నేను... సావిత్రిబాయిని

 6. నేను... సావిత్రిబాయిని


"జ్యోతి! సావిత్రికెందుకు చదువు నేర్పుతున్నావు?"


"ఎందుకు నేర్పకూడదు?”


అసలు మన కులంవాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించా. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు"-


"ఆమె కూడా మనిషేకదా? కాదంటే చెప్పు"


"నిజమే కావచ్చు కానీ ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతది. బుద్ధి లేనిదవుతది"-


"నాన్నా! సావిత్రి చదువుకుని నిరూపిస్తుంది" మాటలన్నీ మాటలన్నీ అబద్ధాలని


నమస్కారం!


ఇవాళ మీ అందరితో మాట్లాడటానికి వచ్చాను.


మొదట్నించి చెప్తా వినండి. నేను పుట్టిందేమో నైగావ్. అయ్యా! అదెక్కడుందో మీకు తెలియదు గదూ! మహారాష్ట్రలో సతారాజిల్లాలో ఖండాలా తాలూకాలో ఉంది. అబ్బో ఎంత కుగ్రామమని, అక్కడసలు మనుషులుంటరా అని అనుమానం కలిగేంత చిన్నఊరు. ఆ రోజుల్లో ఆ ఊళ్ళో అందరూ అందర్నీ ఎరిగి 1 ఉండేవాళ్ళు. నేనా? పాటిల్ గారింట్లో పెద్దకూతుర్ని, మొదటి సంతానాన్ని, అబ్బా- మీకదంతా చూపించేదా? ఆ చేలలో పడి పరుగెత్తుతూ, ఆ గులకరాళ్ళను, దుమ్మునూ తన్నుకుంటూ- ముళ్ళు గుచ్చుకోవా అంటున్నారా? ముళ్ళూ గిళ్ళూ ఏవీ లెక్కలేదు నాకు. విరబోసుకున్న జుట్టు ముఖంమీద పడుతుంటే వెనక్కి తోసుకుంటూ ఊరంతా వెర్రిగా పరిగెత్తేదాన్ని.


చింతకాయలు కొట్టుకొని తినటం, రేగుపళ్లు కోసుకొనితినటంలో నన్ను మించినవాళ్లు లేరు. ఒకరోజు యేమైందో తెలుసా? ఔను మీరనుకుంటున్నట్టే జరిగింది. నేనెక్కిన సీమ చింతచెట్టు కొమ్మ విరిగింది. నేనా కొమ్మ పట్టుకొని ఉయ్యాల ఊగుతున్న - సీమ చింతకాయలు నా పరికిణీలోంచి కిందపడిపోతున్నాయి. 'అమ్మా నా సీమ చింతకాయలు, నేను పడిపోతున్నా, కొమ్మ విరిగింది. నేను పడిపోతున్నా' నా అల్లరికి అమ్మ పరిగెత్తుకొచ్చింది. వచ్చింది నన్ను దించొచ్చు కదా! ఊహూ, వెళ్ళి మా నాన్నను పిల్చుకొచ్చింది. 'చూడండి మీ ముద్దుల కూతురు ఏంచేసిందో' అంటూ అమ్మ నావైపు చూపిస్తూ, నేనేమో కొమ్మకు వేలాడుతూ, మా నాన్న విరగబడి నవ్వుతూ ఎంత బాగుంది... కదా!


నాన్న నన్ను కిందికి దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు. 'ఈ పిల్లకు తొందరగా పెండ్లిచేసి పంపించాలి. ఏ కాలో చెయ్యో విరక్కొట్టుకుంటే ఎవరు చేసుకుంటారు? గుదిబండలా మన మెడకు చుట్టుకొనివేలాడుతుంది. అసలిది ఆడపిల్లనేనా అంటా?'

'నేను ఆడపిల్లను కాదమ్మా. ఇదిగో ఈ సీమచింతకాయ చూడు ఎంత తియ్యగా వుందో' అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్ళీ పరుగుతీసే దాన్ని,


నాన్న కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పూనాలో వుండే పూలే కుటుంబంలో ఒక అబ్బాయితో నా పెళ్ళి నిశ్చయించాడు. 'ఈ సేఠ్ జీ ఎట్లా ఉంటాడబ్బా అనుకునేదాన్ని!' చింత చెట్లెక్కుతాడా? బావిలో ఈతగొడుతాడా? రాత్రిళ్ళు ఆరుబైట పడుకునే చుక్కలు లెక్కబెడుతాడా? ఏమో! ఎవరికి తెలుసు? బళ్ళో చదువుకుంటున్నాడని చెప్పారుగా! పుస్తకాలు చదువగలడేమో!


ఆ రోజుల్లో ఆడవాళ్లు గడప దాటకూడదు. ఆడపిల్ల పెరిగిపెద్దదయ్యేసరికి- లక్ష్మణుడు గీసిన గీత దాటడం వల్లనే సీతమ్మవారిని రావణాసురుడు యెత్తుకుపోయాడనే కథ ఎన్ని వందలసార్లు విన్నానో ఎవరూ లెక్కబెట్టలేదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికీ కట్టుబడి ఉండాలి. పొయ్యిలో కట్టెలు, పొయ్యి ఊదే గొట్టం ఆ పిల్లచేతిలో వుండాల్సిందే. ఆ పిల్ల ఆ గొట్టం గుండా ఊపిరంతా పొయ్యిలోకి ఊదాల్సిందే. భర్తనీ, అత్తమామల్ని సేవించుకోవాలి. అంతే ఇక నీ పని, ఇప్పుడు మీ పిల్లలు రెండో తరగతి చదువుతుంటే, మీరు బుజ్జగిస్తుంటారే, ఆ వయసులో మేం అత్తగారింట్లో ఉండేవాళ్ళం.


ఒకరోజు నేను ఇల్లు సర్దుతున్నా. పుస్తకాల గుట్టమీద వున్న దుమ్ము దులుపుతున్నా. ఇల్లు శుభ్రంగా ఉండాలి గదా. అదుగో అప్పుడే ఆయనొచ్చాడు. 'నా పుస్తకాలనేం చేస్తున్నావు!' అన్నాడు. 'దుమ్ముదులిపి శుభ్రం చేయొద్దా?' అన్నా. “పేజీలు పోగొడతావ్ జాగ్రత్త?' అంటే 'ఎక్కడికిపోవు, అన్నీ ఉంటాయి అన్నా. ఇదేంటో మరి?' 'ఏ పేజీ అది' - 'ఏ పేజీనో ఏమిటో నాకేం తెలుస్తుంది? ఏమయిందని మీరిప్పుడీ రగడ చేస్తున్నారు?' అన్నా. 'అవన్నీ జీవితచరిత్రలు. ఇదిగో చూడు. ఇది శివాజీ గురించి రాసింది, ఆయన ఫోటో ఇది. ఇక్కడ వాషింగ్ట న్ గురించి రాసింది. ఇది ఆయన ఫోటో. అని సేఠ్ జీ అన్నాడు. 'ఎవరూ! శివాజీ నాకూ తెలుసు. మనవాడే కదా! కానీ ఈయనెవరూ ?' పరాయిదేశం మనిషివలె వున్నాడు' 'మన దేశం అయితేనేం కాకపోతేనేం, మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.' అన్నాడు. అబ్బో ఈ సంగతులన్నీ మీ బుర్రలో ఉన్నట్టే చెప్తున్నారే' అన్నా. బుర్రలో ఉంచాలనే ప్రయత్నిస్తున్నా. ఈ పుస్తకం చూడు. ఇది థామస్ పెన్ రాసిన 'మానవునిహక్కులు' అన్న పుస్తకం. మనిషికున్న హక్కులేమిటో బాధ్యతలేమిటో అన్నీ ఈ పుస్తకంలో రాసివున్నాయి. అని చూపించాడు సేఠ్.


ఇట్లా ప్రతిరోజూ సేఠ్ నాకు యేదో వొకటి చదివి విన్పించేవాడు. మధ్యలో ప్రపంచం గురించి, మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి నాకర్ణమయ్యేటట్లు చెప్పటం కోసం ఆపేవాడు. హిందూ ముస్లిం మతాల మధ్య ఉన్న తేడాలేమిటి? క్రైస్తవమతం మనిషి గురించి ఏం చెప్తుంది? మన కులవ్యవస్థ మన సమాజాన్ని యెట్లా నాశనం చేస్తుందో చెప్పేవాడు. వీటన్నిటి గురించీ ఆయన మాట్లాడుతుంటే చెవులు రిక్కించుకుని వినేదాన్ని. సేఠ్ జీ నిరంతరం చదివేవాడు. కబీర్, తుకారాం, జ్ఞానేశ్వర్ వంటి భక్తుల సాహిత్యం, భక్తిమార్గాన్ని గురించి, బుద్ధుడు, బసవేశ్వరుడు, తీర్థంకరుడు మొదలైన మతసంస్కర్తల రచనలన్నీ చదివాడు. అవన్నీ నాతో చెప్పేవాడు. స్నేహితులతో చర్చించేవాడు. 'ఇదంతా చదివితే నీకే మొస్తుంది?' ఆపుకోలేక ఒకరోజు అడిగాను, ఒకప్పుడు మంచిగా ఉండే మతం, మూర్ఖపు ఆచారాలలో, సంప్రదాయాలలో చిక్కుకుపోయింది. వీటన్నిటినీ రూపుమాపాలి.' ఈ దరిద్రపు ఆచారాలన్నీ ఎక్కువ తక్కువ కులాలనే విభజన వల్లనే వచ్చాయి. మామూలు మనుషులందరికీ చదువు ఎందుకుండకూడదు?' ఆయనట్లా చెప్పుకపోతున్నాడు.


ఆయన బుర్రలో ఒకే ఒక్క విషయం తిరుగుతున్నది. చదువు, చదువు, చదువు. సదాశివ గోవింద్ ఆ రోజుల్లో సాగర్లో ఉండేవారు. ఆయన సేఠ్ ని ఫర్రార్ అనే ఆమె నడిపే బడికి తీసుకెళ్ళాడు. ఆమె తెల్లజాతి మనిషి, వీళ్ళిద్దరూ  బడిలో ఏం నేర్పాలి, ఎట్లా నేర్పాలి అని ఆమె నడగటానికి వెళ్ళాడు. ఆమె అన్నదిగదా, "ఇంటికి కేంద్రం ఆడమనిషి, ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే లేదు. మీరు మీ ఆడవాళ్ళకు చదువు చెప్పించకపోవడం అన్యాయం. ఘోరం" అన్నది. అంతే, సేఠ్ తలలో తొలుస్తున్న పురుగు తన దారి కాస్త మార్చుకున్నది. ప్రతి మగవాడూ తన భార్యకు చదువు నేర్పాలి. అక్కణ్ణుంచి రావడం రావడమే పలక, బలపం, పుస్తకాలతో వచ్చాడు. నేనప్పుడే రొట్టెలు చేసి పొయ్యి ఆర్పబోతుండగా ఆయన ముఖం వెలిగిపోతున్నది. కాళ్ళూ చేతులు కడుక్కుంటూనే నన్ను కేకేశాడు. "అంతా సిద్ధంగా ఉంది. రొట్టెలు, కూర అన్నీ వున్నాయి. నీదే ఆలస్యం" అని నేనూ కేకపెట్టాను - "నాకిప్పుడు రొట్టేగిట్టే ఏమీ వొద్దు - నువ్వు ముందిటురా!" అన్నాడు. అబ్బబ్బా ఇవ్వాళ సేఠ్ జీకేమయింది? అనుకుంటూ వచ్చాను. సేఠ్జీ చేతిలో పుస్తకాలరాశి.


అప్పట్నుండి నా చదువు మొదలైంది. సేఠ్జీ పలకమీద వరసగా అచ్చులు, హల్లులు రాసి దిద్దుమన్నాడు. అవే మళ్ళీమళ్ళీ. వేళ్ళు నొప్పెడుతున్నాయి. విసుగుపుట్టేది. సేఠ్జీ ప్రతిక్షణం నా చదువుపై శ్రద్దపెట్టాడు. నాకిప్పుడు చదువడం వచ్చింది. నిన్నమొన్ననేగా సేఠ్జీ నాకు అన్నీ చదివి వినిపించేవాడు. ఇప్పుడేమో నేను మాటలు గుర్తుపడుతున్నా. అక్షరాలు, మాటలు, వాక్యాలూ నా ముందు నాట్యంచేస్తున్నాయి. గొబ్బిళ్ళ పాటలన్నీ రాయాలనిపించేది. నా పేరు రాయాలనీ, దాన్ని నా వేళ్ళతో తాకి చూసుకోవాలని అనిపించేది. నెమ్మదిగా నాకు చదువటమంటే చాలా ఇష్టం కలిగింది.


ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే సేఠ్జీ తక్కువ కులాల ఆడపిల్లల కోసం ఒక బడిపెట్టాడు. ఇక దాంతో ప్రళయం ముంచుకొచ్చింది. ఎవరేమనుకున్నా సేఠ్ జీ ఖాతరు చెయ్యలేదు. బడి బ్రహ్మాండంగా ఉంది. అన్నాసాహెబ్ చిప్లూంకర్ భవనంలో ఆడపిల్లలకోసం రెండో బడి కూడా మొదలైంది. కేశవరావ్ భవాల్కర్, జగన్నాథ్ సదాశివ్, అన్నాశాస్త్రి బుద్ధే, బాపూరావ్ మందే, విష్ణుమొరేశ్వర్, భిడే కృష్ణశాస్త్రి, చిప్లూంకర్ వీళ్ళందరూ కార్యనిర్వాహకులుగా ఉన్నారు. ఆ బడికూడా చక్కగా నడుస్తున్నది. ఒకరోజు సాయంత్రం సేఠ్ జీ ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ఏం జరిగిందని అడిగాను. ఆయన మాట్లాడకుండా అటూ యిటూ అశాంతిగా తిరుగుతున్నాడు. మళ్లీ అడిగాను. 'ఏమైంది? జరగరానిది జరిగిందా?' "స్కూలు నడిపే పంతులుగారు బడిమానివేశారు. ఇప్పుడేం చెయ్యాలి?" అన్నారు. "మనమేం చెయ్యగలం?" అన్నాను. నాకు తెలియటంలేదు. కానీ తక్కువ కులాలవాళ్ళు కూడా చదువుకుని టీచర్లు కావాలి. కానీ అంతవరకూ యేంచెయ్యాలి?" చివరకు కొత్తపంతులుగారు దొరికేవరకు నన్ను బడికి రమ్మన్నాడు. "ఆ పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించుదువుగాని” అన్నాడు. “నేనా చదువు చెప్పటమా? నా వల్లగాదు" నేను చెప్పేది వినిపించుకోకుండానే సేఠ్ భావాల్కర్తోతో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళేం మాట్లాడుకున్నారో దేవుడికి తెలియాలి. భవాల్కర్గారు వెంటనే మా యింటికొచ్చారు. "అంతా నిర్ణయమైపోయింది. రేపట్నించి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి?" అని అన్నారు. "నేనెట్లా చెప్తాను? ఏం చెప్తాను"-అని అన్నా. "నువ్వు చెప్తావు అంతే, ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా" వాళ్ళిద్దరూ కూడా నేను చెప్పేది వినిపించుకునే స్థితిలో లేరు. బడిలో పాఠాలు చెప్పడానికి ఒప్పుకోక తప్పలేదు.


నేను బడికిపోతుంటే జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలన్నీ అనేవారు. బడికి వెళ్ళంగానే అక్కడ తలుపులు కిటికీలు మూసే లోపల పిల్లలకు నీతిపద్యాలు, కూడికలు, తీసివేతలూ, భూగోళశాస్త్రం, మరాఠా చరిత్ర ఇవన్నీ చెప్పేదాన్ని. సేఠ్జీ మాల మాదిగల పేటలకు వెళ్ళి చదువు ఎంత అవసరమో ప్రచారం చేస్తుండేవాడు.


మేము ఒక బిడ్డను దత్తత చేసుకున్నాం. మా స్వంత కొడుకువలె అతన్ని పెంచాము. మనిషినీ మనిషినీ కట్టివేసేది రక్తసంబంధం మాత్రమే కాదు. మానవత్వం మరింత బలమైన బంధం. కానీ ఇవాళ కులం పెద్ద సమస్యగా మారింది.


ఎందుకంత పెద్ద సమస్య అయింది? మీరు ఆలోచించండి. మా ఆలోచనలూ మా ఆదర్శాలూ వాటికి కాలం చెల్లిపోయిందా? ఇవాళ, రేపు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే కులం, రంగు, జాతి అన్నీ చూస్తున్నారు. అసలు దత్తత తీసుకోవాలనే అనుకోరు, కానీ కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన ప్రాణికి కులం ముద్రవేయటం దేనికి?


జ్యోతిరావ్ పూలే మొదటి బాలికల పాఠశాల ప్రారంభించాడంటారు. శిశుహత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడంటారు. సావిత్రిబాయి మొదటి పంతులమ్మ అని కూడా అంటారు. ఇదంతా నిజమే కావచ్చు. కాని ఆ పని అక్కడితో ముగిసిపోకూడదు. ఆశ్రమాన్ని మా స్వంత డబ్బుతో ప్రారంభించాం. తర్వాత పండరిపురంలో అట్లాంటి ఆశ్రమాన్నే యేర్పరచినపుడు సేఠ్ మా ఆశ్రమాన్ని యిక పెంచలేదు. ఆయన అనేవాడు, "నిజమే, ఈ పని నేను మొదలుపెట్టాను. కానీ మనం మాత్రమే ఈ పని చెయ్యాలి అని అనుకోకూడదు. యింకొకళ్ళు ఇట్లాంటి పనే చేస్తుంటే మనం ఇంకొక కొత్త పని ప్రారంభించడానికి సంకోచించకూడదు."


మా మనసుల్లో ఒకసారి ఆ ఆలోచనకు బీజం పడిందంటే ఇక అది కార్యరూపం దాల్చవలసిందే. ఆలోచన ఆచరణగా వెంటనే మారవలసిందే. మా ఆలోచనలు అన్నిచోట్లా విస్తరించేటందుకు సంఘం పెట్టాలని అనుకున్నాం. 1873 సెప్టెంబరు 23వ తారీకున సత్యశోధక సమాజాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ సమాజం ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడింది. దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. ఆయనను ప్రార్ధించటానికి ఈ మధ్య దళారీలు యెందుకు? ఒక మనిషిని మంచివాడుగా, గొప్పవాడుగా చేసేది గుణమేగాని కులం కాదు. మనం సత్యంకోసం అన్వేషిస్తున్నాం. భగవంతుడు అన్నిటినీ సృష్టించాడు. అందువల్ల సేఠ్ జీ ఆయనను సృష్టికర్త అనేవాడు. ఆయన మన తండ్రి; మనం ఆయన పిల్లలం. ఈ సత్యాన్ని అంగీకరించిన వారెవరైనా సత్యశోధక సమాజంలో సభ్యుడు కావొచ్చు. కులం ఏదనే ప్రసక్తి లేదు. సత్యశోధక సమాజం అధ్వర్యంలో మొదటి వివాహాన్ని 25.12.1873లో సమాజం పద్ధతిలో జరిపించాం. మేం గెలిచినాం. ఇప్పుడు నాలో నేను అనుకుంట. "మా తర్వాత వచ్చిన ఈ ప్రజలు మా విజయాలను ముందుకు తీసుకవెళ్తున్నారా లేక వాటిని అక్కడనే భూస్థాపితం చేసి జీవం లేకుండా చేస్తున్నారా?" అని. సేఠ్ జీకి పక్షవాతం వచ్చి కోలుకున్నారు కాని ఎప్పుడూ ఇతరమైన జబ్బులేవో చేస్తూనే ఉన్నాయి. అఖండ్ పాటను వింటూనే సేఠ్ జీ యాత్ర ముగిసింది. హృదయ విదారక రోదనలు మిన్నుముట్టాయి. నిప్పులకుండను పట్టుకుని "సత్యమేవ జయతే - అఖండ సత్యం- సత్యమేవ జయతే- అఖండ సత్యం" అనుకుంటా ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను.


1897 పూనాలో ప్లేగువ్యాధి ప్రబలింది. పట్టణం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గర్లో ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఇట్లాంటి సమయాల్లో తక్కువ కులాలవాళ్లకు సహాయపడాలని ఎవరనుకుంటారు? నేను నా కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాం. ఒక గుడిసెలో రెండేళ్ళ పసివాడు బాధతో లుంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని యెత్తుకుని డాక్టర్ దగ్గరకు పరుగెత్తాను. ప్లేగు అంటువ్యాధైనా ప్రాణంకోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఎట్లా ఉండగలను? నా గుండెలకు అదుముకున్నాను. ఆ పసిబిడ్డ చావవలసిఉంటే మరొక మనిషి ప్రేమ ఇచ్చే వెచ్చదనంలో చనిపోనివ్వు. ఆ బిడ్డ చనిపోయాడు. నాకు కూడా ప్లేగువ్యాధి సోకింది. నా ప్రయాణం పరిసమాప్తమయింది.


నేను పనిలో వుండగా మృత్యువు నన్ను వరించటం నా అదృష్టం.


- మూలం : సుషమా దేశ్పాండే, అనువాదం: ఓల్గా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana