ఇల్లు-ఆనందాల హరివిల్లు

 ఇల్లు-ఆనందాల హరివిల్లు


భారతీయ కుటుంబ వ్యవస్థ అనుసరణ యోగ్యమైనదని అంతర్జాతీయ సమాజం అనేక ప్రశంసలు కురిపించింది. తీయని అనుబంధాల సమాహారం, ఆత్మీయతల మందిరం అయిన ఇల్లు, కుటుంబం యొక్క గొప్పదనం తెలుసుకుందాం. కుటుంబ విలువలు కాపాడుకుందాం.


పక్షి ఆకాశమంతా విహరించి వచ్చినా తిరిగి చేరుకునేది తన గూటికే. మనిషికూడా ప్రపంచంలోని నగూటికే అద్భుతమైన ప్రదేశాలెన్నింటినీ తిరిగినా చివరకు చేరుకునేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఇంటికే. ఉన్నది!


ఇల్లంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాళ్ళతో కట్టిన నాలుగు గోడల నిర్మాణమో, ఓ పూరిగుడిసో, ఓ బంగళానో, భవనమో కాదు. ఇల్లంటే మన భావోద్వేగాలన్నింటినీ పంచుకునే అనుబంధాల వేదిక.


ఇల్లంటే అమ్మ,


ఇల్లంటే నాన్న,


ఇల్లంటే కుటుంబసభ్యులు


అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు తాతయ్య, నాన్నమ్మ, ఇదే కుటుంబం.


ఇట్లు సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. ప్రేమానురాగాల పల్లకి, తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండే ఒక అందమైన ఆత్మీయ ప్రదేశం.


సామాజిక, మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో "ఒకే గొడుగునీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ, పురుషులు, వారి పిల్లలూ ఉన్న ఈ సమూహమే కుటుంబం".


కాలాలు మారినా, ఏళ్ళు గడిచినా భారతదేశంలో ఇప్పటికీ కుటుంబవ్యవస్థ నిలిచి ఉన్నది. విశ్వసనీయత, సమగ్రత, ఏకత అనే మూడు మూలస్తంభాల మీద మన కుటుంబవ్యవస్థ ఆధారపడి ఉన్నది. "అందరి సుఖంలో నా సుఖం ఉన్నది. వారికోసమే నా జీవితం" అనే త్యాగభావన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక.


సమాజంలో కుటుంబమే అత్యంత కీలకమైంది. ప్రప్రథమ సమూహం పరివారమే. వ్యక్తి సమాజంలో ఒంటరిగా మనజాలడు. కుటుంబంతో తాను మమైకమై జీవించడంద్వారా ఆనందాన్ని పొందుతాడు. అందుకే పుట్టుకతోనే మనిషికి కుటుంబంతో విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది.


పోషణ, భద్రత కల్పించడం కుటుంబవ్యవస్థలో మౌలికాంశాలు. కుటుంబ వ్యవస్థకు పునరుత్పత్తి ప్రాథమిక లక్షణం. కుటుంబంలో అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతూంటాయి. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, విచక్షణ జ్ఞానాన్నివ్వడం, సంస్కృతిని వారసత్వంగా అందించడం కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.


కుటుంబ భావన, వ్యవస్థ నిన్నమొన్నటిదిగాదు. దీనికి వేలసంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇది వివాహబంధంతోనే మొదలవుతుంది. నాగరికతా సౌరభం లేని ఆదిమమానవుడు పెళ్ళి, ఇల్లు అనే బంధం లేకుండా స్వేచ్ఛగా జీవించాడు. కొంత నాగరికత అలవడిన తరవాత సమూహాలను ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు. వ్యవసాయంచేసి పంటలు పండించడం మొదలుపెట్టాక గుహలనుంచి గృహంలోకి మారిపోయాడు. అదే ఒక పెద్దమలుపు. తాను నిర్మించుకున్న ఇంటిపై, కుటుంబంపై ఎనలేని మక్కువను పెంచుకున్నాడు. వివాహబంధాన్ని వివేచనతో ఏర్పరచుకొని అందమైన కుటుంబాన్ని రూపొందించుకున్నాడు.

వేద కాలం నాటికే నాగరికమైన పద్ధతుల్లో ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన వారి రాతల వల్ల కుటుంబ జీవన విధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదని భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నతశ్రేణిలో ఉండేవని తెలుస్తుంది వేల ఎండ నుంచి విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది ఆ నాడు కుటుంబ జీవనం చాలావరకు సాఫీగా సుఖంగా సాగిపోయిందని అది చాలా నియమబద్ధంగా ఉండేదని తెలుస్తుంది.


కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైనది గౌరవప్రదమైనది అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడిని బట్టి భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నత స్థానం ఇచ్చారు అర్థం అవుతుంది.


అంతేగాక ఆనాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఇతర ఆశ్రమ ధర్మాలు సక్రమంగా కొనసాగుతాయి. అందుకే గార్హస్య జీవితం అతి సుందరమని వారి భావన. పూర్వకాలం నుండీ ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థ నేటికీ దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కొనసాగుతున్నది.


ఉమ్మడి కుటుంబంలో కష్టసుఖాల్ని అందరితోనూ పంచుకోవడం జరిగేది. తద్వారా పరస్పర ఓదార్పు లభించేది.


ప్రతిపనిలోనూ సహాయ సహకారాలూ, సూచనలూ, సలహాలు లభించేవి. అందరూ శుభాశుభాలకు చేదోడువాదోడుగా నిల్చేవారు. ఆనందాన్ని పంచుకొనేవారు. ఇలా వాతావరణం ఆహ్లాదకరంగా, సందడిగా ఉండేది.


చిన్నపిల్లలకైతే మహాసరదాగా ఉండేది. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఒడిలో ఒదిగిపోయేవాళ్ళు. పెద్దల ఆలనాపాలనలో, వాళ్ళు చెప్పే కమ్మని కబుర్లూ, కథలతో ఆరోగ్యంగా పెరిగేవారు. అంతేగాక వాళ్ళ కుటుంబాల గొప్పతనాన్ని, గొప్పవాళ్ళను గురించి తెలుసుకొనేవారు. దేవాలయాలకు వెళ్ళాలన్నా, అంగట్లోకి వెళ్ళాలన్నా, మరెక్కడికి వెళ్ళాలన్నా పిల్లలు పెద్దలతో వెళ్ళటానికే ఉత్సాహపడేవారు. ఇంట్లో అందరికీ పెద్దలపట్ల భయభక్తులుండేవి. తల్లిదండ్రుల సేవ భగవంతుని సేవగా భావించేవారు. ఈ విధమైన జీవనవిధానం వల్ల జీవితపథనిర్దేశం జరిగేది.


పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళ స్నేహితుల ఇండ్లకు వెళ్ళడం, అక్కడ పెద్దవారితో చనువుగా మాట్లాడడం వీళ్ళ ఆలోచనలకు పదును పెట్టేది. సమాజ స్థితిగతులనూ, ఆచారవ్యవహారాలనూ, సంస్కృతి సంప్రదాయాలనూ పిల్లలు ప్రత్యక్షంగా విని, చూసి ఆకళింపు చేసుకొనేవారు.


ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలందరికీ ఒకేసారి భోజనాలు వడ్డించడం అనేది మహాసరదాగా ఉండేది. ఆడవాళ్ళకు అదో అవధానం చేసినంత పనయ్యేది.


ఆటపాటల్లోనూ, కొట్లాటల్లోనూ, అవసరాలను నెరవేర్చుకోవడంలోనూ ఒకరితో ఒకరు పోటీపడేవారు. కాని పెద్దల కనుసన్నలలో, భయభక్తులతో క్రమశిక్షణలో ఉండేవారు. ఏం కావాలన్నా (పిప్పరమెంటో, బిస్కట్టో) ఏదైనా జరిగినా అమ్మమ్మ, నాన్నమ్మలను చేరేవారు. వాళ్ళు కూడా ప్రేమతో దగ్గరికి తీసుకునేవారు. 'అసలు కంటే వడ్డీ'యే ముద్దు కదా!


అలా 'కలిసి ఉంటే కలదు సుఖం' అనే సూత్రం ఆధారంగా సమష్టి కుటుంబం కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చింది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే అమలయ్యేది. స్వార్ధపరతకు తావు తక్కువ. 'మన' అనే భావనకు అందరూ లోనై ఉండేవారు. రైతుకుటుంబాల్లో ఐతే ఇంటిల్లిపాది ఇంటి పనుల్లో, బయటి పనుల్లో పాలుపంచుకొనేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్ళి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది. సిరిసంపదలను పోగు చేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టింది. ఆనాడు. మన ఇతిహాసాలైన రామాయణభారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.


కాలం మారింది. కుటుంబం అనే మాటకు అర్థం, దాని నమూనా మారిపోయింది. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తి స్వేచ్ఛకు ఆర్థిక స్వాతంత్ర్యానికీ, సమానత్వానికీ ప్రాధాన్యం లేక పోవడం, స్వార్ధం పూర్తిగా పెరిగిపోవడం, వీటివల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు అనివార్యమయ్యాయి. చిన్న కుటుంబ భావన బలపడింది. సమష్టి వ్యవస్థ పూర్తిగా సృష్టి వ్యవస్థగా మారింది. తత్కారణంగా జీవన సరళిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునికతవల్ల శ్రమవిభజనలో కొత్త మార్పులు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాల్లో కొత్త ధోరణులు ఏర్పడ్డాయి. ఆర్థికస్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్య్రం అనే మూడింటిపైనే 'వ్యష్టి' కుటుంబం ఆధారపడింది. ఈ వ్యష్టి కుటుంబంలో వ్యక్తిగత గౌరవం, సమాజంలో ప్రత్యేక గుర్తింపు, నిర్ణయాధికారం లభిస్తాయి. అయితే ఇలా వ్యక్తి ప్రాధాన్యత పెరిగి ఉమ్మడికుటుంబ వ్యవస్థ మరుగున పడిపోతుంది.


దీని వల్ల కుటుంబపరమైన వారసత్వ భావనలు అందుతున్నాయా? దేశీయ సాంస్కృతిక, జీవన సంప్రదాయాలూ నిలుస్తున్నాయా? మానవ సంబంధాలూ ఆప్యాయతానురాగాలు ఉంటున్నాయా? ఆర్థిక స్వావలంబనకోసం భార్యా భర్తలిద్దరూ సంపాదించాల్సిన అవసరం ఉన్నప్పటికీ జీవితానికి అదే గమ్యం, అదే లక్ష్యం అవుతున్నది. పిల్లలకు టీవీలు, కంప్యూటర్లే ఆటపాటలౌతున్నాయి. భాష పరిమితికి లోనవుతున్నది. భావం సంకుచితమౌతున్నది. అనుభూతులు లోపిస్తున్నాయి. తల్లిదండ్రులకు పిల్లల సంక్షేమమే తొలి ప్రాధాన్యం కావాల్సి ఉండగా, దానిపట్ల వాళ్ళు తగినంత శ్రద్ధ చూపడం లేదు. అది పిల్లల మనస్తత్వం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నది. తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం మంచితనం, పరోపకారగుణం అందించాలే తప్ప కేవలం డబ్బుకాదని గుర్తించాలి. పిల్లల సమస్త సద్గుణాలకూ, 'ఇల్లే' పునాది కానీ ఆ 'ఇల్లే' కనుమరుగవుతున్నది.


పిల్లలు కేర్టేకింగ్ సెంటర్లలో ..... భార్యాభర్తలు ఉద్యోగాలలో వృద్ధాశ్రమాల్లో పెద్ద వాళ్ళు


ఆ మానవ సంబంధాలు ఏవి? అనురాగాలు ఏవి ? వారసత్వ అనుభూతులు ఎక్కడ? కుటుంబ నేపథ్యం, గొప్పతనం తెలిసే అవకాశం ఏది?


ఆధునికీకరణ, నగరీకరణ, పాశ్చాత్యీకరణ, కంప్యూటరీకరణలు ఈ పరిస్థితికి కారణాలనీ కుటుంబవ్యవస్థ పై ఇవి ఎనలేని ప్రభావాన్ని చూపుతున్నాయనీ సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. యంత్రశక్తి వినియోగం నానాటికీ పంపిస్తారు.  పెరుగుతున్నది. బట్టలు నేయడం, నూనెలు తీయడం మొన్నటి మాట. బట్టలుతకటానికి, నగల తయారీకి, నీళ్ళు తోడటానికి, పొలం దున్నటానికి, చెప్పులు కుట్టడానికి, చివరకు గిన్నెలు కడగటానికీ, కడిగిన చేతులు ఆరటానికి యంత్రశక్తినే వాడటం వల్ల మనిషి బద్ధకస్తుడౌతున్నాడు. చలాకీతనాన్ని కోల్పోతున్నాడు. అనేక రోగాల పాలౌతున్నాడు.


ఈ యాంత్రిక జీవన విధానం వల్ల కుటుంబంలోని అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి. వ్యష్టి కుటుంబంలోని లోపభూయిష్టమైన, స్వార్ధంతో కూడిన జీవన విధానం వల్ల ఈ మార్పులు సంభవించాయి. కుటుంబసభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ, పరస్పరం పంచుకోవాల్సి ఉండగా 'ఎవరికి వారే యమునాతీరే అన్న విధంగా మెలగుతున్నారు. ఈ బలీయమైనకారణాల వల్లే పిల్లల్లో కొందరు అందరూ ఉండీ అనాథలుగా, మరికొందరు సమాజ వ్యతిరేకశక్తులుగా మారిపోతున్నారు. సమాజానికి పెనుసవాళ్ళను విసురుతున్నారు; అశాంతి, హింసలకు ప్రధాన కారకులవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావంతో పాటు, సమాజం, సమవయస్కులు, ప్రసారసాధనాల ప్రభావం కూడా ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కాని ఇప్పటికీ మంచి కుటుంబనేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు వీటన్నిటినీ అధిగమించి సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.


ఇదిలా ఉండగా వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వాళ్ళ ఆలనాపాలనా చూసే ఓపిక లేక, తమకు భారం అనే భావనతో వృద్ధాశ్రమాల్లో చేర్చి పిల్లలు బాధ్యతల్ని వదిలించుకుంటున్నారు. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఆర్ధిక సంబంధాలూ, వ్యక్తిగత స్వార్ధమూ, హక్కులూ వీటన్నిటికంటే మన బాధ్యతలూ మానవ సంబంధాలూ ముఖ్యమని, అవి మన మనుగడకు ఆధారభూతాలనీ తెలుసుకోవాలి.


అలాగని వ్యష్టికుటుంబం వల్ల ఇబ్బంది అని చెప్పలేం. వ్యష్టికుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనలు పిల్లలకు వివరించి చెప్పగలగాలి...... పెద్దల బలాన్ని పొందాలి, బలగాన్నీ పెంపొందించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. మానవశక్తి, యుక్తి, నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. ఎవరి సంపాదన వారికి ఉండటం మంచిదే. అయినా సమస్యలను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. అంతమాత్రాన మానవసంబంధాలు విచ్ఛిన్నం కాకూడదు. యంత్రశక్తి మీదనే ఆధారపడి బద్ధకస్థుడు కాకూడదు. యంత్రశక్తి అంతా ఏదో రకంగా ప్రకృతిపై ఆధారపడే ఉన్నది. ప్రకృతి వనరులను వాడుకోవడం మనకు ధర్మమే కాని వాటిని దోచుకోవడం, నిరుపయోగం చేయడం మన లక్ష్యం కాకూడదు.


మనం చేసే పని ఏదైనా మన సంస్కృతిని, వారసత్వాన్ని, దేశ ఔన్నత్యాన్నీ ఇబ్బడిముబ్బడిగా పెంచి వారసులను ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. అందుకు సమష్టి లేదా వ్యష్టి కుటుంబ వ్యవస్థలు దోహదం చేయాలి.


కుటుంబం అనే హరివిల్లులో అమ్మానాన్నలు, పిల్లలతోపాటు, తాతానానమ్మలు, కూడా ఒక భాగమైతే అందం.. ఆనందం వెల్లివిరుస్తుంది. 'ఇల్లే ఇలలో స్వర్గం' అవుతుంది..


సమాజానికి కుటుంబం వెన్నెముక. మంచికుటుంబం, మంచిసమాజం దీని నుంచి మంచిదేశం, మంచి ప్రపంచం ఏర్పడతాయి. ఇందుకు అందరూ కృషి చేయాలి.


కుటుంబం అనే మాట మధురం. కుటుంబం అన్న భావన తలపునకు రాగానే మదిలో ఏదో అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది. తీపి జ్ఞాపకాలెన్నో గుర్తుకు వస్తాయి.


చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపిన మధుర క్షణాలు, జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దయిన తరవాత సినిమాలా కళ్ళముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కమ్మని కుటుంబం కావాలి.

గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయులెందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి,


ఉమ్మడి కుటుంబం, వ్యష్టి కుటుంబాల మేలు కలయికతో సమానత్వం, ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా; ఆధిపత్యాల పోరులేని, ప్రేమానురాగాలు, విలువలు, మానవసంబంధాలు అంతస్సూత్రమైన ఒక కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాజం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో విలసిల్లుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana