చిందు ఎల్లమ్మ
చిందు ఎల్లమ్మ
మూలం : డా|| కె. ముత్యం
జానపదకళల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న కళారూపం చిందు బాగోతం. తన అలంకారంలో స్త్రీ, పురుష పాత్రలను సమర్థంగా పోషిస్తూ, ఆబాలగోపాలాన్ని రంజింపచేసిన చిందు కళాకారిణి చిందు ఎల్లమ్మ. చిందు బాగోతం ప్రదర్శన గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
నేను చిందుల ఎల్లమ్మను. మాది నిజామాబాద్ జిల్లాలోని చిన్నాపురమనే పల్లెటూరు. మేము మాతాతల కాలం నుండి ఇదే ఊర్ల ఉంటున్నం. నాకుబాగా యాదికున్నది. ఒకనాడు మా నాయన ఏమన్నడంటే "ఆ శెరువు కట్ట కడుతున్నప్పుడు పుట్టినవు బిడ్డా" అని. దాన్నిప్పుడు మనం నిజాంసాగర్ అంటున్నం. నేను బాసరల పుట్టిన్నట. అందుకే మా నాయన నాకు సరస్వతి అని పేరు పెట్టిండు. తర్వాత ఎల్లమ్మ తల్లిగ మార్చిండ్రు.
మాచిందులోల్లకు పూర్వం ఇనాములేమి లేకుండె. చిందాట ఆడుకుని బతుకుతుండేటోళ్లం. మా ఊళ్లో ఎక్క అయ్యగారు అని ఒకాయన చదువు చెప్పుతుండె. ఆయన దగ్గరకు సదువుకునెటందుకు పోదామనుకుంటే మాకు పలకలు దొరకక పోయేవి. అక్షరాలు పెట్టిచ్చినందుకు మేము ఆయనకు ఏమీ ఇచ్చెటోళ్లం గాదు. ఎందుకంటే ఇచ్చెతందుకు మాతాన ఏముండేదిగాదు! ఇంకోముచ్చట జెప్పుడు మర్చిపోయిన! మాతాన పలకలు లేకుండే అని చెప్పిన గదా! అయితే సక్కగున్న పెద్ద బోకె పెంకలు ఏరుకచ్చుకొని దానిమీద బొగ్గుతో రాస్తుంటిమి. తర్వాత ఎప్పుడోగద! బలపాలచ్చినయి. అయ్య వారి దగ్గర పెద్దబాలశిక్ష పుస్తకం ఉండేది. ఎప్పుడూ దాన్నే సదివెటోళ్లం. అప్పుడు అదే మాసదువు. సదువుతానే నేను చానా. కష్టపడ్డ బిడ్డా! మాకు అప్పుడు భూములు లేకుండె. తీనణాకు (తీన్ అణాలు అంటే 18 పైసలు) మానెడు వడ్లు అస్తుండె.
నేను మరీ చిన్నగుండంగ ఊర్లె రెండు, మూడు భాగోతాలే ఆడెటోల్లు, మావోళ్లకు అప్పుడు ఎక్కువ ఆటలు రాకపోతుండె ఎల్లమ్మాట, చెంచులక్ష్మి, సారంగధర ఈ మూడు ఆటలే ఊకే ఆడుతుండె.
మాఊర్ల అందరికి సిన్నప్పటినుండి భాగోతం నేర్పుతుండె. పెద్దోళ్లు నాకు నాలుగేండ్లు ఉండంగ నా ముఖంకు రంగు ఏసిండ్రు. బాలకృష్ణుని ఏషం గట్టిచ్చినరు. మావోల్లు పడ్డ ఎనుక పాట పాడితే నేను పర్దముంగట ఎగిరిన. ఇగ అప్పటి నుండి మాతల్లి దండ్రులు యేషం ఏయించి నాచేయి పట్టుకపోయి తోలేసి ఎగురుమని అంటుండె. అట్ల నాకు భాగోతం ఆడుడు అలవాటు చేసినరు. నేను ఎనిమిదేండ్లప్పుడు బాలకృష్ణుని యేషం, తర్వాత రంభ యేషం కడుతుంటిని.
ఇగ అట్లనే ఆడుకుంట నేను పెరిగి పెద్దగయ్యేదాక ఆ యేషాలే ఏసిన, ఆడికెల్లి ఇగ పెద్దయేషాలు అంటే... అక్కయేషం, అత్తయేషం, బబ్బవాహనల చిత్రాంగద, సుందరకాండల సీత, సతీసావిత్రిల సావిత్రి యేషాలు ఏసిన, అట్లనే రాజు, వాలి, ధర్మాంగుడు, కుశలుడు, హనుమంతుడు ఇట్ల మగ యేషాలు కూడా కడుతుంటిని.
భాగోతంల అంబకీర్తన పాడిపిచ్చినమంటే ఇగ అయిపాయె ఆట శురైందన్నట్టే. భాగోతంలో రంభ యేషం వచ్చినంక గోపాల కృష్ణుని యేషం అస్తది. "రంభా ఊర్వశులమమ్మా మాయమ్మా" అని పాడుకుంట పిల్లల్ని పర్దముందు ఆడిపిస్తే అది అంబకీర్తన అన్నట్లు. అంబకీర్తన అంటే ప్రార్థననే. ఇగ ఆట మొదలు వెట్టుడే.
సిన్ని కృష్ణుడనురా - బలువన్నెలు దెలిపెదరా
చెన్నుమీరగ - గొల్లభామల చెంత జేరెదనురా...
అని పిల్లలతో పాడిపించి, భాగోతం మొదలు పెడతం, పర్డ ఎనుక యేషాలు తయారయ్యెడిదాక ఇదే ఉంటది. ఎందుకంటే అటు పిల్లలకు నేర్పినట్లుంటది. ఇటు యేషాలు తయారైనట్లుంటది. అసలు భాగోతం మొదలు పెట్టినప్పుడు ముందుగల్ల గణపతి ప్రార్ధన, సరస్వతి ప్రార్ధన చేస్తం. తర్వాత భాగోతం మొదలయితది.
కొత్తది ఏదన్న ఇన్పిచ్చిందంటే ఆ పాటనే ఊకేపాడుతుంటిని, మాతాత అంటుండె "నీకు కీర్తి రావాల, తల్లిదండ్రులకు పేరు దేవాల, రాజ్యం మీద పేరు నిలపాల" అని.
ఆడుతుంటె.. అటనే ఇట్ల భాగోతాలు మా ఊర్లనే గాక, మాచుట్టు పక్క ఊర్లల్ల కూడా ఆడుతుంటిమి. అట్లనే బాన్సువాడ, మద్నూరు, దేగ్లూరులో గూడ ఆడినం. షాపురం, సైనిపురం, అద్దంపురం మీదికెల్లి నర్సాపురం (మెదక్) దాక పోతుంటిమి. ఇట్ల మస్తు ఊర్లు తిరిగి ఆడుతుంటిమి. యాడ వానాకాలం వస్తే ఆడనే ఉంటుంటిమి.
చిందుభాగోతం:
భాగోతం అన్నా యక్షగానం అన్నారెండూ ఒకటే... చిందు భాగోతానికి పేరు రావాలని చిందు యక్షగానం అంటం, గని తేడా ఏమీ లేదు...
చిందోల్ల ఆట అంటే పెద్దోల్లు (పై కులస్థులు) రారని చిందు యక్షగానం అంటం.
భాగోతం పొద్దుగాల్ల పదిగొట్టంగ మొదలైతే, రాత్రి ఆరయితది. యేడు అయితది పూర్తి అయేసరికి... గూట్లే దీపాలు వెట్టే యాల్ల అయితదనుకో...
మేం యక్షగానం పుస్తకాలు తీసికొచ్చి సదువుకుంటం... సదివి దాంట్ల ఇష్టమైనవి తీసుకుంటం. లేకుంటే ఆకులు మార్చేస్తం. పక్కన పెట్టేస్తం... సారమున్నది తీసుకొని సారంలేనిది ఇడిసిపెడతం.
ఒకటే పుస్తకంల కెల్లి చిరుతల భాగోతులు, దాసరోల్లు, మేము తీసుకున్నా మా దరువులకు అనుకూలంగా మార్చుకుంటం. "ఇన్నవ సీత..." అని చిరుతల దరువుకు అనుకూలంగా వాళ్లు మార్చుకుంటే, “ఇన్నావా... సీతా... మాతా..." అని మేం పాడుతం. సారమంతా అదే. పాటంతా అదే. వేషమూ అదే. కాని దరువులే వేరు.
భాగోతంల ఏ పాటకు ఆ పాట రాగం వేరేగుంటది.
ఇప్పటి రాగాలు అల్కగ (తేలిక సులువు) ఉంటాయి. అప్పటియి గొట్టుగ ఉంటయి.
ఆట తాళం, ఆదితాళం ఎక్కువసుకో భూపాలం, కాంభోజ, మోహన, అసావేరీ రాగాలల్ల పాటలు, పద్యాలు పాడుతం. అట్లనే రూపక, ఆటతాళం... ఇట్ల అన్నీ పాడుతం...
జుళువ తాళం - ఉరుకుడు మీద, చల్తీగా పడే తాళం... నటన చల్తీ పోవాలంటే జుళువ తాళం పడతది.
అనరో తమ్ముడా!
వినుము తెలిపెదనిప్పుడు... విడువక జేసే విప్రుడనేనే...
రాజు పాత్రలకు పడతది. దీనిల అడుగు, తాళం, రాగం చల్తీగా, కలిసి నడుస్తయి. సుత్తిగంతు, కత్తెర అడుగు, కుంగి ఒప్పెనము, చక్రములు అనేటి గంతులు, అడుగులు ఉంటయి. ఇవ్వి మా భాగోతములోనే ఉంటయి మరి. ఇవన్నీ మా తాతల నుండి వస్తున్నై. ఇక దరువులు ఉంటయి మా భాగోతంల... వీరాభిమన్య యక్షగానంల సుభద్ర యేషం వచ్చింది.
16...
నా పేరు సుభద్ర యనే - నాతి యందురే
గోపాల కృష్ణుని నామమెపుడు - కోరియుండునే చండ పరాక్రముడైన మా మామ పాండు యందురె బలవంతులైన ధర్మ భీమ - బావలందురే మొలకైన నకుల సహదేవులు - మరుదులందురే....
సుభద్ర తన కథ జెపుతున్నదన్నట్లు దరుపు సాగుతది.
మా చిన్నప్పుడు మద్దెల, తాళాలు, గజ్జెలు గివ్వే వాయిద్యాలు ... తర్వాత వచ్చె... గని ముందు కాలంల పూ... పూ... అని ఊదేటిది బుర్ర ఉంటుండె... దాన్ని వుంగి అంటుంటిమి... సన్నాయి పలికేటపుడు సుతి (శృతి) కోసం ఒక బాజా ఉండదా... గసుంటిది.
ఈ పుంగిని భాగోతం మొదలైన కెల్లి అయిపోయిందాకా ఊదాల... ఊడీ ఊదీ దమ్ముకు అస్తుండె మాకు... ఒక్కల్లకుF దమ్ముకు అస్తే ఇంకొకల్లు తీసుకుంటుండ్రి.
మొగోల్లూ ఊదుతుండ్రి... ఆడోల్లూ ఊదుతుండ్రి.
ఎండిపోయిన ఆనిగెంకాయను (సోరకాయ) బుర్ర కాయ అంటం గద... దానికి తొడిమె దగ్గర రంద్రం చేసి, పీక పెట్టి, మైదం (మైనం) పూసి పుంగి తయారుజేస్తుంటిమి... పాటకు స్వరం కలుపాలని... అట్ల పుంగి జేసుకుంటుంటిమి...
తబలా, పేటి (హార్మోనియం), తాళం, గజ్జెలు, మావోళ్లే వాయిస్తరు. ఒక యేషం వాదం అయినంక ఆయన వోయి పేటి మీదనో, మద్దెల మీదనో (వాయిస్తూ) కూసుంటడు, అట్లనే యేషం తోటి. ఆయనక వాదం మళ్లా వస్తే పరదముందుకొస్తడు, మరొకళ్లు వోయి ఆయన జాగల కూసుంటరు.
యేషాలు కట్టెటోళ్లకి వాయిద్యాలు వాయించుడు రావాల. ఒకలు కాకపోతే మరొకళ్లు అందుకోవాల గద.
మా భాగోతంల తెర వెనక పల్లవి ఉండాలె. అది పెద్దల సందీ ఉన్నది. దాన్ని 'వెనక పల్లవి' అంటం...
అది లేకపోతే పాట, ఆట రుచి రాదు. తైతకధోం తకధోం అని వెనక పల్లవి పాడేటోల్లు అన్నదాకా తెరముందాడే. మా యేషాలకు కాలు లెవ్వనే లెవ్వది... ఒక పాట, దరువు అయిపోయినట్లయితది.
మేం పాడుతుంటె వెనుక పల్లవి అందుకుంటరిగ మావోల్లు...
ఇగ అస్సలు సంగతి బుడ్డరఖాన్ యేషం. ఆ యేషం సూసెటోళ్లను కడుపుబ్బ నగిపిస్తది. అది లేకుంటే మా భాగోతంకు నిండుదనమే లేదు.
భాగోతంల ఎవరి పాత్రలు వాళ్ళకే వుంటయి. వాళ్లు లేరనుకో... మేమే సదురుకుంటం....
సారంగధర, చెంచులక్ష్మి, సతీసావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాంధాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీ తులసీ, బబృవాహన, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, అల్లీరాణి, గంగా కళ్యాణం, రామదాసు చరిత్ర, సుగ్రీవవిజయం - ఇట్లా నేను ఇరవై ఐదు భాగోతాలల్ల మేటి యేషాలు యేస్తుంది... అవసరమయితే మగ యేషాలు గడుతుంటి, మేటియే, ఆ యేషం ప్రభ దానిమీదికి తెప్పిస్తుంటి.
వాటి మాటలు, పాటలన్నీ రూఢిగా ఉంటయి. మరిచిపోకడలేదు. మల్ల మల్ల సూసుడు లేదు. సదువుడు లేదు.... దీనికి ఇది దీనికి ఇది... అని మనుసుల ఉంటది.
ఎవరన్నా ఆడుతున్నా, పాడుతున్నా, వచనం చెప్పినా అవన్నీ మా తలకు ఎక్కించుకుంటం...
ఈ విధంగా పాడితే ఈ విధంగా ఆనాల అని మనసుకు పడతది...
ఉండేతందుకు మాదిగిండ్లల్ల జాగలేకుంటే సెట్ల కింద ఉన్నరట. ఇట్ల కష్టపడ్డరు మా సిందోల్లు పిడీలసంది. మావోల్లను కల్లుతాగి యేషం కట్టనీయము.
మా చిందుకళ భగవంతుని దయవల్ల ఇప్పుడు పైకెక్కింది గని, హీన పుట్టువడి ఉండె. ఎవరు గానకపోతుండె.
దావఖాన్లకు పోదమంటెగాని, రోగమొచ్చి ఇంత కపూరం (తినే కర్పూరం) ఏసుకుందామంటే కూడా పైసల్లేకుంటుండె = అప్పుడు! అట్లనే కొంతమంది సనిపోయిండ్రు. ఊర్ల మాలోల్లకు నీరటి పసంట. ఇంత యెవసమంట (వ్యవసాయం) ఉంటది. అట్లనే మాదిగోలకి సెప్పులు చేసే కస్పి (వృత్తి) ఉన్నది. బండి జోల్లో, ఆరెకట్టో యేసిస్తే కాపోల్లు ఇన్ని ఇత్తులు. (గింజలు) పెడతరు. ఈళ్లు బతుకుతరు. మాకేమున్నదయ్యా? భాగోతం ఆడాల. బతకాల
పాతరోజుల్ల భాగోతమాడితే ఏం దొరుకుతుండె. ఎట్ల బతికిండ్రో మా చిందోల్లు 'ఏమో! ఏండ్లకమాన...! (తరబడి) మేం దసరకు పెట్టె పూజ చేస్తం.
ఇగ దీపావళి అయినంక ఊల్లల్లకు బయల్దేరితే సంకురాత్రి, శివరాత్రి దాకా బాగోతాలు ఆడుతనే ఉంటం ఊర్లల్ల.
మళ్లీ వానాకాలం అప్పుడే ఇంటికొస్తం. ఆరుద్రకార్తెకు ఊరంతా అడివిపాలైతరుగద ఇగ... మమ్మల్ని ఎవరు చూస్తరు. ఇగ అప్పుడు అడక్కచ్చుకున్నదుంటే తింటం. లేకుంటే బాకీ తెచ్చుకుంటం. కొందరు కూలీకి పోతరు.
ఈ వయసుల నేను కూడా మా మేళం తోటి పోతా. లేకుంటే 'ఎల్లమ్మ బృందం' అని ఎట్లంటరు.
మాకు అందరి కళారూపాలు నచ్చుతయి. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది. ఆమె కథలు మంచిగ చెపుతది... నాకు మనసౌతది. అది శారదకాల్లది.
ప్రజలు మమ్ముల ఎప్పటినుంచో బతికించుకుంటున్నరు గనీ, సర్కారుమాత్రం మమ్ములను నటరాజరామకృష్ణవల్ల పట్టించుకున్నది. ఒకసారాయన చిందు పాడమని అన్నడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడినం. తన షాలువాతీసి నాకు కప్పిండు. సింధును సర్కారుకు గుర్తుజేసిండు ఆయన. మాకు సర్కారును సూపిచ్చిండు.
ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు. 'చిందుల ఎల్లవ్వది సాగుతది ఇట్ల' అంటారు ఇతర కళాకారులు.... దాసుడు (దాచిపెట్టడం) ఏంటికి ఉన్నది చెప్పాల...! ఇగ ఇట్లనే చెప్పుకుంట పోతం... బతుకంతా...
తన చిందుగానంతో, నటనతో, తెలంగాణతోపాటు అనేక ప్రాంతాల వారిని మెప్పించిన కళాతపస్విని చిందుఎల్లమ్మ. 2005 సంవత్సరంలో నవంబరు 9వ తేదీన నిజామాబాదు జిల్లాలో అమ్లాపూర్లో మరణించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి