ఆచార్య కొత్తపల్లి జయశంకర్
4. ఆచార్య కొత్తపల్లి జయశంకర్
తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారూ అలుగు దుంకి పారూ పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్ఞాన్న కంకులల్ల పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్ల మీ ఆశయాల వ్రాలూ కనిపించే ఆనవాలూ... కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్దుడు తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు NA
తెలంగాణను స్వప్నించి, శ్వాసించిన మహోపాధ్యాయుడు జయశంకర్, వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు 1934 ఆగస్ట్ 6న జన్మించాడు. ఉర్దూమీడియం పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉన్న రోజులలో హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హన్మకొండ న్యూహైస్కూల్లో మాధ్యమిక వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎస్.సీ వరకు చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ. పూర్తి చేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయం, అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుండి పి.జి. పూర్తిచేశాడు. సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలో, దాన్ని ఏ విధంగా ఉద్యమంగా తీర్చిదిద్దాలో నిరూపించే సంఘటన ఒకటి ఈయన విద్యాభ్యాస కాలంలో జరిగింది.
అప్పట్లో వరంగల్ డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటె హైదరాబాద్కు వెళ్ళాలి. లెక్చరర్స్ ప్రోద్బలంతో డిగ్రీ కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమించారు. అందులో మొదటి వరుసలో జయశంకర్ ఉన్నాడు. ఊరేగింపులో జయశంకర్ నినాదాలిస్తున్నాడు. 'వరంగల్కు డిగ్రీ కాలేజీ కావాలి'. అనాల్సిందిబోయి యూనివర్సిటీ కావాలని నినాదం ఇచ్చాడు. అందరూ నవ్వారు. జయశంకర్ను బాగా ఇష్టపడే ఒక లెక్చరర్ "ఏ పొట్టా పాగల్ హోగయా క్యా?" అని అన్నాడు. ఈ సంఘటన తరువాత పదేండ్లకు డిగ్రీ కాలేజి, ముప్పయి ఏండ్లకు యూనివర్సిటీ వచ్చింది. ఆ పిచ్చి పిల్లగాడే తరువాత యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు.
1960లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టడం ద్వారా ఉద్యోగ జీవితం మొదలైంది. హన్మకొండలో ఉపాధ్యాయుడిగా నియామకమై, లెక్చరర్ గా ఆదిలాబాద్కు పోయాడు. 1975-79 వరకు సీకెఎం కళాశాల ప్రిన్సిపాల్గా, బోర్డుమెంబరుగా సేవలందించాడు. 1982-91 వరకు సీఫెల్ రిజిస్ట్రార్గా పనిచేశాడు. 1991-94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా పనిచేశాడు. ఇవే కాక వివిధ ప్రభుత్వ హోదాల్లో, సంఘాల పదవుల్లో పనిచేసి తనదైన ముద్రవేశాడు. ఇన్ని పదవుల్లో పనిచేసినా “నాకు వైస్ చాన్సలర్ చేసిన తృప్తి కంటె సీ. కె.ఎం. కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేయడం ఎక్కువ తృప్తినిచ్చింది" అని స్వయంగా అన్నాడు. హన్మకొండలో టీచర్గా మొదలైన ఉద్యోగ ప్రస్థానం, అదే ఊళ్ళో వైసాఛాన్సలర్గా పదవీ విరమణతో ముగిసింది. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూనే అనేక పదవుల్లో పనిచేశాడు.
మూడు దశలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ కీలకపాత్ర పోషించాడు. 1952 వరకు జరిగిన ఉద్యమంతో పాటు 1969, ఆ తర్వాత 1996లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. 1952లో ఇంటర్మీడియట్ విద్యార్థిగా తెలంగాణకు జైకొట్టి తరగతులను బహిష్కరించాడు. వరంగల్లో మొదలైన ఉద్యమం హైదరాబాద్ల కేంద్రీకృతమైంది. నాన్ ముల్కీ గోబ్యాక్ నినాదంతో ముందుకుపోయింది. హైదరాబాద్ల జరిగే మీటింగ్కు తోటివాళ్ళతో కలిసి బెస్లో జయశంకర్ బయలుదేరాడు. బస్సు మధ్యలో ఫెయిల్ కావడం వల్ల హైదరాబాద్కు ఆలస్యంగా చేరుకున్నాడు. ఆనాటి మీటింగ్లో లో పోలీస్ కాల్పులు జరిగినాయి. "ఆనాడు సమయానికి నేను అక్కడికి చేరుకుంటే, కాల్పుల్లో పోయేవాణ్ణి. ఇంత వివక్ష, ఇన్ని యాతనల నుండి విముక్తి కలిగేది" అని తెలంగాణ గురించి మాట్లాడినపుడు అనేవాడు. ఫజల్ అలీ కమిషన్ను కలిసి హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విజ్ఞప్తి పత్రం ఇచ్చిన విద్యార్థి బృందంలో ఉన్నాడు. "మంచిగ బతుక లేకుంటే, బిచ్చమెత్తుకోనైనా బతుకుతం. కాని ఆంధ్రావాలతో కలిసి ఉండం" అని ఫజల్అలీతో ఖరాఖండిగా చెప్పిన కార్యవాది. 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంలోనే కరుణశ్రీ తెలంగాణ అంతా తౌరక్యాంధ్రం అని అంటే జయశంకర్ స్వయంగా కరుణశ్రీని కలిసి, ఆయన కవిత్వంలో ఉన్న ఉర్దూ పదాల్ని చూపించి, జాషువా, శ్రీశ్రీ వంటి వారి కవిత్వాల్లో కూడ ఉర్దూ పదాలు ఉన్నాయని చూపాడు. ప్రతిరోజు మాట్లాడే మాటల్లో ఎన్ని ఉర్దూ పదాలు ఉన్నాయో చెప్పాడు.
1996లో నాటి ప్రధాని 15 ఆగస్టు నాడు ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణా వాదులందరిని తట్టిలేపింది. తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించాలో జయశంకర్కు తెలుసు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి మూడు దశలున్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. అది జరిగింది. రెండోది ఆందోళనా కార్యక్రమం. అది కొనసాగుతున్నది. ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ. అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. 'ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తిచేస్తుందని నేను నమ్ముతున్నాను'. అని అన్నాడు. ఈ మూడు దశల్లో కూడా జయశంకర్ పాత్ర మరువలేనిది. అందుకే అతడు తెలంగాణ సిద్ధాంతకర్త. మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి. అది ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకపోయిందో జయశంకర్ ఒక రోజు ఇట్లా చెప్పిండు. "ఎందుకమ్మా తెలంగాణ అంటే? 'ఏం సార్ తెలంగాణ వస్తె మా పొలాలకు నీళ్లొస్తయ్, మా పోరగానికి కొలువొస్తది' అనే భావన వారికి
కలిగిందని" చదువురాని ఆడవాళ్ళు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆయన చెప్పినట్లు రెండవది ఆందోళనా కార్యక్రమం. దీనికి సంబంధించి జయశంకర్ చిన్ననాటి సంఘటన ఒక్కటి చెప్పుకోవాలి. బడిలో చదువుతున్న రోజుల్లో బడి ప్రార్ధన అయిన తరువాత వరుస క్రమంలో తిరిగి వెళుతూ పిల్లలందరు ప్రిన్సిపాల్కు “సలాం" అని చెప్పివెళ్ళటం ఆచారం. అందుకు బదులు జయశంకర్ ఒకరోజు "వందేమాతరం" అన్నాడు. అందుకు ప్రిన్సిపాల్ దాని అర్ధం ఏమిటి? అని అడిగాడు. "తెలియదు" అని జయశంకర్ చెప్పాడు. ఆనాడు ఉర్దూ మాధ్యమం కావడం, "వందేమాతరం” అనడం శిక్షార్హమైన నేరం. ప్రిన్సిపాల్ ముస్లిమే అయినా శిక్షించకుండా, తండ్రిని పిలిపించి, విషయం వివరించి, మెత్తగా మందలించడంతో సమస్య పరిష్కారమైంది. కాకుంటే ఆనాడే జయశంకర్ బాలనేరస్థుని కింద జమై ఉండేవాడు. ఈ సంఘటన అతనిలోని ఆచరణకు, దానివల్ల కలిగే ఆందోళనకు చిత్రిక పడుతుంది. తెలంగాణలో జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాన్ని రెండింతలు చేసినవి. వీటి వెనుక జయశంకర్ వంటి మేధావులు, ఉద్యమ కార్యకర్తల దిశానిర్దేశం ఉంది. ఉద్యమాచరణలో ఉన్న యువకులకు తగిన సమాచారం, సత్యసమ్మతమైన వివరాలతో జ్ఞానాన్ని అందించాడు. తెలంగాణ కోణాన్ని, ఊహించని రీతిలో ప్రతి ఒక్క సమాచారాన్ని, పూర్తి వివరాలు విశ్లేషణలతో ముందుంచేవాడు. ఆ విధంగా ఆందోళనా కార్యక్రమాలకు తనదైన రీతిలో చేయూత నిచ్చాడు.
జయశంకర్ విద్యార్థి నాయకుడు, సంఘనాయకుడు, గొప్ప పరిపాలనాదక్షుడు. తెలంగాణను స్వప్నించి, అహర్నిశలు శ్రమించిన కార్యశూరుడు. తను చెప్పిన మూడవ దశ రాజకీయ ప్రక్రియ. నేరుగా ఎన్నడూ రాజకీయ ప్రక్రియలలో పాల్గొనకున్నా ఆదిశగా తన వంతు పాత్రను పోషించాడు. తెలంగాణ కోసం పలవరించిన తెలంగాణ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి తన సహకారం అందించాడు. చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి ఒక్కరి రాజకీయ పార్టీకి తన మేదోశ్రమను ధారవోశాడు. ఎందుకంటె తెలంగాణ భావన మరింత బలపడుతుందనే ఆశతో చేశాడు. ఆయన ఆశించినట్లే చివరగా రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ వచ్చింది. ఈ క్రమం అంతా ఆయన దార్శనికతను సూచిస్తుంది. తెలంగాణలో జరిగిన ప్రతి ప్రజాఉద్యమంలో పాల్గొన్నాడు. ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు, ఐక్యవేదికలు, ఇట్లా అన్ని కార్యక్రమాలు, ఒకటేమిటి సమస్తంలో ఆయన కనపడ్డాడు. శ్రీకృష్ణ కమిటీ వేయంగనే తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా నివేదిక తయారుచేశాడు. కమిటీ వాళ్ళ సందేహాలు తీర్చడానికి క్యాన్సర్ తో బాధపడుతూ కూడా ఢిల్లీకి పోయాడు. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు.
నీతి, నిజాయతి, నిరాడంబరత, నిబద్ధత, సమయపాలన ఇట్లాంటి లక్షణాలున్న మహా మనిషి, ఆయన సమయపాలన, నిబద్ధతల గురించి తెలిపే సంఘటనలు అనేకం. జయశంకర్ సీఫెల్ రిజిస్ట్రార్గా ఉన్న సందర్భంలో సాయంత్రం 5-30 నుండి రాత్రి 10-30 వరకు తన పరిశోధక విద్యార్థికి సమయం కేటాయించేవాడు. భోజనం సమయంలో విద్యార్ధిని కూర్చోబెట్టుకొని మెటీరియల్ చూసేవాడు. సార్కు దగ్గరి మిత్రుడొకరు ఒకరోజు సాయంత్రం 5 గంటలవరకు గడిపి, తృప్తి చెందక ఇంకా మాట్లాడడానికి ప్రయత్నించాడు. నా పిహెచ్. డి. స్టూడెంట్ వచ్చే సమయం అయిందని, మనం తరువాత కలుద్దామని ముగించాడు. ఈ పరిశోధక విద్యార్థే తరువాత కాలంలో ఖమ్మం పి.జి. కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశాడు. జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు, ఈ ప్రిన్సిపాల్ అతని దగ్గర కూర్చుని సమయం తెలియకుండా మాట్లాడుతుంటే, నీకు రైల్ టైం అవుతుంది, స్టేషన్కు పోవడం ఆలస్యం అవుతుంది కనుక నీవు వెళ్ళవచ్చు అన్నాడు. ఈ రెండు సంఘటనల్లో ఒకే వ్యక్తి కనబడుతున్నాడు. జయశంకర్ ఆ వ్యక్తికి కాక సమయానికి విలువ ఇచ్చి పాటించడం ఇక్కడ కనపడుతున్నది.
నీళ్ళు, నిధులు, భూమి, ఉద్యోగాలు, బొగ్గు, కరంటు ఇట్లా ఒకటేమిటి సమస్త విషయాలపై లెక్కలతో సహా జరిగిన అన్యాయాలను ప్రజాప్రతినిధుల వద్ద, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వద్ద చెప్పేవాడు. సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల కూడా ఆయన చక్కని చూపు పెట్టాడు. ఒకసారి అతను మాట్లాడుతూ "వావిలాల గోపాలకృష్ణయ్య, కాళోజీ నారాయణరావులు ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. ఇద్దరు 3 నెలల తేడాతో చనిపోయినారు. వావిలాల చనిపోయిన కొన్ని గంటలలోనే గుంటూరులో ఆయన స్మారక కేంద్రం కోసం 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కాళోజీ కన్నుమూస్తే ఎన్నిసార్లు డిమాండ్ చేసినా వరంగల్ లో ఆయన పేరున స్మారక కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇది ప్రాంతీయ వివక్షను ప్రతిబింబించటం లేదా?" అని ప్రశ్నించాడు. ఇట్లా ప్రతి ఒక్క రంగంలో ప్రజల్ని చైతన్యపరిచాడు. "తెలంగాణా రాష్ట్రం ఒక్కటే నా కల. నేను జీవితంలో కన్న ఒకేఒక్క కల అది. ఆ కల నెరవేరుతుందని నమ్ముతున్న. తెలంగాణ యువతరం, విద్యావంతుల మీద విశ్వాసంతో ఈ నమ్మకాన్ని స్థిరపరచుకున్న. ఇప్పుడు లక్షలాది మంది తెలంగాణ వాదాన్ని అనుసరిస్తున్నరు. అంతిమంగా విజయం సాధిస్తరు. అంతదాకా విశ్రమించరు." అని నమ్మకంగా పలికేవాడు. ఆ నమ్మకం నిజమయింది. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ సాకారమయింది. ఆయన గొప్ప మానవతావాది. తెలంగాణ ఏర్పాటైన తరువాత కూడా ఆంధ్ర ప్రజలు ఎవరైనా సరే ఇక్కడే ఉండవచ్చని జయశంకర్ ప్రతిపాదించాడు. అయితే ప్రజలను ఆధిపత్య దోపిడీ వర్గాలపట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నాడు. "పొట్టపోసుకోవడానికి వచ్చే వారిని తెలంగాణ ప్రజలు ఆదరించాల్సిందే. పొట్ట కొట్టే వాళ్ళ మీదే మన వ్యతిరేకత అంత" అన్న కాళోజీ సూత్రానికి తెలంగాణ కట్టుబడి ఉండాలన్నాడు.
జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ పెండ్లి చేసుకోలేదు. ఉద్యోగరీత్యా సంపాదించినదంతా ఉద్యమాల కోసం ఖర్చు బెట్టాడు. ఉమ్మడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. జీవిత కాలం ఎక్కువగా ఇట్లాగే ఖర్చు అయింది. ఉమ్మడి కుటుంబంలోని వాళ్ళందరు పెరిగి, ఎవరి సంసారాలు వాళ్ళకు అయినంక జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సహాయంగా ఉండటానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించాడు. అనాథ పిల్లతో పెండ్లి చేశాడు. వారికో పాప పుట్టింది. వాళ్ళతో కలిసి జీవితం చివరిదశలో గడిపాడు. తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లు అమ్మి, వరంగల్లో ఫ్లాట్ తీసుకున్నాడు. అదే అతని ఆస్తి, పెన్షన్తో కాలం గడిపాడు.
ఉదాత్తమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, ఉద్యమస్ఫూర్తి, చెదరని స్థితప్రజ్ఞత కలిస్తే జయశంకర్. ఆబాలగోపాలంతో 'జయశంకర్ సార్' అని పిలిపించుకున్న అధ్యాపకుడు. జయశంకర్ సార్ ఉద్యమ పితామహులుగా, తెలంగాణ జాతిపితగా పేరొందడానికి కారణం కార్యకర్తకు కావల్సిన కార్యదక్షతోపాటు, కేసీఆర్ వంటి నాయకులకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని అందివ్వడమే. అందు కోసం నిద్రాహారాలు మాని కృషిచేశాడు. సహనం, స్థిరచిత్తం, సిద్ధాంతం అనే మూడు అంశాలు ఆయనలో ముప్పిరిగొన్నాయి. వ్యక్తిగతంగా ఆయన క్రమశిక్షణ అలవరచుకోదగినది. ఆయన శనివారం భోజనం చేయడు. ఎందుకట్లా తినరు అని ఎవరైనా ఒత్తిడి చేస్తే చిరునవ్వుతో వారించేవాడు. అతను రెండు విషయాల్లో రాజీపడలేదు. ఒకటి శనివారం పస్తుండటం, రెండు "తెలంగాణ" అంశం మాట్లాడకుండా ఉండలేకపోవటం. తెలంగాణ విషయంలో వారి నిబద్ధత పసిపిల్లవాడికైనా తెలుసు. అట్లాంటి జయశంకర్ తెలంగాణ సాకారం కాకముందే క్యాన్సర్ బారినపడి 21 జూన్ 2011న లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎంతో మంది మనుషులు, జీవితంలో ఎన్నో తొవ్వల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అనుకూల, అనుకూలం కాని పరిస్థితులను బట్టి, ఆలోచనలో మార్పును బట్టి మార్గాలను మార్చుకుంటారు. ప్రొఫెసర్ జయశంకర్ మాత్రం జీవితాంతం ఒకే మార్గంలో నడిచాడు. ఒకే మాట మీద నిలబడ్డాడు. అందరినీ తన మార్గంలో నడిపించాడు. అందుకే అతడు మార్గదర్శి. తెలంగాణకు చిరునామా.
ఉద్యమాగ్ని చల్లారిన విశ్రమించలేదు వివక్షను నిలదీయుట విస్మరించలేదు. తోడు ఎవరు లేకున్నా తొవ్వ తీసినాడు ఆంధ్రవలస పాపాలను రాసిపెట్టినాడు విద్రోహం మూలాలు విప్పి చెప్పె దీక్ష విడువని జయశంకరెపుడు తెలంగాణ రక్ష
|| తెలంగాణ చెరువుతీరు మన జయశంకరు సారూ ॥
తెలంగాణ వాదాన్ని తీర్చి :
దిద్దినావు మారుతున్న తరానికి మార్గం చూపావు అరువదేండ్ల తెలంగాణ మనాదివే నీవు మలిదశ పోరాటానికి పునాదివే నీవు భావాలను వెదజల్లిన వెల్లువ వైనావు తెలంగాణ పాటలకు పల్లవి వైనావు ఒడిదుడుకులలో చెదరని ధైర్యమిచ్చినావు
|| తెలంగాణ చెరువుతీరు మన జయశంకరు సారూ ॥
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి