెళ్ళడానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు. ఎవరు నా మాతృభూమిని అంధకారంనుంచి మేల్కొలుపుతారు? ఈ దేశ ప్రజల అలసత్వాన్నీ అజ్ఞానాన్నీ పటాపంచలుచేసి మళ్ళీ దానికి తన పూర్వవైభవాన్ని తీసుకురావడం ఎట్లా? ఇన్ని ప్రశ్నలు, ఇంత ఆవేదనా మనస్సులో ఉవ్వెత్తునలేచి చేసే అల్లకల్లోలం ముందు, ఎదుటఉన్న మూడుసముద్రాల అలలజోరు లెక్కలోకి రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నాడు.
అమెరికా
అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతున్నదని అంతకుముందు ఎక్కడో విన్నాడు స్వామీజీ. ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయడానికి నిశ్చయించుకున్నాడు.
స్వామీజీ మద్రాసుకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రణాళిక విని సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఖేత్రీ మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని, కెనడాకు వెళ్ళే ఒక ఓడలో ప్రథమశ్రేణి టిక్కెట్టుకొని ఇచ్చాడు. ఆయన స్వామీజీకి మంచి కాషాయవస్త్రాలు బహూకరించి 'వివేకానంద' అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. స్వామీజీ ఈ విధంగా వివేకానందస్వామి అయ్యాడు.
వివేకానందస్వామి బొంబాయి నుండి 1893 మే 31వ తారీఖున అమెరికాకు బయలుదేరాడు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంగ్ కాంగ్, చైనా, జపాన్లలోని రేవులలో ఆగింది. స్వామీజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవాడు. కొన్నాళ్ళకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్ళాడు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది. స్వామీజీ ప్రతిభాపాండిత్యాలనీ, పవిత్రతనీ గమనించి 'స్వామీ మీరెపుడైనా బోస్టన్ నగరానికి వస్తే, దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింపజేయండి' అని తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నాడు. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడి భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయాడు.
కొన్నిరోజుల తర్వాత స్వామీజీకి కొన్ని విషయాలు తెలిశాయి. ఏ విశ్వమత మహాసభలకై ఆయన వచ్చాడో అవి సెప్టెంబర్ మాసం మధ్యలోగాని మొదలుకావు అనీ, అంతేగాక తనవద్ద కావలసిన ధ్రువపత్రాలేవీ లేనందువల్ల ఆయన వాటిలో వక్తగా పాల్గొనడం కుదరదనీ, పత్రాలు ఒకవేళ ఉన్నా వక్తలనంగీకరించే సమయం మించిపోయిందనీ తెలుసుకున్నాడు. ఇంకొక సమస్యేమిటంటే షికాగో ధనవంతుల నగరం. అక్కడి ధరలకూ తనదగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుకూ పొంతనే లేదని, ఇంకొన్నాళ్ళలో డబ్బులన్నీ ఖర్చయిపోయి పస్తులుండవలసిందేననీ అర్థమైంది.
బోస్టన్ వంటి చోటైతే తక్కువ ఖర్చుతో జీవించవచ్చని ఎవరో చెప్పగా, సాన్బోర్న్ ఆహ్వానం కూడా గుర్తుకు వచ్చి ఆ పట్టణానికి ప్రయాణమయ్యాడు. ఆవిడ ఇంట్లో ఉండగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరయిన జె.హెచ్.రైట్ అనే వ్యక్తితో పరిచయమైంది స్వామీజీకి, శాస్త్రీయమైన, తాత్త్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు వాళ్ళు. ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వమత మహాసభల్లో హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఆయనను కోరాడు. స్వామీజీ తాను వచ్చింది అందుకనేననీ, కానీ తన వెంట ఏ ధ్రువపత్రాలూ లేవనీ, అందువల్ల సభల్లో పాల్గొనడం కుదరదని విన్నాననీ తెలిపాడు. అది విని విస్తుబోయిన ఆ అమెరికా పండితుడు "స్వామీ! మిమ్మల్ని ధ్రువపత్రాలడగడమంటే, సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే" అని జవాబిచ్చాడు.
అంతేకాక, షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ధ్రువపత్రం వ్రాస్తూ ప్రొఫెసర్గారు "ఈ వ్యక్తి మేదస్సూ, పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్నీ కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది" అని పరిచయం చేశాడు. షికాగో వరకు ఒక టిక్కెటు కూడా కొని ఇచ్చిండు ప్రొఫెసర్గారు. దైవసంకల్పం ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించాడు.
షికాగో చేరి చూసుకునేసరికి ఆ కమిటీ చిరునామా ఎక్కడనో పడిపోయిందని అర్థమైంది స్వామీజీకి. అంత మహానగరంలో ఇప్పుడెక్కడికి పోవాలి? అప్పటికే చాలా అలసటగా ఉండి, మరోచోటు దొరక్క కనిపించిన ఒక పెద్ద ఖాళీ డబ్బాలో రాత్రి గడిపాడు. పొద్దునే లేచి ఒక వీధిలో నడుస్తూ తన సన్న్యాస సంప్రదాయం ప్రకారం ఆహారంకోసం యాచించాడు. అక్కడి ఇళ్లు చాలా పెద్దవి, ధనవంతులవి. కానీ అందరూ ఆయన్ని ఛీకొట్టారు. పనివారు కూడా అవమానించారు. పాశ్చాత్యంలో భిక్షాటన చేయడం గర్హనీయం కదా. ఇక ఏం చేయాలె? భగవంతుడే కనుక నన్నిక్కడికి తీసుకువస్తే ఆయనే నాకేదో దారి చూపిస్తాడులే అనుకొని ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడే ఒక ఇంటి తలుపు తెరుచుకొని, ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకు వచ్చింది. "మీరు విశ్వమత మహాసభలకి వచ్చినవారా? చూస్తే భారతీయ సన్న్యాసిలా ఉన్నారు!" అని అడిగింది. స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకుంది ఆ తల్లి. ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ, హేల్. తర్వాత ఆ కుటుంబమంతా స్వామీజీకి జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారు.
1893వ సంవత్సరం, సెప్టెంబర్ 11వ తేదీ సోమవారంనాడు విశ్వమత మహాసభలు మొదలయ్యాయి. కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి.
స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కలిగింది. అందరూ పుటలకొద్దీ వ్రాసుకుని చదివేస్తున్నారు. మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకనే వచ్చాడు. సభాధ్యక్షుడు రెండుమూడుసార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు తర్వాత అని తోసిపుచ్చాడు. సాయంత్రం ఇక అడక్కుండానే స్వామివారి పేరుని పిలిచేసరికి లేచి, సరస్వతీదేవిని తలచుకొని, శ్రావ్యమైన ఆయన కంఠంతోను, అంతకంటే మధురమూ, పరమపవిత్రమూ అయిన ఆయన హృదయాంతరాళాలలో నుంచి వచ్చిన విశ్వమానవ సౌభ్రాత్ర భావనతోను “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా...." అని మొదలుపెట్టాడు. దాంతో ఆ జనసముద్రమంతా ఒక్కసారిగా లేచి నిలబడి కమ్మని ఆ పిలుపునకు, తమముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకూ, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్న్యాస స్ఫూర్తికీ తమకు తెలియకనే పులకించిపోయి కరతాళధ్వనుల వర్షం కురిపించింది. ఉపన్యాసపు ఆరంభంలోనే అందిన ఆ అపూర్వ అభినందన మూడు నిమిషాలపాటు సాగింది. మధ్యలో స్వామివారు మళ్ళీ మాట్లాడడానికి చేసిన రెండు మూడు ప్రయత్నాలు విఫలమే అయ్యాయి.
అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించిండు. భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందనీ, అన్నీ మతాలు సత్యాలేనని, మతాలన్నీ భగవంతుని చేరుకోడానికి మార్గాలని స్వామీజీ చెప్పాడు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరంలేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పలవంటి వారనీ స్వామీజీ తెలిపాడు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫునా మాట్లాడి నిజమైన మతసామరస్యాన్ని చూపించాడు. సభ్యులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. పత్రికలన్నీ స్వామీజీని వేనోళ్ళ పొగిడాయి.
భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టడం
కొన్నాళ్ళ తరువాత స్వామీజీ భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు.
వచ్చేముందు ఒక ఆంగ్లేయమిత్రుడు స్వామీజీని ఇలా అడిగిండు "స్వామీ! నాలుగేళ్ళు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంలో గడిపి పేదరికంతో ఉన్న భారతదేశానికి వెళ్తున్నరు ఏమనిపిస్తుంది?"
స్వామీజీ ఇట్లా సమాధానమిచ్చాడు. "నేనిక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని. ఇప్పుడు నా దేశపు గాలి, నీరు, ధూళి కూడా నాకు పవిత్రమూ, పూజనీయమూ అయ్యాయి. నా మాతృదేశం ఇప్పుడొక మహాతీర్థస్థానం."
స్వామీజీ తిరిగిరావడం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావడమే అయింది. అప్పటికే వివేకానందస్వామి అంటే తెలియనివారు భారతదేశంలో ఎవరూ లేరు.
1897 జనవరి 15వ తారీఖున ఓడ అప్పటి బ్రిటీషు ఇండియాలోని కొలంబో చేరింది. మళ్ళీ తన పవిత్ర భారతభూమిపై కాలుపెట్టగలుగుతున్నారని స్వామీజీ మనస్సు ఆనందంతో పొంగిపోయింది. స్వామీజీకి స్వాగతం పలకడానికి భారతదేశ ప్రజలు చేసిన స్వాగత సన్నాహాల గురించి వారికి తెలియదు. ఆయన్ని స్వాగతించడానికి అన్ని నగరాల్లోను స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి. వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు రాశాయి.
తర్వాత స్వామీజీ స్టీమర్లో భారతదేశపు ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో దిగబోయాడు. రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురువెళ్ళి, ఆయన ముందు మోకాళ్ళపై కూర్చుని మొదట తన తలపై కాలుమోపి తరువాత భారతభూమిపై దిగమని శిరస్సువంచి ప్రార్థించాడు. స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించాడు. స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారంచేసి స్వయంగా తన రథంలో కూర్చుండబెట్టాడు.
శరీరాన్ని త్యజించడం
వివేకానందస్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది.
స్వామీజీ ఎక్కువకాలం జీవించదలుచుకోలేదు. ఎన్నోసార్లు తన శిష్యులకీ, స్నేహితులకీ తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్లు పరోక్షంగా చెప్పాడు. కానీ ఎవరూ ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు. "నేను నలభై చూడను అని" జోసెఫిన్ మక్లౌడ్ అనే స్నేహితురాలితో స్వామీజీ స్పష్టంగా చెప్పాడు. తన అంతిమ దినానికి వారంరోజులముందు ఒక శిష్యుడిని పిలిపించుకుని, పంచాంగం చదవమన్నాడు.
అది 1902, జులై 4వ రోజు. ఆ రోజు స్వామి పొద్దున శ్రీరామకృష్ణుల మందిరానికి వెళ్ళి తన అలవాటుకి భిన్నంగా అన్ని కిటికీలు తలుపులూ మూసుకుని మూడుగంటల సేపు గాఢ ధ్యానంలో గడిపాడు. తర్వాత దినచర్యకు భిన్నంగా సన్న్యాసులందరితో కలిసి భోజనం చేశాడు.
సంధ్యాసమయం. శ్రీరామకృష్ణులకి ఆ రాత్రికి సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది. స్వామీజీ తన గదికి వెళ్ళి గంగకు అభిముఖంగా కూర్చుని ధ్యానముద్ర ధరించాడు. ఒక గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నాడు. రెండుసార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చాడు. పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు. స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదలివేశాడు.
స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశాడు. ఆయన భౌతిక జీవితం ముగిసింది. కాని ఆయన పని కొనసాగుతూనే ఉంది. "లేవండి! మేల్కొనండి! గమ్యం చేరేవరకు విశ్రమించకండి!" అని తన దేశ ప్రజలకి పిలుపునిచ్చాడు.. వారంతా ఆ పిలుపు విన్నారు. భరతమాత మేల్కాంచింది. ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం, దేశానికి స్వాతంత్య్రం రావడంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి