కాళోజి
3. కాళోజి
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు. మంచి ఎక్కడున్నా స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడ గెలుచుకున్నాడు తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు. ఈనేల సాంస్కృతిక ఎదిగిన ఆ వారసత్వంలోనుండి మహనీయుడే - కాళోజి.
"మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు నేను భూమి మీద పడిన. అది 09-09-1914” అని కాళోజి తన ఆత్మకథ 'ఇదీ నా గొడవ'లో తెలిపాడు. కాళోజి 'రట్టహళ్ళి' అనే ఊర్లో పుట్టాడు. ఇది బీజాపూర్ జిల్లాలో ఉన్నది. ఈ ఊరు కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది. కాళోజి చిన్నతనంలో వీరి కుటుంబం కొన్నేండ్లు మహారాష్ట్రలోని 'సాయరాం' అనే గ్రామంలోనూ, కొంతకాలం తెలంగాణలోని ఇల్లెందు తాలూకా 'కారేపల్లి' గ్రామంలోను నివసించింది. 1917 వరకు కాళోజి కుటుంబం హనుమకొండలో ఉండేది. తరువాత మడికొండకు మారడం జరిగింది. తరువాత కాళోజీ అన్న రామేశ్వర రావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. దాంతో కాళోజి పాతబస్తీలోని చౌమహల్లా కాబడిల సెకండ్ ఫారంలో చేరాడు. తరువాత సుల్తాన్ బజార్లోని రెసిడెన్సీ మిడిల్ స్కూల్లో చేరాడు. ఉన్నత విద్యకోసం 1934 ఏప్రిల్ నెలలో వరంగల్ కాలేజియేట్ హైస్కూల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశించాడు. 1939 లో 'లా' పూర్తి చేశాడు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు.
"మా ఇంట్ల ఒక బీరువా ఉంటది. దాంట్ల ఒక అరల కాగితాలు, బట్టలు, నా వస్తువులు అనదగ్గవి ఉంటయి. మా ఇంటికి రోజూ వచ్చే వారెవరికైనా తెలుసు. రామశాస్త్రికి చెప్తే పంపిస్తడు" ఈ మాటలను బట్టి కాళోజి వ్యక్తిగత ఆస్తిలేని నిరాడంబరుడు అనేది తెలుస్తుంది. నిజానికి కాళోజి 'సొంత ఆస్తి రద్దు కావాలనే కమ్యూనిస్టు' కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా, ఎక్కడ తిరిగినా ఈ పూట ఇక్కడ తింటే రాత్రికెక్కడనో, ఈ రాత్రి ఇక్కడుంటే రేపెక్కడనో ఆయనకే తెలియదు. ఆచరణకు, ఆదర్శానికి ఏ మాత్రం తేడా లేని జీవితం ఆయనది.
కాళోజి నిరంతర ఉద్యమజీవి. తన కాలంలో జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ప్రతి విషయాన్ని ప్రశ్నించాడు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. రజాకార్ల నెదిరించి జైలు జీవితం గడిపాడు. నిజాం రాజును ఎదిరించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు కూడా పోరు చేశాడు. తనకోసం కాకుండా, ఇతరుల బాగు కోసం పోరాడే తత్త్వం - సామాజిక స్పృహ కాళోజిలో ఉన్నాయి.
తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన కవి కాళోజి, మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తది. దాశరథి అన్నట్లు "తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి, తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజి.
సమాజ గొడవను తన గొడవగా చేసుకొని "నా గొడవ" పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి నిజానికి అంతర్జాతీయ కవి. నిరంకుశ రాజ్యాలమీద తన జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజి. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో మమైకమైన కాళోజి కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్టకు చేర్చిన కవిత. "కాటేసి తీరాలె" ఇందులోని కసి తెలంగాణ ప్రజలందరిది.
"మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరచి పోకుండ గురుతుంచుకోవాలె కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె"
అంగన్
సాహిత్యంలో భాషనుపయోగించే విషయంలో కాళోజికి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆయన దృష్టిలో భాష రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి "ఐడి పలుకుల భాష". రెండవది జనం నిత్యవ్యవహారంల వాడే "పలుకుబడుల భాష". ఒక రకంగా చెప్పాలంటే మొదటిది గ్రాంథిక భాష, రెండవది వ్యావహారిక భాష, ఈ వ్యావహారిక భాషయే జీవభాష, ఏ భాషకైన జీవధాతువు మాండలికమే. కాళోజి ఎప్పుడూ జీవభాషవైపే మొగ్గు చూపాడు.
“రెండున్నర జిల్లాలదే దండి బాస అయినప్పుడు తక్కినోళ్ళ నోళ్ళయాస తొక్కి నొక్క బడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు"
అంటూ కాళోజి ఆంధ్ర ప్రాంతపు భాషావాదులను హెచ్చరించాడు. కాళోజి కాంగ్రెసు పార్టీలో సభ్యుడు. కాంగ్రెసు పార్టీ తరపున ఎమ్.ఎల్.ఏ గా పోటీచేసి ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ నియమనిబంధనలను పాటిస్తున్నప్పటికినీ. 'పాతివ్రత్యం' అన్న మాటకు వ్యంగ్యార్థ సూచకంగా 'పార్టీవ్రత్యం' అన్న పదబంధాన్ని కాళోజియే తయారుచేశాడు. పార్టీయే దేవుడు, సర్వస్వం అని భావించటం, పార్టీ తప్పు చేసినా సమర్థించడం, ఇటువంటివి కాళోజికి ఏ మాత్రం ఇష్టం ఉండేవి కావు. తలలేనితనాన్ని ఒప్పుకోడు. వ్యక్తిత్వం ఉండాలని, ధనానికి లొంగి నలుగురులో పలచన కావొద్దని,
తలెత్తుకొని తిరగగలిగే ధీర గుణం ఉండాలని కాళోజి భావించాడు. "ప్రాంతేతరులే దోపిడిచేస్తే పొలిమేరదాక తన్ని తరుముతం! ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం!" అని తెలంగాణ మనస్తత్త్వాన్ని చిత్రించాడు.
"వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి"
అని ఎలుగెత్తి చాటాడు. తెలంగాణ మాండలికాన్ని ఆంధ్రావాళ్ళు హేళన చేయడాన్ని ఏ మాత్రం సహించబోమని కాళోజి ఆ రోజుల్లోనే గట్టిగా చెప్పాడు. రాజకీయ వివక్షతతోపాటు, భాషా వివక్షను చూపే ఆంధ్రులను ప్రశ్నించాడు.
"తెలంగాణ ప్రజలు సల్పు / తెలంగాణ ఉద్యమాన్ని రౌడీ అలజడి అంటూ బాకాలూదెడి ఆంధ్రుల దెంతపాటి సభ్యతంట / తెలంగాణ "యాస" నెపుడు యీసడించు భాషీయుల / సుహృద్భావన ఎంతని"
అని ప్రశ్నిస్తూ కవిత్వం రాశాడు.
కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. మతంపేరిట, కులంపేరిట మనుషుల్ని హీనంగా చూడటం, అవమానించటం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన రీతుల్ని తెలియజెప్పాడు. వ్యంగ్యం, హేళనలతో సాగిన కథ విభూతి లేక ఫేస్పీడర్. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకల్ని, అక్రమాల్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో, లౌక్యంతో రాజ్యపాలన సాగింది. ఈ పరిస్థితుల్ని రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుని ఉదంతాలకు ముడిపెట్టి రాసిన కథ 'లంకాపునరుద్ధరణ'. దీనిపై విసిరిన వ్యంగ్యాస్త్రమే ఈ కథ, రాతి బొమ్మకు గుడికట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు. ప్రాణమున్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసిరిన వ్యంగ్యాస్త్రం 'భూతదయ'. కాళోజి కథలన్నీ ఒక రకంగా రాజకీయ కథలు, వీటిలో సాహిత్య విలువలు కాపాడడానికి ప్రయత్నించాడు.
ఎనిమిది దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ముడిపడ్డ బతుకు ఆయనది. వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు. మంచి అన్నది ఎక్కడ ఉన్నా స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు. ఆలోచించగలవారు ఆయన వాదనల్లోని సమర్ధనల్ని గుర్తించారు. ఈ విధంగా తెలంగాణేతరుల మనసులను గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ వైతాళికునిగా కాళోజిని పేర్కొనాలి. ఈ నేల సాంస్కృతిక వారసత్వంలోంచి ఆయన ఎదిగాడు. మనుషులను ఆయన అర్థం చేసుకున్న తీరు చాల విశిష్టంగా ఉంటుంది. ఆయన చాలాసార్లు ప్రహ్లాద చరిత్ర కథ చెప్పేవాడు. ఆ కథ ఆయనకు నచ్చింది. తండ్రి హిరణ్యకశిపుడి నిరంకుశత్వాన్ని అంత చిన్నవయసులోనే ప్రాణాలకు తెగించి ఎదిరించిన ప్రహ్లాదుడి పాత్ర ఆయనకు చాలా నచ్చింది. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించాడు. అన్యాయాన్ని ఎదిరించినోడే తనకు ఆరాధ్యుడని లెక్కలేనన్నిసార్లు చెప్పాడు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని భావించాడు. ఓటుహక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకొని తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి ఆయన ప్రవర్తనలో అడుగడునా కనిపిస్తుంది.
వ్యక్తిత్వం, స్వేచ్ఛ అనే రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని చెప్పాడు. నిర్భయంగా మాట్లాడడం ఆయన స్వభావం. దీనికి ఉదాహరణగా 1948లో జరిగిన ఈ సంఘటన నిలుస్తుంది. "వరంగల్ సెంట్రల్ జైలులో కాళోజి తదితరులున్నారు. అప్పుడు బురుజు మీద ఉన్న ఒక పోలీస్ రాత్రి ఎనిమిది గంటల సమయంలో వీళ్ళను ఉద్దేశించి “తుపాకీతో వీళ్ళను కాల్చి చంపినా పాపం లే"దని అక్కసు వెళ్ళగక్కాడు. అది విన్న కాళోజి అతని దగ్గరకు పోయి "ధైర్యముంటే కాల్చవోయ్ అని సవాల్ చేశాడు. ఆ సమయాన మిగతా ఖైదీలండరు భయపడ్డారు." కానీ కాళోజి ఇట్లాంటి సందర్భంలో వెనకా ముందులు చూడడు. ఇదీ అతని నిర్భీతి.
కాళోజి జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నాడు. "నీ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కుల కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చి పోరాడుతా" అన్న మాటల్ని కాళోజి ఎప్పుడూ గుర్తుచేసేవాడు. ఆ మేరకు బతికాడు, అందుకే మహాకవి శ్రీశ్రీ కాళోజిని ఫ్రెంచికవి "లూయీ ఆరగాన్"తో పోల్చాడు. 1953 లో మహబూబ్నగర్ జిల్లా ఆలంపురంలో జరిగిన 'నా గొడవ' పుస్తకావిష్కరణ సభలో ఈ మాట అన్నాడు. యుద్ధంలో ఫ్రాన్స్ కవులంతా పారిపోతే లూయీ అరగాన్ ఒక్కడే దేశంలో నిలబడి మహా విశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాశాడు. కాళోజి కూడా అలాంటి వాడేనని శ్రీశ్రీ ఉద్దేశం. నిజమే! తెలంగాణ ఇటీవలి కాలం వరకు ఒక యుద్ధ భూమి. అందులో నిలబడి కాళోజి ప్రజలవైపుగా కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. నిరంకుశ ప్రభుత్వాల్ని ధిక్కరించాడు. అందుకే ఆయన ఉద్యమకవి.
"మా నాయనది గాంధీ సూఫీతత్వం. అంటే మతసామరస్యం. సాధుసత్పురుషుడని హిందువులొస్తరు, ముస్లింలొస్తరు, మా నాయన ముస్లింల సెయింట్స్ని, హిందూ సాధువులని కలిసేవాడు. ఆయనకు కుల పట్టింపుల్లేవు. అట్లాంటి వాతావరణంలో పెరగడంవల్ల మాకూ ఈ రకమైన భావాలు ఏర్పడ్డాయి" అని కాళోజి చెప్పుకున్నాడు. అందుకే ఏదో ఒక మతం పక్షాన ఆయన ఎన్నడూ కన్పించలేదు. కాళోజి తన అభిప్రాయాలకు సన్నిహితమైన భావాలు ఇతరభాషల్లో కనపడ్డప్పుడు వాటితో తాదాత్మ్యం చెంది తెలుగు పాఠకలోకం కోసం అనువదించాడు. ఖలీల్ జిబ్రాన్ రాసిన “దిప్రొఫెట్ ను 'జీవనగీత'గా రచించాడు.
తన చావు తర్వాత తన భౌతికదేహం వైద్యవిద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడాలని ఆశించాడు. 13-11-2002 నాడు మరణించిన పిదప ఆయన పార్థివదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు.
బ్రతుకంత దేశంగా, ప్రజలుగా, ఉద్యమాలుగా బ్రతికిన, ప్రజాకవి కాళోజి నారాయణరావు, తన సామాజిక జీవితం ద్వారా ఆయనిచ్చిన స్ఫూర్తి భావప్రసారం ముందుతరాలకు శక్తినిస్తుంది. ఆయన జీవితం, కవిత్వం భావితరాలకు ఆదర్శం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి