పి.వి. నరసింహారావు

 పి.వి. నరసింహారావు


భారత రాజకీయాలలో అపరచాణక్యుడనే పేరు, గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవీకాలాన్నీ పూర్తిచేసిన అరుదైన ప్రతిష్ఠ, మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా నిబ్బరంగా అయిదేళ్ళు నడిపించిన 'తెలుగు నేతృత్వం' ఇవన్నీ తలచుకోగానే గుర్తుకువచ్చే పేరు పాములపర్తి వేంకట నరసింహారావు.


స్థిత ప్రజ్ఞుడు.... సంస్కరణశీలి ... అపర చాణక్యుడు న్యాయశాస్త్రజ్ఞుడు ... బహుభాషా కోవిదుడు ... అందరికీ అయిన వాడు. మన తెలంగాణ మహనీయుడు సాహిత్య సుగంధాలను వెదజల్లినవాడు  "లోపలి మనిషి'ని అందంగా ఆవిష్కరించినవాడు.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండట మెట్లాగో తెలిసినవాడు.... దక్షిణ భారతం నుండి మొట్ట మొదటగా ప్రధాని పీఠం అధిష్ఠించిన వాడు


పై మాటలు వింటుంటే గుర్తుకు వచ్చే వారెవరో తెలుసా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతూ పతనోన్ముఖంగా పరుగులు తీస్తున్న దశలో 'ప్రధాని' పగ్గాలు చేపట్టి చక్కదిద్దిన ధీశాలి, మన తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వేంకట నరసింహారావు.

పి.వి. నరసింహారావు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి, బహుభాషా కోవిదుడు. నిజాం వ్యతిరేక పోరాటంలో రాటు దేలిన తరానికి చెందిన నాయకుడాయన, బహుముఖమైన వీరి ప్రతిభ అనన్య సామాన్యం. రాజకీయ రంగంలో శాసన సభ్యుడిగా, రాష్ట్ర విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన మేరునగధీరుడు పి.వి.


కవిగా, అనువాదకుడుగా, పాత్రికేయుడుగా, కథకుడిగా, నవలా రచయితగానే కాకుండా పద్నాలుగు భాషలు మాట్లాడగల్గిన బహుభాషావేత్తగా సుపరిచితులు, 1983లో న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడల్ కాస్ట్రోను అబ్బురపరిచిన ధీశాలి. పి.వి. పుట్టింది. భూస్వామ్య కుంటుంబంలోనే. ఐనా భూస్వామ్య పోకడలకు దూరంగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో యాభై ఎకరాల భూమిని భూదానోద్యమానికి దానమిచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భూసంస్కరణలకు శ్రీకారం చుట్టి చరితార్థుడయిన పి.వి.నరసింహారావు జీవిత విశేషాలను తెలుసుకొందాం.


బాల్యం - విద్యాభ్యాసం:


కరీంనగర్ జిల్లా భీందేవరపల్లి మండలం 'వంగర' పి.వి.నరసింహారావు స్వగ్రామం. ఆయన పుట్టిన గ్రామం మాత్రం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి, సీతారామారావు, రుక్మాబాయమ్మ పుణ్యదంపతులకు 28 జూన్ 1921న పి.వి. నరసింహారావు జన్మించాడు. వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు పి.వి.ని దత్తత తీసుకున్నారు.


1924లో బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి సన్నిధిలో అతని తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దాడు. 1928 నుండి 1930 వరకు హుజూరాబాద్ పాఠశాలలో మూడు, నాలుగు తరగతులు చదివాడు. వంగర నుండి హుజూరాబాద్కు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం రోజూ సవారీ కచ్చడం (ఎడ్లబండి) లో వెళ్ళి వచ్చేవాడు. చదువుకునే రోజుల్లో పి.వి. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. తానెప్పుడూ క్లాస్లో సెకెండ్ రావడం ఎరుగనని 'ఐ విట్నెస్' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పి.వి.చెప్పాడు. చిన్నప్పుడు గణితం సబ్జెక్టు అంటే అమితంగా ఇష్టపడేవాడు. చదువులోనే కాదు ఆటల్లోనూ ఆరితేరినవాడే. టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు. పి.వి.కి చిన్నప్పటి నుండి సంగీతంలోనూ ప్రవేశం ఉంది. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతంతో కూడిన కీర్తనలు


1936లో హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. 1938లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడంతో ఆయన రాష్ట్రంలో ఎక్కడా చదువకుండా నిర్బంధం విధించారు. దీనితో ఆయన మహారాష్ట్రలోని పూనెలో బి.యస్సి,, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పట్టా పొందాడు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశాడు.


రాజకీయ ప్రస్థానం :


పి.వి. రాజకీయ ప్రస్థానం ఓటమితో ప్రారంభమయింది. 1952లో స్వతంత్ర భారత తొలి సాధారణ ఎన్నికలలో ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. పడిలేచిన కడలి తరంగం వలె తిరిగి 1957 నుండి 1972 వరకు నాలుగు సార్లు మంథని శాసనసభా నియోజకవర్గం నుండి జయకేతనం ఎగురవేశాడు. 1962లో రెండోసారి శాసన సభకు ఎన్నికయిన పి.వి. రాష్ట్ర జైళ్ళు, ప్రజా సంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయా శాఖల్లో పలు సంస్కరణలు చేపట్టి అందరి ప్రశంసలు పొందాడు.


మూడోసారి శాసన సభకు గెలిచిన సమయంలోనే పి.వి.ని ముఖ్యమంత్రి పదవి వరించింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూసంస్కరణలు అమలుపరిచేందుకు చర్యలు చేపట్టాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా పి.వి. ప్రభుత్వమే తెచ్చింది. నిజానికి పి.వి. ముఖ్యమంత్రి పదవి పోవడానికి భూసంస్కరణ చట్టమే కారణమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పేదలకు మేలు జరిగే చట్టం కోసం పదవిని తృణప్రాయంగా వదిలి వేయడం మహనీయులకు కష్టం కాదు కదా!


దేశ రాజకీయాలలో


1977లో పి.వి. కేంద్ర రాజకీయాలలో ప్రవేశించాడు. హనుమకొండ నుండి లోకసభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. శ్రీమతి ఇందిరాగాంధికి అత్యంత విశ్వసనీయుడుగా ఉంటూ కీలకమైన హోం, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 1984లో హనుమకొండ నుండి ఓటమి పాలయినా, మహారాష్ట్రలోని రాంటెక్ నియోజక వర్గం నుండి విజయం సాధించాడు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ, హోం శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ గాంధీ హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాల వలన అప్పటికే రాజనీతిజ్ఞుడుగా దేశ, విదేశాలలో గణుతికెక్కిన పి.వి. నరసింహారావు కీలకమయిన బాధ్యతలు స్వీకరించాడు.


1991లో జరిగిన ఎన్నికల తర్వాత దేశరాజకీయ రంగంలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. అప్పుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాల మద్దతు కూడగట్టి తాను ప్రధానమంత్రిగా మైనారిటి ప్రభుత్వం ఏర్పరచాడు. అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం మనజాలదని పెదవి విరిచారు. కాని తన అనన్యమైన చాతుర్యంతో ఐదు సంవత్సరాలు చక్కని పాలన అందించి రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచాడు.


పాత్రికేయునిగా... సృజనశీలిగా...:


భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన 5 వెదజల్లిన బతి న అతి కొద్ది మంది రాజకీయ వేత్తలలో పి.వి. అగ్రతాంబూలానికి అర్హుడు. -1948లో 'కాకతీయ' పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. 'కాకతీయ' పత్రికలో 'జయ' అనే మారుపేరుతో అనేక రచనలు చేశాడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో "గొల్లరామవ్వ" కథను 'విజయ' అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి 'సహస్రఫణ్' పేరుతో అనువదించాడు. ఈ రచనకు పి.వి. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందాడు. 'పన్అక్షత్ కోనతో' అనే మరాఠీ పుస్తకాన్ని 'అబల జీవితం' అనే పేరుతో అనువదించాడు.


పి.వి. రాజకీయ, సాహిత్య అనుభవాలను రంగరించి ఆంగ్లంలో రాసిన 'ది ఇన్సైడర్' అనే నవలకు విశేష ప్రాచుర్యం లభించింది. తాత్త్వికుడు, ప్రజాహితైషి చేసిన నిర్విరామ విఫలయత్నాల విషాద గాథే 'ది ఇన్సైడర్'. ఈ గ్రంథం 1998లో వెలువడింది. ఈ గ్రంథం 'లోపలి మనిషి' పేరుతో తెలుగులోనికి కూడా అనువదించబడింది. తన చిన్ననాటి ఆత్మీయ మిత్రులు కాళోజీ నారాయణ రావు, రామేశ్వర రావులతో పి.వి. చేసిన సాహితీ చర్చలు వారి సాహితీ తృష్ణకు నిదర్శనాలు,


ఈ విధంగా దేశహితాన్ని కోరిన మహామనీషి, స్థితప్రజ్ఞుడు, సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఒడ్డుకు చేర్చిన అసామాన్యుడు! తనవారినే కాదు, రాష్ట్రాన్ని, దేశాన్ని దుఃఖ సాగరంలో ముంచి 23, డిసెంబరు 2004న గుండెపోటుతో కన్ను మూశాడు. 'మనవాడు' అని యావత్ తెలంగాణ జాతి గర్వంగా చెప్పుకొనే పాములపర్తి వేంకట నరసింహారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సేవలు సదా స్మరణీయాలు,


హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తీరాన పి.వి. సమాధి తెలంగాణ ఆత్మాభిమానాన్ని చాటుతున్నట్లుగా ఉన్నది. "ఆచితూచి మాట్లాడడమే కాదు, రచనలోనూ పి.వి.ది అదే గాంభీర్యం, పరిణతి, దేశభక్తి కనిపిస్తుంది. దేనికి చలించని ఆయన వ్యక్తిత్వమంటే నాకెంతో ఇష్టం" అనే దాశరథి రంగాచార్య మాటలు పి.వి. సమున్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana