రుద్రమదేవి

 16...


అబలలు సబలలు అని నిరూపించింది! వనితలు వీరవనితలుగా నిలబడతారని ఋజువు చేసింది! కార్యాలోచనలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది! రణరంగంలో కత్తిపట్టి యుద్ధంచేసి... విజయదుందుభి మ్రోగించింది! వీరనారిగా... ధైర్యసాహసాలు ప్రదర్శించి రాణి రుద్రమగా నిలిచిన చారిత్రక ధ్రువతారగూర్చి చదువుకుందాం! మార్గదర్శకంగా తీసుకుందాం!

తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. కాకతి వంశ మూలపురుషుడు వెన్నరాజు, కాకతీయులలో ప్రసిద్ది చెందిన మొదటి రాజు ఇతడు. ఆ వంశంవాడైన మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుడు క్రీ.శ. 1198 నుండి 1262 వరకు సుదీర్ఘకాలం పాలించాడు. ఇతనికి పుత్రసంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీ.శ. 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణభారతదేశంలో మొదటిమహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. రుద్రమకు పుత్రసంతానం లేనందున ఆమె కూతురు ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1289 నుండి 1323 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే ఓరుగల్లు పతనమయింది.


గణపతిదేవ చక్రవర్తి, సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీ.శ. 1220 సంవత్సరంలో జన్మించింది. గణపతిదేవుడు పుత్రసంతానం కొరకు నారమ్మ, పేరమ్మలను కూడా పెండ్లిచేసుకున్నాడు. కాని మగ సంతానం కలుగనందున రుద్రమనే పురుష సంతానంగా పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే యుద్ధవిద్యలను నేర్పించాడు. యుద్ధవిద్యలను నేర్చుకున్నప్పుడు శిక్షణస్థలాన్ని యుద్ధరంగంగా భావించుకుని వ్యూహాలు, ప్రతివ్యూహాలను అమలుచేసేది రుద్రమ. యుద్ధవిద్యలతో పాటు రాజనీతి, న్యాయ, రాజ్యపాలన, అర్థశాస్త్రాల్లో సుశిక్షితురాలయింది. శివదేవయ్య శిక్షణలో ఆరితేరి ధీరవనిత అయింది. మేనమామ జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణభట్టు సంగీత సాహిత్యాలతోపాటు వివిధ కళలలో శిక్షణనిచ్చాడు. ఫలితంగా రుద్రమదేవి సర్వశక్తిమంతురాలుగా ఎదిగింది. గణపతిదేవుని కొలువు కూటంలో పురుషవేషంలో కూర్చొని రాజ్యపాలనలో మెళకువల్ని గ్రహించింది. పరాయిరాజుల వ్యవహారాలపై ఎట్లా దృష్టి పెట్టాల్నో చూసి నేర్చుకున్నది. శక్తి యుక్తులతో పురుషులతో సమానమైన ప్రతిభను సాధించింది. గణపతిదేవుడు ఈమెను వీరభద్రునికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిన  వెంటనే భద్రకాళి, ఏకవీర, కాకతమ్మ దేవతల సాక్షిగా, అంగరంగ వైభవంగా స్వయం భూదేవాలయ సువిశాల ప్రాంగణంలో రుద్రమదేవి వీరభద్రుల వివాహం


రుద్రమదేవి వీరభద్రులకు ముమ్మడాంబ, వీరరుద్రమ, రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు. మగసంతానం లేనందున గణపతిదేవుడు కొంచెం కలత చెందాడు. ఇటు గణపతిదేవుణ్ణి వృద్ధాప్యం వెంటాడుతుంటే అటు దుర్వ్యసనాలకులోనై అనారోగ్యానికి గురైన రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్ర భూపతి మరణించాడు. ఈ సంఘటన రుద్రమకు అశనిపాతం వంటిది. కానీ ఆమె చెక్కుచెదరలేదు. మేనమామ జాయప సేనాని వెంటరాగా భర్త కర్మకాండ విధియుక్తంగా నిర్వహించింది. తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉందని, కాదన్న అందరినీ నిలదీసి ముమ్మడాంబతో చితికి నిప్పుపెట్టించిన ధైర్యశాలి రుద్రమ. ఆమె వాగ్ధాటిముందు ఛాందస రాజబంధు బృందం ఎవరూ నోరెత్తలేదు.


ఇన్ని పరిణామాలు జరిగినా రుద్రమదేవి యువరాజుగా తన పనులు తాను నిర్వహిస్తూనే ఉన్నది. పురుషవేషంలో తిరుగుతూ ప్రజల మంచిచెడ్డలు చూస్తూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఓరుగల్లు వీధిలో ఒక వింత గొడవ ఆమెకు కనిపించింది. సంగతి భటులద్వారా తెలుసుకొని స్వయంగా తానే అక్కడికి వెళ్ళింది.


అది భార్యాభర్తల మధ్య గొడవ. వీధి నాటకాలతో కడుపునింపుకొనేవారు. నాటకంలో స్త్రీపాత్ర తన భార్య పోషించవలసిన అవసరం లేదంటాడు భర్త. తానే ఆ వేషం కడతాననీ, మరే మగవాడు ఆ వేషం కట్టడానికి వీల్లేదన్నది భార్య. అలా చేస్తే నేనింకెవ్వరినో తెచ్చుకొని కట్టుకొంటానంటాడు భర్త. నేనింకెవడినో కట్టుకొని వీధి నాటకాలాడతానన్నది భార్య.


ఇట్లాంటి కొట్లాట మధ్యకు అనుకోకుండా వచ్చింది రుద్రమదేవి. యువరాజును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాతావరణం నిశ్శబ్దంగా మారింది.


"నీ వృత్తిలో నీ భార్యకే సమానస్థానమివ్వని నీవు, నీ నాటకం ద్వారా లోకానికేం సందేశమిస్తావు" అని సూటిగా అడిగింది రుద్రమ.


"పొరపాటైంది యువరాజా" అని తప్పును ఒప్పుకున్నాడు.


"ఓ నటశిఖామణీ! కుటుంబాన్ని కూడా వీధినాటకంగా చేయకు" అని వ్యంగ్యస్వరంతో హెచ్చరించి వెళ్ళింది.


ఇట్లాంటి సంఘటనల్ని ఆమె అనేకం చూసి, పరిష్కరించింది. ప్రజల్ని ఆమె కన్నబిడ్డల్లా చూసుకున్నది అని తెలుపడానికి ఇలాంటివి సాక్ష్యాలుగా నిలుస్తాయి.


గణపతిదేవుడు చాలా శక్తిసంపన్నుడు. అతడు రాజ్యపాలన చేసినన్నిరోజులు సామంతులు అణగిమణగి ఉన్నారు. రాజ్యానికి శత్రుభయం లేకుండా స్థిరమైన పాలన చేశాడు. అతడంటే ప్రజలకు అభిమానం, భయం, భక్తి ఉండేవి. మంత్రుల సలహాలు, సామంతుల అభిప్రాయాలకు విలువనిచ్చి రాజ్యపాలన చేసిన గణపతిదేవుడు వృద్ధాప్యం వల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనలో పడి మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నాడు.


"రుద్రుని పట్టాభిషేకం తరువాత పరిస్థితి ఏవిధంగా ఉంటుంది" ప్రశ్నించాడు గణపతిదేవుడు.


“ప్రజలేనాడూ కాకతీయుల్ని వ్యతిరేకించలేదు" జవాబిచ్చాడు శివదేవయ్య.


"మంత్రుల అభిప్రాయం?"


"సానుకూలంగానే ఉన్నది"


సేనాపతులు, దళపతులు, ఇతర ఉద్యోగుల ఆలోచన?


రుద్రమదేవి రాణి కావాలనే ఉన్నది!


సామంతరాజుల ప్రవర్తన ఎట్లా ఉన్నది?


ఓరుగల్లు పరిసరాల్లోని సామంతులు సానుకూలంగానే ఉన్నారు. కాని సుదూరప్రాంతాల్లోని ఒకరిద్దరు ఎదురుతిరుగుతారు కావచ్చు!


ఇరుగు పొరుగు రాజులు?


వారిలో కూడా వ్యతిరేకించేవారు కొందరున్నారు!


"కారణం ఏమై ఉంటుంది?"


C "స్త్రీ అంటే చులకనభావం, పురుషాహంకారం!"


అంతా తెలుసుకున్న గణపతిదేవుడు "రుద్రమా, నీ పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తున్నది. ఈ నేలను కాపాడుతానని కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చెయ్యి" అన్నాడు.


కాకతమ్మ ముందు ప్రతిజ్ఞచేసి, "మీ నమ్మకాన్ని నిలబెడతా. ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడుతా. రాజ్యాన్ని రక్షిస్తా. నా తరువాత సమర్థుడైన వ్యక్తికే ఈ రాజ్యాధికారం అప్పగిస్తా" అని తండ్రితో అన్నది.


రుద్రమదేవి రాజ్యపట్టాభిషేకం జరిగింది. రాణి రుద్రమ అధికారంలోకి రాగానే కొందరు సామంతులు ఎదురుతిరిగారు. గోదావరి తీరాన ఉన్న మండలాధిపతులు స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తే రాణిపట్ల స్వామిభక్తి ఉన్న ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లను అణచి రాజ్య సుస్థిరతను కాపాడి రాజ్యం చీలిపోకుండా జాగ్రత్తపడ్డారు. రుద్రమ దేవతాదర్శనానికి మొగిలిచర్లకు పోయినపుడు హరిహరదేవుడు, మురారిదేవుడు ఓరుగల్లు కోటలో ప్రవేశించి కోటద్వారాలు మూయించి ఆమెను కోట లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆమెను అభిమానించే సేనానులు, ప్రజల సహాయంతో కోటను స్వాధీనం చేసుకున్నది. దేవగిరి రాజ్యం యాదవుల రాజ్యం. అది కాకతీయుల సామ్రాజ్యానికి ఆనుకొని పశ్చిమదిశలో ఉన్నది. దేవగిరిరాజు ఓరుగల్లు మీ దండయాత్రకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె దేవతాదర్శనానికి వెళ్ళింది. ఆమెకు దండయాత్ర వార్త తెలిసింది. దేవగిరి రాజు ఓరుగల్లు చేరకముందే కోటలో ప్రవేశించి కోట తలుపులు మూయించింది. దేవగిరిసేనలు ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడి చేశాయి. అంతకుముందే జాగ్రత్తపడ్డ రాణి కోటలో ఆహారపదార్థాలు, ఆయుధాలు, మంచినీటి వసతి సైన్యానికి కల్పించింది. దేవగిరిసైన్యం ఏనుగులు కోట తలుపులను బద్దలుకొట్టలేకపోయినవి. బురుజుల పైనుండి కోట గోడలపైనుండి వచ్చే బాణాలకు, ఇనుపగుండ్లకు, రాళ్ళకు పదాతి సేన బాగా దెబ్బతిన్నది. మహదేవరాజు చేసేదిలేక ముట్టడి ఆపి దేవగిరి మార్గం పట్టాడు.


కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు కూడా రుద్రమను ఓడించలేకపోయారు. దక్షిణాన ఉన్నది పాండ్యరాజ్యం. పాండ్యరాజు నెల్లూరుపై పోరాటానికి దిగి, కాకతీయుల సామంతుడైన మనుమసిద్ధిని ఓడించాడు.


కాకతీయుల సైన్యం పాండ్యరాజు చేతిలో ఓడిపోయింది. కాని రుద్రమ మరల సైన్యాన్ని తయారుచేసింది. మనుమసిద్ధి కుమారుడు కాకతీయ సేనల సహాయంతో మరల నెల్లూరును ఆక్రమించాడు. ఇట్లా నెల్లూరు ప్రాంతం తరచు చేతులుమారింది.


రాణి రుద్రమదేవి సైన్యంలో క్షత్రియులు, రెడ్లు, కాపులు, కమ్మవారు, పద్మనాయక వెలమలు, కాయస్థులు వారు వీరు అని కాకుండా అన్ని కులాలవారు ఉండేవారు. అందరికీ వారి వారి శక్తి సామర్థ్యాలనుబట్టి తగు. విధంగా గౌరవం, హెూదా లభించినవి. దేవగిరిరాజు యుద్ధనష్టపరిహారం కింద కోటి పన్ను చెల్లించాడు. అందులో సుమారు మూడవ వంతు పైకం ఆమె సైనికులకు పంచిపెట్టింది. తనకు విధేయులుగా ఉన్న సామంతులను రాణి G రుద్రమ గౌరవించింది. కుట్ర చేసినవారిని శిక్షించింది. ఆమె పరిపాలనా విధానం వల్ల ఉద్యోగులందరు ఆమెపట్ల భక్తిశ్రద్ధలు చూపించారు. ఆమె సర్వమత సహనాన్ని ప్రదర్శించింది. సవ్యమైన పాలన కోసం సమర్థులైన మంత్రులను, ఉద్యోగులను నియమించింది. శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని సమర్థంగా పాలించింది. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా, స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులను, ప్రగడలు అనే హోదాగల అధికార్లను నియమించింది. ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులు అనే అధికారులను నియమించింది. 'స్థలం' అనే భూభాగంలో అరవై వరకు గ్రామాలుండేవి. పాలనలో గ్రామం చివరిభాగం. గ్రామనిర్వహణకు అయ్యవార్లు, కరణం, పెద్దకాపు, తలారి, పురోహితుడు మొదలగు పన్నెండుమంది గ్రామసేవకులుండేవారు.


రుద్రమదేవి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేది. దానధర్మాలు చేసేది. శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి కళలను పోషించినట్లు చరిత్ర మనకు చెబుతున్నది. వర్తకం, వ్యవసాయం ఆమె పాలనలో అభివృద్ధి చెందాయి. ఓరుగల్లుకోట, రామప్పగుడి, వేయిస్తంభాలగుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి. పాకాల, లక్నవరం, రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజావసరాలకు తగ్గకుండా నీరు నిల్వచేసి ఉంచారు. చారులను నియమించి ఏమరుపాటులేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమదేవికే చెల్లింది. ఎవరైనా వచ్చి తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటే ఆమె వెంటనే విచారించి వారికి న్యాయం చేసింది. సత్రాలు నెలకొల్పింది. గ్రామాలు దానంచేసి ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతిగృహాలు, ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు నడిపేలా ఏర్పాటు చేసింది. దారిపొడవునా చెట్లు నాటించింది. దేవాలయాలు కట్టించింది.


మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం రుద్రమదేవితోనే రుజువైంది. దానికి నిదర్శనంగా ఆమె తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనికదళాన్ని ఏర్పాటుచేసింది. యుద్ధాలలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేలా శిక్షణలు ఇప్పించింది. ఆమె చేసిన విజయయాత్రలలో, ఆమెపై శత్రురాజులు దండెత్తిన సమయంలో వీరు పోషించిన పాత్ర అమోఘం. పటిష్ఠ గూఢచార వ్యవస్థ ఏర్పాటుచేసింది. సైన్యం రెండు రకాలుగా ఉండేది. ఒకటి మూలసైన్యం. అంటే రుద్రమదేవి సైన్యం. రెండవది సామంతులు పోషించి, రాజు కోరినప్పుడు పంపించే సైన్యం. సామంతులకు వారి వారి ప్రాంతాలపై పెత్తనం ఉండేది. రుద్రమదేవికి కప్పం కడుతూ, ఆమెను సామ్రాజ్యాధిపతిగా అంగీకరిస్తూ, ఆమె కోరినప్పుడు సైన్యాలను పంపిస్తూ వాటికి సేనా నాయకత్వం వహిస్తూ ఉండడమే వీరి ముఖ్యవిధి. ఇట్లాంటి పటిష్టమైన వ్యవస్థను సమకూర్చుకొని ఆమె రాజ్యపాలన చేసింది.


తెలంగాణ ప్రాంతంలో పెద్దపెద్ద చెరువులున్నవి. నదులు దగ్గరలో లేకపోవటంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు, వారి సామంతులు పెద్దపెద్ద చెరువులు తవ్వించారు. పెద్ద ఉద్యోగులు, ధర్మబుద్ధి గల అనేకమంది ఈ పనికి పూనుకొనేవారు. చెరువులు తవ్వించటం, ఏడురకాల ధర్మకార్యాల్లో ఒకటిగా హిందూధర్మం పేర్కొన్నది. మొదటి ప్రోలరాజు 'కేసరి సముద్రం' అనే చెరువు తవ్వించాడు. రెండవ బేతరాజు 'సెట్టిసముద్రం' అనే చెరువును ఏర్పర్చాడు. గణపతిదేవుడు నెల్లూరు, ఏలూరు మున్నగు స్థలాల్లో చెరువులు నిర్మించాడు.


'పాకాల చెరువు' గణపతిదేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డిచే నిర్మించబడింది. అది చాలా పెద్దచెరువు. చెరువులపై కాకతీయ చక్రవర్తులకు ఉన్న శ్రద్ధ వారి సామంతులకు, మంత్రులకు ఆదర్శప్రాయమైంది. కనుక తెలంగాణ నిండా అనేక చెరువులు వెలిశాయి. ఈ చెరువుల నుండి పొలాలకు నీరు సరఫరా చేయడానికి పెద్దకాల్వలు తవ్వించారు. రుద్రమదేవి వీటన్నిటికి మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో చాలా శ్రద్ధ వహించింది.


గణపతిదేవునికి సైన్యాధిపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించి పెట్టినవాడు గంగయసాహిణి. అతని మూడవతరంవాడు అంబదేవుడు. మొదట్లో అతడు రుద్రమదేవికి విధేయుడుగా ఉన్నాడు. దక్షిణ విజయ యాత్రలో  కీలకపాత్ర పోషించాడు. నావల్లనే విజయాలు సాధించబడినవనే అహంతో ఒక మహిళకు సామంతుడిగా ఉంటానా అని స్వాతంత్ర్యం ప్రకటించుకొని కాకతీయ సామ్రాజ్యపు దక్షిణభాగాన్ని కొంతమేరకు ఆక్రమించుకొన్నాడు. రుద్రమదేవి శత్రురాజైన యాదవరాజుతో స్నేహం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రుద్రమదేవి అంబదేవుల మధ్య యుద్ధం జరిగింది. రుద్రమవైపు నిలిచి యుద్ధం చేసిన మల్లికార్జునుడు యుద్ధభూమిలో మరణించాడు. ఇది చూసిన రుద్రమ శత్రుసైన్యాధిపతిని ముక్కలు చేసింది. ఆమె యుద్ధకౌశలం ముందు అంబదేవుడు నిలువలేక పోయాడు. కాని ఈ యుద్ధంలో రుద్రమ కూడా శత్రుసైనికుల కత్తిదెబ్బలు తిన్నది. విజయం వరించినా క్షతగాత్రగా వెనుదిరిగింది.


రుద్రమ, గణపతిదేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని మరింత సుస్థిరపరచింది. ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది. పశ్చిమాన బీదరు వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది. తన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించేది ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటించింది. ప్రతాపరుద్రుణ్ణి చదువుసంధ్యల్లో, సాముగరిడీల్లో తీర్చిదిద్దింది. అతణ్ణి తనవెంబడి తిప్పుతూ దేశం, ప్రజ, ధర్మం, పరిపాలన అనే అంశాలను కూలంకషంగా బోధించడం ప్రారంభించింది. తల్లి ముమ్మడమ్మ తన పుత్రుని మహర్దశకు సంతసించి ప్రతాపరుద్రుని అమ్మమ్మకే అప్పగించి నిశ్చింతగా కాలం గడిపింది. తన జీవితకాలంలోనే ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేసి, తండ్రి గణపతిదేవుని అడుగుజాడల్లో నడిచింది. తన బతుకంతా ప్రజల కోసమే అర్పించిన వీరనారి క్రీ॥శ॥ 1289 లో నల్లగొండజిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసింది. తెలంగాణ చరిత్రలో వీరనారి రుద్రమదేవి అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎందరో విదేశీయాత్రికులు రుద్రమ పాలనావిధానాన్ని ప్రశంసించారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana